Online Puja Services

శ్రీ షిరిడీ సాయి బాబా వారి దినచర్య

3.135.190.107

ఆశ్చర్యకరమైన సచ్చిదానంద సద్గురు శ్రీ షిరిడీ సాయి బాబా వారి దినచర్య . 
- లక్ష్మి రమణ 

యోగుల దినచర్య విచిత్రంగానే ఉంటుంది . ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. అంతులేని ఆధ్యాత్మిక ఆంతర్యాలు అందులో దాగి ఉండేవి . బాబా  పేరుని మనస్ఫూర్తిగా తలచుకున్నా చాలు , చుట్టుముట్టిన కష్టాల కారుచిచ్చు నుండీ, సురక్షితంగా బయట పడేస్తారనడంలో సందేహం లేనేలేదు.  ఆ కరుణాతరంగుడైన ఆ మహనీయుని  దినచర్య తిరిగి ఆ సద్గురుని మన కన్నుల ముందుకి తెస్తుంది . 

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

ఈ విధంగా బాబా దినచర్య ద్వారా బాబాని దర్శించుకున్నట్టయ్యింది కదా ! భావన చేత మనలోనే ఉన్న బాబాని స్వచ్ఛమైన మనసుతో దర్శించండి .  అలా చేయడం వలన బాబా నిత్యమూ మనతోనే, మనలోనే ఉన్నారనే అనుభూతి కలుగుతుంది . అది ఆ బాబా తన స్వచ్ఛమైన భక్తుల విషయంలో నిజం కూడా చేసి చూపించిన దృష్టాంతారాలు నేటికీ ఆయన భక్తులకి అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి . 

జై శ్రీ సద్గురు సచ్చిదానంద మహారాజ్ , సాయినాథ్ మహారాజ్ కీ జై !! 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya