Online Puja Services

గణపతికి ఇంత మంది భార్యలున్నారా !!

3.133.109.251

గణపతికి ఇంత మంది భార్యలున్నారా !!
- లక్ష్మి రమణ 

గణపతిని లక్ష్మీ సహితంగా లక్ష్మీ గణపతిగా ఆరాధిస్తాం . లక్ష్మీ గణపతికి పూజలతో పాటు విశేషించి హోమాదికాలు కూడా జరిపిస్తూ ఉంటాం . లక్ష్మీ దేవి కాకుండా సిద్ధి , బుద్ధి సమేత గణపతి మనకి దర్శనమిస్తారు. వీరిద్దరూ గణపతికి భార్యలుగా వివాహ మహోత్సవాలు నిర్వహిస్తుంటాం . వీరీకాక, గణపతికి తుష్టి , పుష్టి అని మరో ఇద్దరు భార్యలున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి . లక్ష్మీ దేవితోపాటుగా సరస్వతీదేవి కూడా గణపతి సహితంగా దర్శనమిస్తారు . వీరు ముగ్గురూ కలిసి ఉన్న చిత్రాలని పూజాగదిలో పెట్టుకొని ఆరాధిస్తాం. శక్తి గణపతి అనేది గణపతి మరో స్వరూపం . ఇదంతా ఒకెత్తయితే, గణపతి స్వామిని బ్రహ్మచారని చెబుతారు కదా ? ఇంతమంది భార్యలున్న గణపయ్య బ్రహ్మచారి ఎలా అయ్యారు ?

ఈ విషయాన్ని మనం వీలైనంత సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తేగానీ, అంతరార్థం బోధపడదు . భార్య అని అంటే, విడదీయలేని శక్తి . లేదా సదా అంటిపెట్టుకొని ఉండే శక్తి స్వరూపం అని అర్థం . పురాణాలలో దేవతా స్వరూపాలని కథా రూపంగా చెప్పేటప్పుడు అందులో మంత్ర సంకేతాలు , యజ్ఞ సంకేతాలు , తదితర రహస్యాలనెన్నింటినో సంకేతాలుగా  పొందుపరిచారు.   మనం సంకేతాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది . 

ఉదాహరణకి సిద్ధి , బుద్ధి సహిత గణపతిని తీసుకుంటే, వీరి సంతానం క్షేముడు , లాభుడు . ఇక్కడ సిద్ధి , బుద్ధి అనేవి ఆ పరమాత్మని అంటి పెట్టుకొని ఉండే శక్తులు . గణపతిని సిద్ధి, బుద్ధి సమేతంగా అర్చించడం వలన కార్యములలో యోగములో బుద్ధి నిలిచి సిద్ధి కలుగుతుంది . తద్వారా మనం క్షేమం, లాభం పొందుతాము . పుత్రులు అంటే ఇక్కడ ఆయన అనుగ్రహించే ప్రసాదము అని అర్థం చేసుకోవాలి .  ఇక్కడ ధర్మం పదిలంగా ఉండడం క్షేమం అయితే, ఏ యోగముద్వారా పరమాత్మని పొందడానికి సాధన చేస్తామో అది లాభించి సిద్ధిని పొందడం అనేది లాభం లేదా లాభుడు అని అర్థం చేసుకోవాలి . 

దేవీభాగవతంలో ఆయనకీ తుష్టీ , పుష్టి అని ఇద్దరు భార్యలున్నట్టు వర్ణిస్తారు . తుష్టి అంటే తృప్తి , సంతోషం. ఇవి రెండూ లేనప్పుడు మనకి ఎంతటి సంపదలూ, సౌభాగ్యాలూ ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు కదా !  అదేవిధంగా వినాయకుడికి పుష్టీ పతి అని పేరు . పుష్టి అంటే సంవృద్ధిగా ఉండడం అనేకదా అర్థం . బలం , దానం , తృప్తి పుష్టిగా ఉండాలి . అప్పుడే కదా మనం , మన దేశం, ఈ జగత్తు పుష్టిగా ఉంటుంది . ఇవి ఆయన శక్తులు. ఆయన్ని ఉపాసించడం వలన సిద్ధిస్తాయి . ఉపాసన అంటే ఆ గణపతికి సర్వదా సామీప్యంగా ఉండడం.  మనసా, కర్మణా, వాచా గణపతిని ఉపాశించేవారికి ఇవన్నీ సిద్ధిస్తాయి . 

ఇక లక్ష్మీ గణపతిని గురించి రకరకాలుగా మాట్లాడడం వింటూ ఉంటాం . ఇప్పుడు ఉపాసనా కోణం నుండీ లక్ష్మీ గణపతిని చూస్తే, లక్ష్యం అయిన వాటిని అనుగ్రహించే మాత లక్ష్మీ మాత. లక్ష్యమయ్యేవి ఏమిటి ? సిద్ధి , బుద్ధి, తుష్టి , పుష్టి, లాభం, క్షేమం ఇవేకదా ! ఈ సౌభాగ్యాలన్నింటికీ ఒక పేరు పెడితే  ఆవిడ లక్ష్మి . అందువల్ల ఆమె ఆయన శక్తి. కనుక లక్ష్మీదేవిని గణపతి సహితంగా ఆరాధించడం . ఇక బుద్ధినిచ్చే దేవి వాగ్దేవేకదా !! అప్పుడు సిద్ధి, బుద్ధులు లక్ష్మీ , సరస్వతులు కదా !   ఇలా ఉపాసనా దృష్టితో గణపతిని అర్థం చేసుకున్నప్పుడు ఆయన సర్వాంతర్యామిత్వం అర్థమై, బుద్ధి ఆ సిద్ధిగణపతి ముందర మోకరిల్లుతుంది . 

అదీ సంగతి. అందువల్ల గణపయ్య ఇంత మంది భార్యలకు భర్త అనుకోవడం కాదు చేయవలసింది. గణపతి ఆరాధన వల్ల ఇన్ని శక్తుల అనుగ్రహం కలుగుతుంది అని భావం . కనుక గణపయ్య ఇంతమంది భార్యలుండీ బ్రహ్మచారి అన్నమాట !

శ్రీ విఘ్నేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు !!

శుభం .    

ganapati, ganapathi, lakshmi, siddi, siddhi, buddi, buddhi, saraswati, saraswathi, ganesh, ganesa, vinayaka, vighneswara

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi