గాయత్రీ మంత్రం ఎందువల్ల శక్తి వంతమైన మంత్రం
గాయత్రీ మంత్రం ఎందువల్ల శక్తి వంతమైన మంత్రంగా ప్రసిద్ధిని పొందింది ?
- లక్ష్మి రమణ
న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉంది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయతే' అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. జన్మ ,మరణం అనే చక్ర బంధం నుండీ విముక్తి నిచ్చేది గాయత్రీ మంత్రం అంటారు ఆ మంత్రాన్ని దర్శించి మనకి అందించిన ద్రష్ట విశ్వామిత్ర మహర్షి .
వేదంలోని రెండు ప్రధానమైన మంత్రాలు. ఒకటి గాయత్రి మంత్రం. రెండవది మృత్యుంజయ మంత్రం. గాయత్రీ మంత్రం రెండు కారణాల వలన అతి శక్తివంతమైన మంత్రంగా ప్రసిద్ధిని పొందిందనేది యోగుల అభిప్రాయం . వాటిల్లో ఒక కారణం, ఈ మంత్రం వలన జనించే ప్రకంపనాలు, రెండవది ఈ మంత్రం యొక్క పరమావది అయిన జ్ఞానోదయం, దివ్య సందర్శనం.
గాయత్రీ మంత్రాన్ని వింటూ ఉంటే...అనుధాత, ఉధాత, స్వరిత అనే మూడు స్వరాలు మీకు వినిపిస్తాయి. ఆ స్వరాల స్థాయిలో మంత్రోచ్చారణ వలన ఒక విలక్షణమైన ప్రకంపన పుడుతుంది. ఆ ప్రకంపన మనకు జీవితంలో దుఃఖాన్ని నివారణ చేయడానికి విశేషంగా తోడ్పడుతుంది. గాయత్రీ మంత్రం యొక్క శక్తివంతమైన ప్రకంపనాల వలన అజ్ఞాత జనితమైన ఈ దుఃఖం పోతుంది. ఈ దుఃఖం వాస్తవమే కావచ్చు.కానీ అది అవసరం లేనిది .
ఇహలోక మాయా ప్రపంచానికి అతీతమైన భావన , అంతర్యామితత్వం ఇక్కడ అర్థం చేసుకోవాలి . మనం విశ్వంలో నివసిస్తున్నాము. విశ్వం మనలో నివసిస్తుంది. ఈ రెండిని అర్థం చేసుకోవాలి. మనం విశ్వంలో నివసిస్తున్నాం అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే మనలోనే ఒక విశ్వం ఉన్న విషయం మనకు తెలియదు. యోగము ద్వారా, మాత్రమే దాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుందనేది యోగుల మాట . ఇటు బాహ్య ప్రపంచం నుండి అటు అంతర్ ప్రపంచం నుండి, శక్తిని, బలాన్ని పొందటంలో గాయత్రీ మంత్రం మనకు ఎంతో తోడ్పడుతుంది. అందుకే ఆవిడని ఒక దేవతా స్వరూపంగా భావన చేసి ‘ సవిత’ అంటారు. సవిత అంటే సూర్యుడు అని అర్థం . సూర్య స్తుతిలో సవిత్రే నమః అనే నామం కనిపిస్తుంది . యోగాభ్యాసం చేసేప్పుడు సూర్య నమస్కారాలను ఆచరిస్తూ , సవిత్రే నమః అని సూర్యనమస్కారం చేస్తాం .
బాహ్యంగా మనం చూస్తున్న సూర్యుడిని అంతర్లీనంగా మనలో పొదువుకోని , ఆ సూర్యుడిని గురించి చేసే ప్రార్థన గాయత్రీ మంత్రం! బాహ్య ప్రపంచానికి ప్రతీక బాహ్యంగా ఉన్న సూర్యుడు . అంతర్లీనంగా మనలో ఉన్న పరమాత్మ సూర్యుడు . కనుక, గాయత్రీ మంత్రం ఈ రెండు ప్రధానమైన మూలాధారాల నుంచి శక్తిని పొందుతున్నది.
ఈ మంత్రానుష్ఠానం చేసిన వారికి బుద్ధి వికాసం కలగాలని , జ్ఞాన వృద్ధి కలగాలని అదికూడా దిన దిన ప్రవర్థమానం అవ్వాలని గాయత్రీ మంత్ర యుక్తంగా ప్రార్థించడం తద్వారా అటువంటి అనుగ్రహాన్ని పొందడం ఈ మంత్రంలో దాగిన రహస్యం .
ఈ ప్రార్థన చేసేవాడు సత్వగుణ సంపన్నుడై, లోకంలోని సర్వ జనులకూ , జీవులకూ ఈ జ్ఞానవృద్ధి, శుభం జరగాలని ఆశించేవాడై ఉండాలి . అని మన ఋషులు భావన చేశారు . మనకి విధించారు . గాయత్రీ మంత్రాన్ని నిష్టగా చేసేవారి వెంట అమ్మ ఖచ్చితంగా ఉంది తీరుతుంది . అటువంటి గొప్ప ఉదంతాన్ని మరో రోజు చెప్పుకుందాం .
సర్వేజనా సుఖినోభవంతు !! శుభం !!
#gayatrimantra #gayatrimantram
Tags, gayatri, mantra, mantram