అయ్యప్ప స్వామి దీక్ష నిబంధనలు తెలుసుకుందామా !
అయ్యప్ప స్వామి దీక్ష నిబంధనలు తెలుసుకుందామా !
- లక్ష్మీరమణ
నియమాల తోరణం అయ్యప్ప మాల ధారణం. అయ్యప్ప సన్నిధికి చేరాలంటే, ఆ మాల మేడలో వేసుకోవాలంటే, నియమాల మాలని అనుసరించాల్సిందే ! అలా అనుసరించినవారిని వెన్నెంటే ఉంటానన్నది ఆ అయ్యప్ప మాట ! అందుకే భక్తులు భారతావని నాలుగు చెరగులా నుండీ ఆ మాల ధరిస్తారు. నెలపట్టి పదునెట్టాంబడి ఎక్కడానికి సంసిద్ధమవుతారు. ఆ దీక్ష అచలం. సామాన్యమైన నియమాలు కావవి. ఆ భగవంతునికి దగ్గర చేసే మార్గాలు . అహం బ్రహ్మాస్మి అని చెప్పడంలో అహంకారం తొంగి చూస్తోంది అనుకునేవారికి అందులోని పరిపూర్ణమైన దైవత్వాన్ని పరిచయం చేసే సూత్రాలవి .
అయ్యప్ప మాల ధరించడం అంటే స్వయంగా ఆ పరమాత్మకీ మనకి అభేదాన్ని పాటించడమే . మహత్తు మాలదే కాదు , ఆ మాల ధారణ నియమాల తోరణమే . నిత్యం పటిగెట్టే మనసుని అదుపుచేసి పరమాత్మ పైన నిలిపే కళ్లెమే . ఆ నియమాల వివరాలు ఇలా ఉంటాయని తెలియజేస్తున్నాయి అయ్యప్పదీక్షా దాక్షతని వివరించే ఆధ్యాత్మిక గ్రంధాలు .
మాల ధరించినవారు ప్రతిరోజూ ఉదయమే సూర్యోదయానికి ముందుగా మేల్కొనాలి. కాల కృత్యాలు తీర్చుకొని చన్నీళ్ళతో శిరః స్థానమాచరించాలి.
స్వామికి దీపారాధన చేసి దేవతార్చన చేసి రాత్రిపూట బిక్ష చేయాలి.
ప్రతిరోజూ ఉదయము సాయంత్రము ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించాలి.
నల్లని దుస్తులను కానీ నీలిరంగు దుస్తులను కానీ ధరించాలి. యాత్ర సమయంలో ఈ నియమాన్ని తప్పక పాటించాలి.
కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోవాలి.
ఎలాంటి పరిస్థితుల్లోనూ మెడలో ధరించిన ముద్రమాలను తీసేయకూడదు.
పరిశుభ్రతను అన్నివేళలా పాటించాలి. నిత్యము కర,పాద, నేత్ర ప్రక్షాళనము చేసుకుంటూ ఉండాలి.
దీక్షాకాలంలో ముఖక్షవరము కానీ కేశఖండన కానీ పనికిరాదు. గోళ్లను కూడా తీయకూడదు.
అస్కలిత బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ యోగిగా జీవించాలి. ఇది అయ్యప్పకు ఎంతో ఇష్టము ఇంట్లోనే ఒక వేరే గదిలో ఉండడం శ్రేయస్కరం. దాంపత్య జీవితం మనోవాకాయ కర్మల చేత తలచుట కూడా ఘోరమైన అపచారము. మెత్తటి పరుపులు దిండు ఉపయోగించకూడదు. రోజూ వారీ వేసుకొనే దుప్పట్లు సైతం వాడరాదు. వీలైతే కొత్త బట్టలు వాడడం శ్రేయస్కరం. నేలమీద కొత్త చాప పరుచుకుని పడుకోవాలి.
అయ్యప్పలు శవాన్ని చూడకూడదు.
నెలసరిలో ఉన్న స్త్రీలను చూడకూడదు. ఒకవేళ అలా చూసినట్లయితే ఇంటికి వచ్చి పంచగవ్యలతో తలస్నానం చేసి స్వామివారి శరణు ఘోష చెప్పుకోవాలి .
దీక్షలో అనుక్షణం అయ్యప్ప నామస్మరణ చేస్తూ ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే మూల మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి.
దీక్షా సమయంలో స్త్రీలందరినీ కూడా భార్యతో సహా దేవతామూర్తులుగా భావించాలి. తమ పేరుకి చివర అయ్యప్ప అనే పదాన్ని చేర్చుకోవాలి. అందరినీ కూడా అయ్యప్ప అనే సంబోధించాలి.
స్త్రీ అయ్యప్పలను ‘మాలికాపురం’ లేక ‘మాత’ అని పిలవాలి.
సృష్టిలోని ప్రతి అణువూ , తమతో సహా ఆ అయ్యప్ప భగవానునిగానే భావించాలి . ఆ స్వామి రూపాన్ని తలపోయాలి.
అయ్యప్పలను ఎవరైనా బిక్షకి అంటే భోజనానికి పిలిస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించకూడదు. జాతి మత కుల భేదాలు అయ్యప్పలకు లేవు.
అయ్యప్ప దృష్టిలో అందరూ సమానులే అని గుర్తుంచుకోవాలి.
అయ్యప్పలు నుదుట ఎప్పుడు విభూతి చందనము కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. మద్యాన్ని సేవించడం, ధూమపానం చేయడం, పొగాకు వంటివి స్వీకరించడం చేయకూడదు. చివరకు తాంబూలం కూడా నిషిద్ధమే.
అతి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. రాత్రిపూట అల్పాహారం తీసుకోవాలి అంటే ఏకభుక్తము మాత్రమే చెయ్యాలి.
మానవసేవే మాధవ సేవ అని గుర్తించి ఇతరులకు తోచిన సాయం చేయాలి. సాధ్యమైనంత వరకు నిత్య జీవన విధానానికి, లౌకిక వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి.
తరచూ దేవాలయాల్ని సందర్శించడం సత్సంగము భజనల్లో పాల్గొనడం అత్యుత్తమం. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంతటి ప్రీతి.
ఎదుటివారినితో వాదించకూడదు. హింసాత్మక చర్యలకు దూరంగా ఉండాలి. అబద్ధం ఆడడం, దుర్భాషలాడడం చేయకూడదు. అధిక ప్రసంగాలకి దూరంగా ఉండాలి.
ప్రతిరోజు స్వామివారికి అర్చన తర్వాత ఇష్టదేవతలను ప్రీతి కొద్ది ధ్యానించాలి.
అష్ట రాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్యావిద్యలకి దూరంగా ఉండాలి. ఇదే పదునెట్టాంబడిగా గ్రహించాలి.
‘అహం బ్రహ్మాస్మి, తత్వ మసీ’ సిద్ధాంతాలను అనుక్షణం అమలులో పెట్టాలి.
శక్తి కొలది దీక్షా సమయంలో కనీసం ఒక్కసారైనా నలుగురు అయ్యప్పలకు బిక్షపెట్టడం మంచిది.
స్వామివారికి కర్పూరం ప్రీతి. కాబట్టి ఉదయం సాయంత్రం కూడా కర్పూర హారతినివ్వాలి. దీక్షా సమయంలో వయస్సు హోదా అంతస్తు సర్వము మరిచి
సాటి అయ్యప్పలకి పాదాభివందనం చేయడానికి వెనకాడకూడదు.
దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనం చేయొచ్చు. కానీ దీక్షలో లేని ఇతరులకు చేయకూడదు.
గర్వము అహంభావము ఆడంబరము ఉండకూడదు. సర్వము స్వామి సేవకే అంకితం కావాలి.
పైన చెప్పిన నియమాలు దీక్ష తీసుకున్న ప్రతి అయ్యప్ప పాటించి తీరాలి. పైన చెప్పిన నియమాలే కాక ఇంకా కఠోర నియమాలను ఆచరించే అయ్యప్పలు కూడా ఈ పవిత్రమైన దీక్షా కాలంలో కనిపిస్తూ ఉంటారు. మానవుణ్ణి మహనీయుని చేస్తూ , ఆత్మజ్యోతి ప్రకాశాన్ని ప్రజ్వరిల్లజేస్తున్న ఒక గొప్ప దీక్ష ఈ హరిహరసుతుని భక్తిమార్గం . ఆ మార్గంలో పయనిస్తూ అయ్యప్ప సన్నిధికి చేరుకుందాం .
స్వామియే శరణమయ్యప్ప !!
#ayyappa #deeksha
Tags: ayyappa, deeksha, rules, nibandhana