కుమారస్వామి ధ్వజం పైన కోడిపుంజు ఎందుకు చేరిందో ?
కుమారస్వామి ధ్వజం పైన కోడిపుంజు ఎందుకు చేరిందో ?
-లక్ష్మీ రమణ
ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వాహనం ఉంది. ఆ దేవతతో పాటుగా ఆ వాహనానికి కూడా మన పూజలు నిర్వహిస్తుంటాం . ఎందుకో తెలీదుగానీ, దేవతలా వాహనాలు చావరకూ వారు సంహరించిన రాక్షస స్వరూపాలుగా ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే మూషికాసురుడు, గణపతికి వాహనమయ్యాడు . ఇక కార్తికేయుడి నెమలి వాహనం కూడా ఒక రాక్షసుడే . కుమారస్వామి ఆలయాల్లో కోడిపుంజులని పెంచడం వెనుక కూడా ఇటువంటి వింతదైన కథే ఉంది మరి !
తారకాసుర సంహారం కోసం దేవతలందరూ తపస్సు చేసినంత పని చేశారు . ఆ తారకాశురుడికి శివ తేజస్సుతో గానీ మరణంలేదు . సచీదేవి అప్పటికే దక్షయజ్ఞం కారణంగా యోగాగ్నికి తననితాను ఆహుతి చేసుకుంది . ఆ తర్వాత, నిరంతర తపస్సులో నిమగ్నమయ్యారు గానీ, ఆ పరమేశ్వరుడు మారె స్తీని కన్నెత్తయినా చూడడాయే . విశ్వసమ్మోహన సౌందర్యరాశి అయినా పార్వతిగా అవతరించిన సతీమాత ఎంతగా సేవలు చేసినా క్రీగంటైనా ఆమె వంక కన్నెత్తి చూడకపోయే ! ఎలాగైనా ఆ ఇద్దరినీ ఒకటి చేయాలనుకుని శివుని పైనే మన్మధబాణాలు ఎక్కుపెట్టిన సాహసికుడు ఆ మన్మధుడు త్రినేత్రుని నేత్రాగ్నికి బలైపోయాడు . ఇక ఏది దారని వగస్తున్నదేవతలకి, అమ్మవారు తన తపస్సుతో సమాధానం చెప్పింది. యోగేశ్వరుణ్ణి, యోగం తోటి గెలుచుకుంది. వారికలయికకి ప్రతిరూపంగా ఉద్భవించాడు, సర్వశక్తిమంతుడైన కార్తికేయుడు .
ఆయన, దేవతాగణాన్నంతా తన సైన్యంగా తీసుకొని వెళ్లి, తారకాసురునితో యుద్ధం చేశారు .తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు. కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి.
మరోవైపు అమ్మవారు , తన శక్తినే ఆయుధంగా మలిచి అనుగ్రహించిన శక్తి అనే ఆయుధాన్ని పట్టుకుని, మరో శివుడా అన్నట్టు దూసుకొస్తున్న శివస్వరూపుడైన కార్తికేయుడు విజృంభించి ఆ రక్కసుల పీచమణుస్తున్నాడు . రాక్షసులు గుట్టలుగా పది చనిపోతున్నారు . తారకాసురుని సోదరుడు శూరపద్ముడు ఒక పక్షి రూపాన్ని ధరించి కార్తికేయునిమీద తలపడ్డాడు . ఆతర్వాత ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయుని నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట. దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి. అలా పక్షులుగా మారిన శూరపద్ముడు ఆ స్వామిని శరణు శరణు శరవణభవా ! అని వేడుకున్నాయట . అప్పుడా స్వామి కనికరించి , నెమలిని తన వాహనంగానూ, కోడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నారని ఐతిహ్యం . అలా ఆయన పతాకం పైన కోడిపుంజు చేరింది.