శరణన్నవారిని కాపాడే ఫకీరు
శరణన్నవారిని కాపాడే ఫకీరు
పేరు లేదు, ఊరు లేదు, కులమతాల పట్టింపు అసలేలేదు . దారి తెలియనివారికి దారిచూపడం, పెడత్రోవ పట్టిన వారిని సరైనదారికి తేవడం, శరణన్న వారిని కాపాడడం ఇవే ఆ ఫకీరుకి తెలిసిన విద్యలు. తెసినవారు దేవుడన్నారు, తెలుసుకున్నవారు గురువన్నారు, కొంతమంది పిచ్చివాడని రాళ్లు రువ్వారు. కానీ నమ్మినవారు , నమ్మనివారు కూడా ఆయన మహత్యాన్ని చవిచూశారు. మసీదుని ద్వారకామాయిగా మలిచిన సాయి సమాధానాన్ని, నేటికీ ఆయన సమాధి నుండీ వింటున్నారు. ఈకథ షిరిడీ సాయిది. అంటే షిరిడీది కూడా.
బాబా తన జీవన కాలమంతా ద్వారకామాయి లోనే నివశించారు. ఆయన స్వరూపం మూర్తీభవించిన దైవత్వం.“శిధిలమైన మశీదే ఆయనకు రాజభవనము.ధునిలోని విభూతే ఆయన ఐశ్వర్యం .చిగివున్న కఫ్నీయే చీనాంబరము.సట్కాయే ఆయన రాజదండము.
తలకు చుట్టిన రుమాలే వారికున్న రత్న కిరీటము.ద్వారకామాయిగా పిలిచే మశీదు ముంగిటనున్న పెద్ద రాయియే వారి సింహాసనము. భక్తులు భక్తితో పాడే జానపద పాటలే వారికి నిత్యహారతులు. ప్రేమతో పెట్టే బిక్షాన్నమే వారికి పరమాన్నము.
16 ఏళ్ళప్రాయంలో శిరిడిలోఅడుగుపెట్టి, ద్వారకామాయిని ఆవాసంగా మార్చుకున్న సాయి ఎక్కడపుట్టారు అంటే దానికి సమాధానం సాయి సచ్చరిత్ర చెబుతుంది. ఎవ్వరికీ తెలీని తన మూలాల గురించి సద్గురు తన భక్తుడైన మహల్సాపతితో చెప్పినట్టు సాయి సచరిత్రలోని ఒకఫుట్ నోట్ ద్వారా తెలుస్తోంది.
కులమతాల సారాంశం సఖ్యతే నని చాటి చెప్పిన మహనీయుడు శ్రీ శిరిడీ సాయిబాబా. మూఢనమ్మకాలు, మత ద్వేషాలు రాజ్యమేలుతున్న సమయంలో, బాబా ’భగవంతుడు ఒక్కడేనని పరమాత్మ తత్వాన్ని ప్రబోధించి మార్గ దర్శిగా నిలిచారు. జీవులన్నీ పరమాత్మకు ప్రతిరూపాలేనని ఆచరణాత్మకంగా అనుభవంలోకి తెచ్చారు. మసీదులో నివాసముంటూ, నిరంతర అగ్నిహోత్రుడై , కరునామయుని వాత్సల్యాన్ని కురిపించారు. యద్భావం తద్భవతని తన భక్తులకు దర్శనమిచారు.
కులాలు, మతాల కతీతంగా జ్ఞాన బోధ చేశారు సాయి . ప్రేమానురాగాలను పంచుతూ అందరివాడినని అనిపించుకున్నారు. మానవ సేవె మాధవ సేవని తన చేతల్లో నిరూపించారు.”దప్పిక గొన్నవారికి నీరు, ఆకలిగొన్నవారికి అన్నము, నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు, నీ వరండాలో నలుగురూ కూర్చొని విశ్రమించే అవకాశం ఇవ్వు. అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడౌతాడు. ఒక వేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా నిరాకరించు గాని వారిని అవమానించొద్దని” చెప్పేవారు. తన జీవితంలో ఫకీరుగా ఉన్నా ఇవన్నీ ఆయన పాటించి తనభక్తులకీ పాంటిచమని చెప్పడం విశేషం .
భారతదేశంలో దాదాపు అన్ని ముఖ్య నగరాలలోను, చాలా పట్టణాలలోను సాయిబాబా మందిరాలున్నాయి. విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి. ముంబైకు చెందిన షామారావు జయకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది. ఎన్ని మందిరాలున్నా బాబా నివసించిన షిరిడీలోని సమాధి మందిరం ప్రత్యేకమైనది. ‘ బాబా నా సమాధి నుండి నా మనుష్య శరీరం సమాధానం ఇస్తుంది’ అని చెప్పిన మాటని ఆయన అనునూయులు ఎన్నటికీ మరువలేరు . ఎంతోమందికి ఇది ఇప్పటికీ అనుభవమే అంటే అతిశయోక్తి కాదు .
బాబా నవవిధ భక్తికి చిహ్నంగా లక్ష్మీబాయికి ఇచ్చిన నాణేలు , ఆయన పెదవులని ముద్దాడిన చిలుము, స్వయంగా వండిన వంటపాత్రలు , బాబా ధరించిన దుస్తులు ఇప్పటికీ ద్వారకామాయిలో సజీవంగా ఉన్నాయి. ఈ ఫకీరుని శరణన్న వారి ఇంట లేమి పొడచూపదు అంటారు బాబా . శరణన్నవారిని సజీవుడై , సశరీరుడై ఆదుకున్న సంఘటనలూ ఎన్నో ఉన్నాయి మరి . బాబానే ఒక సందర్భంలో “నా భక్తులు సప్త సముద్రాల అవతల ఉన్నా పిచ్చుక కాలికి లాగినట్టు నా దగ్గరికి రప్పిస్తా”నంటారు . వీలయితే మీరూ పిచ్చుకై ఒకసారి షిరిడీ దర్శనం చేయండి .
--లక్ష్మీ రమణ