Online Puja Services

సుబ్రహ్మణ్యుడు - కుమారస్వామి

18.191.195.105

సుబ్రహ్మణ్యుడు - కుమారస్వామి
 

పరమాచార్య స్వామివారు, సుబ్రహ్మణ్యునికి శ్రీ మహా విష్ణువుకు ఉన్న సంబంధాన్ని, ఉత్తర దక్షిణ భారతాలలో స్వామివారి పేర్లలో ఉన్న విభిన్నతను, కుమారసంభవం అన్న పదానికి వాల్మికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని ఈ ఉపన్యాసంలో చెబుతున్నారు.

అరుణగిరినాథర్ తన “కందర్ అనుభూతి”లో సుబ్రహ్మణ్యుణ్ణి వల్ల తను పొందిన అద్వైత జ్ఞానాన్ని పొగిడాడు. తన ‘తిరుప్పుగళ్’ సంకలనంలోని ప్రతి పద్యాన్ని ‘పెరుమాళే’(గొప్పవాడు) అన్న పదంతో ముగించాడు. సాధారణంగా ‘పెరుమాళ్’ అన్న పదం శ్రీ మహా విష్ణువుకు సంబంధించినది. ప్రతి ఊరిలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం ఉండడం మనం చూస్తుంటాము. శివపార్వతుల ఇద్దరి తేజస్సుతో ఉద్భవించిన సుబ్రహ్మణ్యుణ్ణి అరుణగిరినాథర్ ‘పెరుమాళే’ అని పిలవడం చాలా అద్భుతమైన విషయం.

తమిళనాడులో సుబ్రహ్మణ్యుణ్ణి సాధారణగా శ్రీ మహా విష్ణువు సంబంధంతో ‘మురుగన్’ అని పిలుస్తారు. ఎందుకలా? ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మాల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. ‘మరుమగన్’ అంటే అల్లుడు. పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటాడు.

కాని ఉత్తర భారతంలో ఈ ‘అల్లుడి’ విషయం ఎప్పటికి ఒప్పుకోరు. అక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి బ్రహ్మచారిగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలలోకి ఆడవారిని అనుమతించరు. ఈ విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. అంతేకాక ఉత్తరాన ‘సుబ్రహ్మణ్య’ అన్న పేరుకంటే ‘కార్తికేయు’నిగా ఎక్కువ ప్రాచుర్యం.

శివుని కళ్ళల్లో నుండి వచ్చిన ఆరు అగ్ని శిఖలు ‘శరవణ పోయిగై’ అనే తటాకంలో పడ్డాయి. అప్పుడు ఆరుగురు కృత్తికలు అనే ఆడవారు పాలివ్వడంతో ‘కార్తికేయ’ అని పిలిచారు. ఈ ఆరు కృత్తికా నక్షత్రాలను ఆకాశంలో ఒక సమూహంగా మనం చూడవచ్చు. ఈ ఆడవారే దాని అధిదేవతలు.

ఈ ఆర్గురు ఆడవారు తల్లిలా పాలివ్వడంతో, వారి గౌరవార్థం సుబ్రహ్మణ్యుడు ‘కార్తికేయు’డని పిలవబడ్డాడు. ఈ నామం ఉత్తరాన ఎంతో జనబాహుళ్యం. ‘కుమార’ అంటే పిల్లవాడు అని కూడా పిలవడం కద్దు. తమిళనాడులో కుమారస్వామి అని పిలుస్తారు, ‘కుమార’ అనునది దీనినుండే వచ్చింది. కనుక ‘కుమారన్’ అంటే సుబ్రహ్మణ్యుడే. ఎందుకంటే జగత్తుకు తల్లితండ్రులైన పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు కాబట్టి. మనం వినాయకుణ్ణి ‘పిళ్ళై’(పిల్లాడు) అని పిలుస్తాము. కాని ఉత్తరాన ఈ ‘కుమార’ అన్న పేరు గణపతికి అన్వయించదు. అక్కడ కేవలం సుబ్రహ్మణ్యుడు మాత్రమే ‘కుమార’ అని పిలువబడతాడు. కవిరత్న కాళిదాసు కూడా తన కావ్యానికి ‘కుమార-సంభవం’ అన్న పేరే పెట్టాడు.

‘కుమార-సంభవం’ అన్న మాట వాల్మీకి రామాయణంలో కనపడుతుంది. అందులో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు సుబ్రహ్మణ్యుని వృత్తాంతాన్ని విపులంగా తెలుపుతాడు. కథాభాగం చివర్లో ఫలశృతి వ్రాయడు వాల్మికి. కాని ఈ ఆఖ్యానంలో మాత్రం విశ్వామిత్రుడు రామునితో, “నేను నీకు కుమార-సంభావ వృత్తాంతాన్ని తెలిపాను. ఇది నీకు ధనమును, పుణ్యమును ఇస్తుంది. హే! కాకుత్స్థ ఈలోకంలో కార్తికేయుణ్ణి కనుక భక్తితో ఆరాధిస్తే, ఆయన మనలను దీర్ఘాయుష్షు, సంతానము, యశస్సు ఇచ్చి, చివరలో స్కందలోకంలో శాశ్వత నివాసం అనుగ్రహిస్తాడు” అన్న ఫలశ్రుతి ఉంది.

భక్తశ్చ యః కార్తికేయే కాకుత్స్థ భువి మానవః ।
ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కన్దసాలోక్యతాం వ్రజేత్ ॥ (బాలకాండ, 37వ సర్గ, శ్లోకము 31-32)

ఈ పరమ పవిత్రమైన అఖ్యానాన్ని తీసుకుని కాళిదాసు తన కావ్యానికి ‘కుమార-సంభవం’ అన్న పేరు పెట్టాడు.కౌమారము అనే శాఖ ‘కుమార’ అన్న శబ్దము నుండే వచ్చింది. మనకు ‘షణ్మతము’లను ఆరు మతములు ఉన్నవి. అందులో ఆరు దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము. అవి, గాణాపత్యము - గణపతి; సౌరము - సూర్యుడు; శాక్తము - పార్వతి(శక్తి); శైవము - శివుడు; వైష్ణవము - విష్ణువు; కౌమారము - సుబ్రహ్మణ్యుడు. వీరిని పూజించే పద్ధతినే పంచాయతన పూజ అంటారు.

రామాయణంలో మహర్షి వాల్మికి చెప్పిన స్కంద లోకం గురించి చెప్పాను కదా! ‘స్కంద’ అనునది సుబ్రహ్మణ్యుని యొక్క మరొక్క పేరు. ‘స్కంద’ అను పదానికి మూలార్థము ‘బయటకు రావడం’. నల్లని మేఘాలలో నుండి మెరుపుతీగ వచ్చిన విధంగా స్కందుడు పరమశివుని యొక్క నేత్రములనుండి మహోన్నతమైన తేజస్సుగ బయటకు వచ్చాడు. స్కందుని యొక్క విశేష లిలావైభవాన్ని తెలిపే పురాణమే ‘స్కాంద పురాణము’. కాంచీపురంలో నివసించిన కచ్చియప్ప శివాచార్యులు తమిళంలో ‘కంద పురాణాన్ని’ వ్రాశారు. తమిళంలో ‘స్కంద’, ‘కందన్’గా మారింది.

ఇప్పటికి, తమిళనాట ‘మరుగన్’ గా ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్య స్వామి ఉత్తరాన ‘కుమారుని’గా ప్రసిద్ధుడు. అన్ని జీవరాశులు పార్వతీ పరమేశ్వరులే పిల్లలే. కాని సుబ్రహ్మణ్యుణ్ణి గురించి చెబుతూ, “కొడుకు ఉంటే కుమారస్వామి లాగే ఉండాలి” అని అంటారు. అటువంటి సుబ్రహ్మణ్యుని వైభవాన్ని అందరమూ తెలుసుకుందాం.

--- రా. గణపతి గారి “దైవతిన్ కురల్” పుస్తకం నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi