శిల్పశాస్త్రంలో గణపతి ప్రత్యేకత
శిల్పశాస్త్రంలో గణపతి ప్రత్యేకత
- లక్ష్మి రమణ
కంటికి కనబడని దివ్యతత్వాలను మానవులకు పరిచయం చేయించే శాస్త్రమే శిల్పశాస్త్రం. ఈ శాస్త్రాన్నీ అనుసరించి తీర్చిదిద్దినవే విగ్రహాలు. వీటిలో ఆయా దేవీ దేవతల విశేష సాన్నిధ్యం ఉంటుంది. కనుకనే భారతీయ సనాతన సంప్రదాయంలో విగ్రహారాధనకు విశిష్ట స్థానం ఉంది.
“ప్రతిమాసు అప్రబుద్ధానం” అని శాస్త్రకారులు పేర్కొన్నారు. అనగా సాధనా క్రమంలో తొలి దశలో ఉన్నవారికి విగ్రహారాధన ద్వారా జ్ఞానం సిద్ధిస్తుందని అర్థం. ఈ కారణం వల్లనే ఈ భరతభూమిలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. ఆయా ఆలయాలలో దివ్యమైన ఎన్నో కుడ్యాలు నెలకొన్నాయి . సాధనా మార్గంలో బుడిబుడి నడకలు వేస్తున్న సాధకులకు ఆలంబనగా ఎందరో దేవతలు విగ్రహ రూపంలో సాక్షాత్కరించారు. అటువంటి వారిలో గణపతి ఒకరు .
శీఘ్రంగా అనుగ్రహించే దేవతగా పేరుపొందిన “క్షిప్ర ప్రదాయక” గణపతికి మన దేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో కొలువైన వినాయకుని విగ్రహ లక్షణాలను క్రియాసారం అనే తంత్రగ్రంథం చాలా చక్కగా వివరించింది.
“చతుర్భుజం బహుత్కుక్షిం సర్వలక్షణ సంయుతం –
సర్వాభరణ సంయుక్తం నాగయజ్ఞోపవీతినం”
అంటూ నాలుగు చేతులు, పెద్దదయిన పొట్ట, పామునే యజ్ఞోపవీతంగా ధరించిన సర్వలక్షణశోభితుడు, అనేక ఆభరణయుక్తుడు అయిన గణేశుణ్ణి మనం పూజించాలి.
శిల్ప శాస్త్రం ప్రకారం గణపతి “ఆయుధాలు”, “సౌందర్య వస్తువులు”, “పూజా వస్తువులు” అనే మూడు విధాలైన విశేషాలను ధరించి దర్శనమిస్తాడు. సుమారు ఇరవై నాలుగు ఆయుధాలు, ఇరవై సౌందర్య వస్తువులు, పద్నాలుగు పూజావస్తువులను చేతిలో ధరించి, మూషిక వాహనుడై దర్శనమిచ్చే మహాగణపతిని పూజించడం వల్ల సకల అరిష్టాలు తొలగి, సర్వాభీష్టాలు నెరవేరుతాయి.
“గౌరీపుత్ర నమస్తేస్తు సర్వసిద్ధి వినాయక –
సర్వసంకటనాశాయ గృహాణార్ఘ్యం నమోస్తు తే”
అంటూ పరమ పవిత్రమైన భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధ్యక్షుడైన మహాగణపతిని పూజించి, అర్ఘ్యాన్ని అర్పించిన వారికి శుద్ధభక్తి, విశుద్ధ జ్ఞానం, పునరావృత్తిరహితమైన మోక్షం సిద్ధిస్తాయి.
ఈ విధంగా సర్వ శక్తుడైన మహేశపుత్రుణ్ణి, ఏకదంతుణ్ణి, షణ్ముఖ అగ్రజుణ్ణి వినాయక చవితి నాడు పూజించిన వారు బ్రహ్మవాదులై, మోక్షసాధనా మార్గంలో నడుస్తూ పరమపదాన్ని చేరుతారు. వినాయకుణ్ణి అర్చించి, కీర్తించిన వారికి విద్యాబుద్ధులతో బాటు అధ్యయన, అధ్యాపనా సామర్థ్యం ప్రాప్తిస్తుంది.
“వివర్జిత నిద్రాయ నమః”
అని పూజించేవారికి బుద్ధిశక్తిని, ధారణ సామర్థ్యాన్ని అందిస్తాడు ఈ వినాయకుడు. ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశ్వర ప్రార్థన, పూజతో ఆరంభిస్తే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మందబుద్ధిని పరిహరించి, వేదజ్ఞానాన్ని ప్రసాదించే క్షిప్రవరదుడైన శంకర తనయుణ్ణి ఆర్తితో అర్చించినవారి మానవుల మనస్సులలోని కశ్మలాన్ని తొలగిస్తాడు. ఇవి శిల్ప శాస్త్రం చెప్పే గణపతి విశేషాలు. ఈ రూపాలలో ఉన్న గణపతులనే మనం ఆలయాలలో దర్శిస్తున్నాం . అర్చిస్తున్నాం . అదీ మన శిల్ప శాస్త్ర వైశిష్యం .
విఘ్నేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు !!