అష్టాదశ శక్తిపీఠం-6
శ్రీశైలే భ్రమరాంబికా
శ్రీ భ్రమారాంబా దేవి ధ్యానం
శివ పార్శ్వ స్థితా మాతా శ్రీశైలే శుభపీఠకే
భ్రమరాంబా మహాదేవీ కరుణారస వీక్షణా
ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు శ్రీశైలం కలదు. ఇది పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది అయిన శ్రీ మల్లిఖార్జున లింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అయిన శ్రీ భ్రమరాంబికా పీటమును శ్రీశైలం నందు దర్శించగలము. సతీదేవి కంఠభాగము పడినచోటుగా ప్రసిద్ధి చెందినది.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ పీఠముగా పరిగణించబడుతోంది. ఆలయ ప్రశస్తి స్కందపురాణం, శ్రీశైలఖండము, బ్రహ్మాండపురాణం, శివపురాణం, శేషధర్మము మొదలగు పురాణాల్లో వుంది. మార్కండేయ పురాణంలో, దేవి సర్వోత్పత్తి గురించి ప్రస్తావించబడింది. దేవి తన తొమ్మిదవ అవతారంలో అరుణుడు అనే రాక్షసుని భ్రమరాలు (తుమ్మెదలు) సహాయంతో వధించి, జగతికి శాంతి చేకూర్చినందున, భక్తులు దేవిని ”భ్రామరి”గా కీర్తించారు. ప్రకృతి రూపిణియగు పరాశక్తిని ”భ్రమారాంబికా”గా వర్ణించారు.
శ్రీశైల స్థలపురాణములు అనేకం. శిలాదుడు అను మహర్షి మహాశివభక్తుడు. అతనికి యిద్దరు కుమారులను పరమేశ్వరుడు అనుగ్రహించినాడు. వారే నందికేశుడు మరియు పర్వతుడు. వీరు కూడా గొప్ప శివభక్తులు. వారి కోర్కెల ప్రకారము నందికేశుడు స్వామివారికి వాహనము గాను, పర్వతుడు స్వామివారి నివాస స్థలముగాను సేవలు చేయుచున్నారు. స్వామివారు వెలిసినప్పటి నుంచి పర్వతుడు ”శ్రీ పర్వతము”గా ప్రసిద్ధిచెందినాడు. కైలాసం నందు విఘ్నేశ్వరునిచే పరాభవం పొందిన కుమారస్వామి కోపించి, శ్రీ పర్వతానికి చేరుతాడు. పుత్రుని ఎడబాటు సహించలేని ఆదిదంపతులు శ్రీ పర్వతము చేరి నివాసం ఏర్పర్చుకొంటారు.
మల్లిఖార్జున సామ్రాజ్యమును చంద్రగుప్తుడు అను రాజు పాలించుచుండెను. ఇతని కుమార్తె చంద్రావతి కూడా తండ్రివలె గొప్ప శివభక్తురాలు. యౌవనదశలో నున్న చంద్రావతిపై చంద్రగుప్తుడు అమానుష చర్యకు పూనుకొంటాడు. తండ్రి అమానుష చర్యకు భయపడి శ్రీశైలం చేరి, స్వామిని మల్లెపూలతో అర్చించి, అత్యంత ప్రీతిపాత్రమైనది. మల్లెపూలతో అర్చించుట వలన స్వామికి మల్లిఖార్జునుడుగా పేరు వచ్చింది. ఒకనాడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఆమె ప్రార్ధనను అంగీకరించి, చంద్రమాంబ అనుపేరిట తన దేవేరిగా స్వీకరించాడు. చంద్రావతి శ్రీ భ్రమరాంబికాదేవే అని కొంతమంది వాదన. పూర్వం నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు గల శివాలయం చుట్టుప్రక్కల చెంచుజాతివారు నివసించుచుండెడివారు. చెంచుజాతి వారి కన్యను స్వామి వివాహమాడాడని ఒక గాథ వుంది. చెంచుజాతి వారు స్వామిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన జరిగే ఉత్సవాలలో రథంలాగే కార్యక్రమమును చెంచుజాతివారు తమ వంతుగా చేపట్టి, తమ భక్తిని ప్రదర్శించుతారు. కర్ణాటక రాష్ట్ర ప్రాంతములో మరో గాథకలదు. వీరు మల్లయ్యను చెవిటి మల్లయ్యగా సంబోధించుతారు.
సర్వేజనా సుఖినోభవంతు
- రామ కృష్ణంరాజు గాదిరాజు