అమ్మవారి యొక్క విలాసము ఎక్కడ...!?

శంకరులు, "సౌందర్యలహరి" లోని ఎనిదవ శ్లోకాన్ని, అమ్మవారి యొక్క విలాసమును వివరిస్తూ, ఇలా రచించారు.
"సుధాసింధో ర్మధ్యే - సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపో - పవనవతి చింతామణి గృహే
శివాకారే మంచే - పరమశివపర్యంక నిలయామ్
భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్"
అమృత సముద్రము మధ్యలో నెలకొనివున్న మణిద్వీపములో, కల్పవృక్షములతో నిండిన తోటలలో, చింతామణి గృహములో, శక్తి స్వరూపమైన త్రికోణాకారంలో, పరమశివుడు అనే శయ్యపై, జ్ఞాన స్వరూపమై, ఆనంద ప్రవాహముగా కొలువైన ఉన్న అమ్మవారిని కొందరు ధన్యులు మాత్రమే గ్రహీంపగలరని అన్నారు శంకరులు ఈ శ్లోకము ద్వారా.
స్వర్గలోకము ఎందుకంత గొప్పది అయ్యింది అంటే, అక్కడ బిందువు అంత అమృతము ఉంది, ఒక కల్ప వృక్షము మరియు చింతామణి కూడా ఉన్నాయి. కానీ అమ్మవారి యొక్క మణిద్వీపం అంతా వాటితోనే నిండిపోయి ఉన్నది. శంకరులు రచించిన ఈ శ్లోకానికి టీకా తాత్పర్యం గ్రహించి ఏమి ప్రయోజనము లేదు. శంకరులు నిగూడంగా సూచించిన అంతరార్ధాన్ని గ్రహించవలసి వున్నది. శంకరులు సూచించిన ధన్యులు ఎవరంటే, ఎలాగో ఒకలాగా సాధన ప్రారంభించిన వారు అని అర్థం. అమ్మవారి యొక్క సాధన ఎప్పటికీ అసఫలీకృతం కాదు. ఈ శ్లోకము ద్వారా శంకరులు సూచించిన సాధనా మార్గమును గ్రహించవలసి ఉంది.
అమ్మవారి యొక్క పూజ రెండు విధములు.
సమయాచార పూజ మరియు కులాచార పూజ.సమయాచార పూజ అనగా అంతర్ పూజ, కులాచార పూజ అనగా బాహ్య పూజ.
"వియచ్చక్రము" అంటే వియత్తులో, అంటే ఆకాశములో పూజింపబడే చక్రమని, శ్రీ చక్రమునకు మరియొక అర్థమున్నది.మన శరీరమే శ్రీచక్రము. మన హృదయమే అమ్మవారి యొక్క నివాసము. దహరాకాశ అనగా హృదయములో పూజ చేసేవాడిని అదృష్టవంతుడు అన్నారు శంకరులు. యోగ మార్గాన్ని అనుసరించి సహస్రారములోని బైందవ స్దానములో జ్ఞానానంద స్వరూపిణి అయిన మహదేవిని దహరాకాశములో పూజించే ధన్యులకు అమ్మవారి యొక్క విలాసము అనగా అడ్రస్సు దొరుకుతుంది అని చెప్తున్నారు శంకరులు.
శ్రీ శంకర భగవత్పాద విరచిత
సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
- శివకుమార్ రాయసం