Online Puja Services

9 భక్తి మార్గాలు

18.191.135.50

" కృష్ణం వందే జగద్గురుం"

సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా వ్యక్తమైన  శ్రీ మద్ భగవద్ గీతలు ఇహమునకు, పరమునకు అత్యంత ఉపయుక్తమైనవి, 
గీతాచార్యుని ఉపదేశములు అమృతోపమానములు.  

ఈ జీవామృతాన్ని మనసారా గ్రోలుదాం !  అందరికీ పంచుదాం !!!
=======================

చతుర్ధోధ్యాయము :  4వ అధ్యాయము: జ్ఞాన యోగము 
3వ శ్లోకమునకు అనుబంధము:

సంస్కృత భాగవతంలో వ్యాసులవారు నవవిధ భక్తులను ఒక్క  శ్లోకంలో వర్ణించారు:

"శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం,
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం."

ఇదే భావాన్నిసప్తమస్కంధములో  పోతనగారు ఈ నవవిధ భక్తుల గురించి ప్రహ్లాదుని ద్వారా తండ్రియగు హిరణ్యకశిపునకు   
ఒక్క పద్యం లో చెప్పించారు:
 

"తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం
బనునీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా!"

భావము: రాక్షసశ్రేష్టుడా!  సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం- అనే భక్తి మార్గాలు తొమ్మిది. ఏదో ఒక మార్గం అవలంబించి త్రికరణశుద్ధిగా (మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ) సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు శ్రేష్టం.  ఇదే సత్యము. 

1.      శ్రవణం:  భగవంతుని గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు, లీలలు  వినుట - ప్రహ్లాదుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి అనుగ్రహముతో శ్రవణం ద్వారా  శ్రీమన్నారాయణుని పట్ల భక్తిని సంతరించుకున్నాడు. ధర్మరాజు, పరీక్షిన్మహారాజు, శౌనకాది మునులు, హరికథ శ్రోతలు.

2.      కీర్తనం: భగవంతుని గుణగణములను, మహిమలను,  లీలలను కీర్తించుట: నారద మహర్షి,   శుక బ్రహ్మ,  రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, తులసీదాసు, మీరాబాయి - మరెందరో భక్త గాయకులు. అందరికి అష్టోత్రాలు, సహస్రనామాలు చదవడం రాకపోవచ్చు, కానీ కీర్తనల రూపంలో ఆ శ్రీమన్నారాయణునిని కీర్తించి తరిస్తారు.

3.      స్మరణం: నిరంతరం భగవంతుని నామము స్మరించుట – ప్రహ్లాదుడు:  ఎల్లప్పుడూ నారాయణ స్మరణయే. అంజనేయస్వామి అన్నివేళలా శ్రీ రామ నామస్మరణలోనే నిమగ్నమై ఉంటాడు. ఇంకా  నిత్యం ధ్యానం చేసే కోట్లాది భక్తులు.

4.     పాదసేవ: స్వామివారి పాదములు ఒత్తుట మున్నగు సేవలు చేయడం:               లక్ష్మీదేవి- పరమాత్మ లక్ష్మీదేవిని తన వక్షస్థలములో నిలుపుకున్నా, తాను మాత్రము శ్రీమహావిష్ణువు పాదములవద్ద సేవ చేయటానికి ఇష్టపడిన మహాదేవి. భరతుడు- శ్రీరామచంద్రుని పాదుకలనే ఆయన దివ్యచరణాలుగా భావించి వాటిని పూజిస్తూ సేవిస్తూ 14 సంవత్సరాలు నందిగ్రామంలో గడుపుతాడు.

5.      అర్చనం: స్వామిని నిత్యం పూజించుట::   మనం ప్రతినిత్యం చేసే విగ్రహారాధనే అర్చనం. దేవుడిని మనస్పూర్తిగా పూజించడం. పత్రం, పుష్పం, ఫలం, తోయం (జలం) ఇత్యాది పూజాద్రవ్యాలతో తనను తాను మరచిపోయి భగవంతుని పూజించడాన్ని అర్చనభక్తి అంటారు. పృథు మహారాజు : గుడిలోగాని, ఇంటిలోగాని, హృదయములో గాని, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, పరమాత్మను  విధివిధానములతో అర్చించుట.

6.      వందనం: భక్తి తో నమస్కారములు (ప్రణామం) చేయుట:  బ్రహ్మ, అక్రూరుడు. అక్రూరుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. ఈయన చేసిన  స్తోత్ర వందనము నకు శ్రీ కృష్ణ పరమాత్మ  పొంగిపోయాడు.  ఎంతటి  మహాత్ముడో అక్రూర మహాశయుడు.

7.      దాస్యం: దాస భక్తి తొ స్వామికి దాసుడ ననే  భావముతో సేవించుట: భగవంతునకు దాసుడై  సర్వము  ఆ భగవంతునికి అర్పించడమే దాస్యం. 
హనుమంతుడు: స్వామి హనుమ యొక్క దాస భక్తి, వారు శ్రీ రామచంద్రమూర్తిని సేవించిన తీరు , తెలియని వారు ఉండరు. 
లక్ష్మణుడు అనుక్షణం శ్రీరామచంద్రునికి కావలసినవి అమర్చడం, ఆయన చెప్పింది తు చ  తప్పకుండా పాటించడం మొదలైనవి దాస్య భక్తి ప్రవృత్తి గా చెప్పవచ్చు.

8.    సఖ్యం: స్వామి నా చెలికాడు అనే భావనతో మెలగుట: 
అర్జునుడు : భగవంతుణ్ని మిత్రుడిగా భావించి అతని మహిమను, ఔన్నత్యాన్ని కీర్తిస్తూ భక్తిపారవశ్యంతో మెలగడమే సఖ్యత. అర్జునుడు, కుచేలుడు దీనికి మంచి ఉదాహరణ. గోపాలునితో స్నేహమొనరించి, ఆ స్నేహమాధుర్యంతోనే అనన్యమైన భక్తిని సంపాదించాడు కుచేలుడు. శ్రీ కృష్ణార్జునుల బంధము లోకవిదితమే. ఉద్ధవుడు:  చివరి వరకు శ్రీకృష్ణునితో గడిపింది ఉద్దవుడే. కృష్ణతత్త్వాన్ని పూర్తిగా అర్థము  చేసుకున్న ఉద్ధవుని గోపికలవద్దకు తన ప్రతినిధిగా పంపించాడు. ఉద్ధవ గీత అందరెరిగినదే.

 9.      ఆత్మనివేదనం: స్వామీ  నీవే నా సర్వస్వము , ఈ మనో వాక్కాయములు ఉన్నది నీ కొరకే అనే భావన తో  ఆత్మార్పణం చేయుట: కామ, క్రోధ, లోభ, మోహ, మద. మాత్సర్యాలను గెలిచి నిష్కామభావంతో,  తనను పూర్తిగా భగవానునికి సమర్పించుకొనుట: బలిచక్రవర్తి:       వామనావతారములో  స్వామికి మూడడుగుల నేల దానమిచ్చి మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సుని చూపి స్వామికి తనని తాను సమర్పించుకొని తరించిన మహనీయుడు. 

కిరణ్ కుమార్ నిడుమోలు 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore