అమ్మవారి రూపము...!? అమ్మవారి నామము...!?

శంకరులు, "సౌందర్యలహరి" లోని ఏడవ శ్లోకాన్ని, అమ్మవారి యొక్క మూడు రూపములను వివరిస్తూ, ఇలా రచించారు.
"క్వణత్యాంచీదామా - కరికలభకుంభస్తనభరా
పరిక్షీణా మధ్యే - పరిణత శరచ్చంద్ర వదనా
ధనుర్బాణాన్ పాశం - సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః - పురమధితు రాహోపురుషికా".
చిదగ్ని కుండ సంభూతా అంటూ మొదలుపెట్టి, సర్వాభరణ భూషితా నామము వరకు అమ్మవారి యొక్క రూప వైభవాన్ని విశ్లేషించారు వశిన్యాది వాగ్దేవతలు. 'శాతోదరీ, శరత్ చంద్రనిభాననా' మరియు మరికొన్ని నామములు కూడా అమ్మవారి యొక్క రూప వైభవాన్ని విశ్లేషిస్తాయి. అమ్మవారి యొక్క ఒడ్డాణము దగ్గరకు వచ్చే సరికి, ''క్వణత్యాంచీదామా'' (క్వణత్ అంటే మోగుచున్న, కాంచీదామా అంటే ఒడ్డాణము/మొలనూలు.) అన్నారు శంకరులు,
"రత్నకింకిణికారమ్య రశనాదామభూషితా"
(అమ్మవారి యొక్క ఒడ్డాణము యొక్క రత్నములతో పొదిగబడిన మువ్వలు రమ్యముగా శబ్దము చేస్తున్నాయి) అన్నారు వాగ్దేవతలు.
మనం ఎన్నోసార్లు చెప్పుకున్నట్లు, మన శరీరములు మాంసమయములు, కానీ దేవతా శరీరములు మంత్రమయములు, మనవి రోమములు, వారివి రశ్ములు అనగా కిరణములు. అమ్మవారి యొక్క సర్వ ఆభరణములు కూడా మంత్రమయములు. కనుకనే, అమ్మవారి యొక్క ఒడ్డాణము యొక్క మువ్వలు కూడా, అమ్మవారు కదలక పోయినప్పటికీ అవి మ్రోగుతున్నాయి. కారణం, మంత్రం అనగా శబ్దమేగా..!! అవి ఎలా మోగుతూ ఉన్నాయి అంటే, అవి రమ్యంగా మ్రోగుతూ ఉన్నాయిట.
మూర్తామూర్తా స్వరూపిణి, శ్రీ కనకదుర్గా మాత.
శ్రీదుర్గామాతయే మూర్తమూ మరియు అమూర్తమూ కూడా. మూర్తము అనగా శబ్దము లేక రూపము .
ఎదురుగా ప్రకటింపబడునది మూర్తము.
ఇంద్రియములతో లేక మనసుతో అందేది మూర్తము. అలా అందనిది అమూర్తము
ఒక పిల్లాడు తన తల్లిని ఎత్తుకోమని చేయి మాత్రమే చాచగలడు. ఆ తల్లి తన చేతులతోనే ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుంటుంది. ఆ పిల్లవాడి తల్లి ఆవిడకానీ, ఆవిడ యొక్క చేతులు కాదు. కానీ ఆవిడ తన చేతులతోనే తన పిల్లవాడిని ఎత్తుకుంటుంది . అలా ఆ తల్లి మరియు ఆవిడ చేతులూ వేరు కాదు. అలానే శ్రీదుర్గామాత మరియూ ప్రకృతి, పరాప్రకృతి వేరు కాదు.
శ్రీదుర్గామాత మరియు ప్రపంచమూ వేరు కాదు.
ప్రపంచ స్వరూపంగా శ్రీదుర్గామాత మనకు కనిపిస్తున్నది కనుక శ్రీదుర్గామాతయే మూర్తము. కానీ శ్రీదుర్గామాత మనకు కనిపించటం లేదు కనుక ఆవిడయే అమూర్తము. మనకు అందటానికి శ్రీదుర్గామాత మూర్తి ధరించింది. కానీ శ్రీదుర్గామాత యొక్క తత్వం అమూర్తము. మనం పూజించే అమ్మవారి యొక్క విగ్రహం మరియు ఆవిడకు సంబంధించిన శబ్దములన్నీ మూర్తములు. కానీ మంత్ర చైతన్యం మాత్రం అమూర్తము. శ్రీ దుర్గామాతయే అనేక రూపాలు ధరించి, అనేక లీలలు చేసింది. అవి మూర్తములు. కానీ అమ్మవారు మరియు అమ్మవారి యొక్క మంత్రములు అమూర్తములు. మూర్తము అనగా ప్రపంచముగా ఆవిడ రూపం స్దూలం.
కానీ శ్రీ కనకదుర్గా మాత పరతత్వము అత్యంత సూక్ష్మము. మంత్ర చైతన్యం సూక్ష్మము. దానిని మంత్రసిద్ది పొందిన వారు మాత్రమే దర్శించగలరు. దానికంటే సూక్ష్మం కుండలిని. కుండలిని సిద్ధించిన వారు మాత్రమే దానిని దర్శించగలరు. దానికంటే సూక్ష్మమైనది పరతత్వం. ఆ పరతత్త్వమే శ్రీ కనకదుర్గా మాత. కనుక సగుణ సాకార దివ్యమంగళ రూపిణిగా, శ్రీ కనకదుర్గా మాత మూర్తము. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణిగా శ్రీ కనకదుర్గా మాతయే అమూర్తము.
ఆ రెండూ దుర్గయే అని ఉపాసించటమే వాగ్దేవతలు మనకు చెబుతున్న సాధనా రహస్యం. అటువంటి లోతైన విశ్లేషణలతో ఈ శ్లోకాన్ని కనుక పరిశీలన చేస్తే, శ్రీ కనకదుర్గా మాత యొక్క స్థూల, సూక్ష్మ, పరా,కారముల ప్రస్తావన చేస్తున్నారు ఆది శంకరాచార్యులవారు. ఈ శ్లోకములో, అమ్మవారి యొక్క స్థూలాకార వర్ణణము ప్రత్యక్షముగానే చెప్పబడింది.
"పురమధితుః", అన్న శబ్దము ద్వారా, పాలను చిలికి వెన్ను తీసినట్లు, ణం,క్లీం, సౌః అనే బీజాక్షరముల ఉద్ధరణ దీనిలో ఉన్నదనీ, ఇదే అమ్మవారి సూక్ష్మ ఆకార వర్ణణము అని, పెద్దలు చెప్పిన విశ్లేషణ. కుండలినీ సాధించిన సాధకుడికి, వాడి హృదయగుహ నుండే పైన చెప్పిన శబ్దములు వినిపిస్తాయి.ఇదే ఈ శ్లోకములో దాగి ఉన్న పరాకార వర్ణనము. మన ప్రపంచం అంతా, నామము మరియు రూపముతో నిండి ఉన్నది.
అంతకు మించి ఉన్న దానిని, మన మనసు గ్రహించలేదు. కనుకనే నామరూపములతోనే సాధన మొదలు పెట్టమన్నారు.
శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్య లహరి.
సౌందర్యలహరి మరియు శ్రీ లలితాసహస్రనామ సమన్వయ సాధనా మరియు శోధనా కొనసాగుతుంది.
శ్రీ కనకదుర్గా, దేవతా, పరదేవతా, నమోస్తుతే
- శివకుమార్ రాయసం