Online Puja Services

శబరిమల యాత్రకి సన్నద్ధమవుతున్నారా ?

18.116.15.98

శబరిమల యాత్రకి సన్నద్ధమవుతున్నారా ? ఈ విషయాలు గుర్తుంచుకోవాలి . 
- లక్ష్మీరమణ 

అయ్యప్ప స్వామి దీక్ష ఎన్నో నియమాలతో కూడి ఉంటుంది . ఆ దీక్ష భగవంతునికి భక్తుణ్ణి తప్పక దగ్గర చేస్తుంది . ఆధ్యాత్మిక చింతనని మేల్కొల్పి , ఆ పరమాత్మకి దగ్గర చేసే ఈ దీక్షలో అడుగడుగునా ఆ పరమాత్మ స్వయంగా తానే  తోడుగా నిలిచి దీక్షాబద్దులని తన దగ్గరికి రప్పించుకుంటారు . మాల వేసుకున్న ప్రతిఒక్కరికీ ఇది అనుభవమే . ఈ దీక్ష గురు సమక్షంలో , ఆద్యంతమూ గురుసాన్నిహిత్యంతో ఉండడం ఈ దీక్షలో మరో విశేషం . శబరిమలకు ఇరుముడితో వెళ్లేప్పుడు స్వాములు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి . 

 గురు స్వామి దగ్గర అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత కనీసం 40 ఒక్క రోజులు దీక్షని పాటించాలి. 41 రోజులు దీక్ష పూర్తి చేయనివారు పడిమెట్లు ఎక్కడానికి అర్హత కలిగి ఉండరు. ఒక్క సంవత్సరం మాల వేసుకుంటే కన్నె స్వామి అంటారు.  రెండవ సంవత్సరం - కత్తి స్వామి.  మూడవ సంవత్సరం - గంట స్వామి.  నాలుగవ సంవత్సరం - గదస్వామి. ఐదవ సంవత్సరం - పెరుస్వామి.  ఆరవ సంవత్సర నుంచి - గురుస్వామి అని పిలుస్తారు.  

శబరిమలైలో ప్రతి సంవత్సరం జనవరి 6 నుంచి 20వ తారీకు వరకు పండుగ లేదా జ్యోతి దర్శనం ఉంటుంది. ఏప్రిల్ మాసంలో విష్ పండుగ , ఆగస్టులో ఓనం పండుగ ఉంటాయి.  నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజలు జరుగుతాయి. ఈ యాత్రకి సన్నద్ధమయ్యే అయ్యప్పలు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాలి . 

*కన్నె స్వాములు  వ్యర్థ ప్రసంగాలు చేయడం కానీ యాత్రలో ప్రశ్నలు వేయడం గాని చెయ్యకూడదు.

*అనుభవజ్ఞులైన అయ్యప్పలు చెప్పినట్టు యాత్రలో నడుచుకోవాలి. కానీ బృందాన్ని వదిలి ముందుకు వెళ్ళకూడదు.  ఆ భక్త సమూహంలో తప్పిపోయిన గుర్తుపట్టడం కష్టమవుతుంది. 

*ఇరుముడి నెత్తిపై పెట్టుకున్న తరువాత వెనక్కి తిరిగి చూడకూడదు. వస్తానని కానీ వెళుతున్నానని కానీ కుటుంబ సభ్యులకు గానీ, మరెవ్వరికైనా గానీ చెప్పకూడదు .

*ఇరుముడి తలపై ఉంచుకుని చిరుతిళ్లు తినడం, లఘుశంక తీర్చుకోవడం వంటివి చేయకూడదు. 

*ఇరుముడిని కన్నె అప్పలు ఎట్టి పరిస్థితుల్లో దించుకోకూడదు. అవసరమైతే అనుభవజ్ఞులైన అయ్యప్పలే ఇరుముడిని కిందకు దించుతారు. బృందంలోని వారు కాక, యాత్ర చేసే వేరే అయ్యప్పలు ఎవరైనా సాయం చేయొచ్చు. 

*కన్నె అయ్యప్పలలో భక్తితోపాటు మహత్తరశక్తి కూడా నిబిడీకృతమై ఉండటం వలన ఉత్సాహం ఉరకలు వేయడానికి మనసు ఆరాటపడుతుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ బృందాన్ని విడిచి వెళ్ళకూడదు. ఒకవేళ ముందు వెళ్ళినా వెనుక వస్తున్న అయ్యప్పల బృందం  కోసం నిరీక్షిస్తూ ఒక సురక్షిత స్థానంలో ఆగి ఉండాలి. 

*తినుబండారాలు ఏవైనా వెంట తీసుకుని వెడితే, అయ్యప్పలు అందరికీ  పంచిపెట్టి తినాలి. అంతే కానీ, దొంగ చాటుగా తినకూడదు. 

*యాత్ర సమయంలో స్వామి శరణు ఘోష చెప్పుకుంటూ మాత్రమే నడక సాగించాలి.  ప్రకృతి సౌందర్యమును గురించి గానీ క్రూర మృగాల గురించి గానీ చర్చించకూడదు. తలుపునకు కూడా రానీయకూడదు. మనసు అయ్యప్ప పైనే లగ్నం చేసి ఉండాలి. 

*యాత్రలో వివిధ పుణ్యక్షేత్రాలు దేవాలయాలు సందర్శించినప్పుడు బృందంతో కలిసి దర్శనం చెయ్యాలి కానీ వేరుగా పూజలు జరిపించకూడదు. 

*నిర్ణీత కాలంలో గురుస్వామి ఆదేశ ప్రకారమే నడుచుకోవాలి. బిక్షకు కూడా బృందంతోనే వెళ్లాలి కానీ ఎవరి దారిన వారు వెళ్ళకూడదు. అమితంగా ఎక్కడా భుజించకూడదు.  రాత్రి సమయంలో చీకటిలో లఘుశంకకు, దీర్ఘశంకలకు దూరము పోకూడదు. 

*వార్తాపత్రికలు గాని దినపత్రికలు గాని దీక్షలో చదవకూడదు.  కెమెరాలు ట్రాన్సిస్టర్ల వంటివి యాత్రకు తీసుకెళ్లకూడదు. 

*స్నానం చేసేటప్పుడు విలువైన వస్తువులు డబ్బులు వగైరాలు బృందంలో బాగా పరిచయమున్న పరిచయమున్న అయ్యప్పకి ఇచ్చి వెళ్లాలి. దొంగలు సమయం కోసం వేచి ఉంటారని మరిచిపోకూడదు.  

*కన్నె అయ్యప్పలు ఒంటరిగా ఎప్పుడూ యాత్ర చేయకూడదు. 

ఈ నియమాలని పాటిస్తూ దిగ్విజయంగా అయ్యప్ప యాత్రని చేసి, ఆ హరిహరుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ శుభాకాంక్షలతో శలవు . 

#ayyappa #sabarimala #yatra

Tags: ayyappa, irumudi, sabarimala, yatra, precautions

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore