కొబ్బరికాయకి , అయ్యప్ప దీక్షలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది .
కొబ్బరికాయకి , అయ్యప్ప దీక్షలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది .
- లక్ష్మి రమణ
కొబ్బరికాయకి పూజల్లో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది . ఇందులో పెద్ద విశేషం ఏముంది ? అనుకోవచ్చు . కానీ అయ్యప్ప స్వామి పూజల్లో మాత్రం కొబ్బరికాయకున్న ప్రాధాన్యతే వేరు . కొబ్బరికాయలో నెయ్యి నింపి, ఆ నేతితో హరిహరసుతుని అభిషేకిస్తారు . ఈ విధానం మరే పూజల్లోనూ మనం చూడము . ఇలాంటివే మరెన్నో ప్రత్యేక ప్రయోజనాల కోసం అయ్యప్పలు కొబ్బరికాయని వినియోగిస్తారు . ఆవిశేషాలు ఇక్కడ తెలుసుకుందాం .
ఇరుముడి కట్టి శబరిమలకు వెళుతున్న అయ్యప్పలు ఖచ్చితంగా తమ ముద్ర సంచీలో నెయ్యి నింపిన కొబ్బరికాయని తీసుకువెళతారు. ఆ కొబ్బరికాయని అగ్నిలో ఆహుతి చేస్తారు . ఇందులో భగద్భవమూ, భక్తుని అంతరంగము, గొప్ప ఆంతర్యము దాగిఉంది .
కొబ్బరికాయలోనే నేతిని ఎందుకు నింపాలి ?
కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా, కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా భావిస్తారు . ఇలా శివకేశవులు కొబ్బరికాయ అయితే, అందులో ఉండే కొబ్బరి వారి తనయుడైన అయ్యప్పగా భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడమంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటం అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట !! ఇక్కడ భగవంతుని రూపాన్ని ధారణ చేశారు .
కొబ్బరికాయని హోమగుండంలో ఎందుకు వెయ్యాలి ?
ఇలా ఇరుముడిలో పెట్టుకొని తలపైన మోసుకుంటూ వెళ్ళిన ఆ నేతి కొబ్బరికాయలోని నేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు . అభిషేకం చేసిన తరువాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో వేస్తారు. ఇక్కడ భక్తుని భావం గమనించండి. శరీరమనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడం . ఇదే స్వామికి చేసే నెయ్యఅభిషేకం లోని అంతరార్ధం. ఆత్మ పరమాత్మతో సంలీనమయ్యాక మిగిలిన శరీరం కట్టే తో సమానమే ! అప్పటివరకూ భగవంతుని రూపమై , ఆ భగవంతుని సన్నిధికి చేరేందుకు చేయూతనిచ్చిన ఆ శరీరంపైన అభిమానాన్ని వదిలేసి, దానిని అగ్నికి ఆహుతి చేయడం ఇందులోని పరమార్థం .
గుమ్మం ముందర కొబ్బరికాయ కొట్టాకే యాత్రకి బయలుదేరాలి !
అయ్యప్పలు శబరిమల యాత్రకి బయలుదేరుతున్నప్పుడు, ఇంటి గుమ్మం ముందర కొబ్బరికాయ కొట్టాకే ముందుకు కదుల్తారు . పరదేశ యాత్రకు వెళ్తున్నప్పుడు తన ఇంటిని, ఇంటిలోని వారిని సురక్షితంగా తాను తిరిగి వచ్చేంతవరకు కాపాడమని గ్రామదేవతని కోరుకునే క్రమమే ఇది . యాత్రకు బయలుదేరే అయ్యప్పలు వారి ఇంటి ముందర కొబ్బరికాయ కొట్టి ప్రార్ధించగానే, తన పరివార గణములో ఒక గణమును ఇంటి రక్షణ కోసం ఆ దేవత కేటాయిస్తుంది . శబరియాత్ర నుండి తిరిగి వచ్చాక, తిరిగి అయ్యప్పలు ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి, ,ఆ శక్తిని పంపిన గ్రామ దేవతకి నమస్కారం చేసుకొని, కృతఙ్ఞతలు చెప్పుకొని, గృహప్రవేశం చేస్తారు . అందుకే , ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి, ఇరుముడి కట్టించుకున్న తరువాత, యాత్ర పూర్తి చేసేవరకూ తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని చెబుతుంటారు .
చూశారా ! అయ్యప్ప పూజల్లో కొబ్బరికాయకి ఎంతటి ప్రత్యేక ప్రాశస్త్యమున్నదో !!
స్వామియే శరణమయ్యప్ప !!
#ayyappa #deeksha #coconut
Tags: ayyappa, deeksha, coconut, sabarimala