కుబేరుడుకూడా ఉపాసించిన ఉచ్చిష్టగణపతి
కుబేరుడుకూడా ఉపాసించిన ఉచ్చిష్టగణపతి !
లక్ష్మీ రమణ
ఉచ్చిష్టగణపతిని తంత్రశాస్త్రములో అత్యంత శక్తివంతమైన దేవతగా చెప్పారు . ఈయన రూపము చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన నీలిరంగులో లక్ష్మీ దేవిని తన తొడపైన కూర్చోబెట్టుకొని కనిపిస్తారు . ఈ స్వరూపాన్ని తాంత్రికులు రకరకాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు . అయినప్పటికీ కూడా సృష్టి కార్యాన్ని ప్రతిబింబించే ఈ స్వామీని సాత్విక విధానములో అర్చించుకోవడం వలన అనేక సమస్యలు తొలగిపోతాయి. శత్రునాశనం, విద్యా, విజ్ఞానాల వృద్ధి జరుగుతుంది. కోల్పోయిన సంపదలు తిరిగి పొందడానికి, దివాళాతీసిన సంస్థలు తిరిగి నిలదొక్కుకోవడానికి, కోరినకోర్కెలు తీరడానికి ఈ గణపతిని ఆరాధిస్తూ ఉంటారు. జూదములో , వివాదంలో, యుద్ధములో ఉచ్చిష్ట గణపతి తంత్రానికి మించిన అస్త్రం లేదని ప్రతీతి. మీదుమిక్కిలి ఈయన సంతానదాయకుడు. పిల్లలు లేనివారికి ఈ గణపతి ఆరాధన ఉత్తమమైనది . కుబేరుడు కూడా ఈ గణపతిని ఆరాధించే సంపదలకు అధినాయకుడయ్యారని చెబుతారు .
కారాకిళ్ళీలు నములుతూ , ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసుకుంటూ, పైలా పచ్చీసుగా ప్రవర్తించేవారిని ‘ఏరా ఉచ్చిష్ట గణపతి ఉపాసన చేస్తున్నావా ఏమి?’ అని ప్రశ్నించేవారు వెనకటివారు . ఉచ్చిష్టము అంటే ఎంగిలి అని అర్థము . ఇంకా పూజానంతరం మిగిలిపోయింది అనే అర్థం కూడా వస్తుంది . తామసిక తంత్ర ఉపాసనా విధానం వామాచారంలో ఇటువంటి వ్యవహారాలతో కూడిన పూజావిధానం కనిపిస్తుంది . అది సాత్విక ఆరాధకులకి కాస్త ఏహ్యతగా కలిగించినా ఆశ్చర్యంలేదు . అయితే అది అహం బ్రహ్మస్వి అనే భావంతో చేసేటటువంటి పూజ . దానిని సామాన్యులు అనుసరించలేరు కూడా !
సాత్వికఉపాసన మనకు విహితమైనది .సాత్విక స్వరూపంగా ఈ స్వామి రూపాన్ని చూస్తే, గణపతి వాక్ స్వరూపునిగా, శబ్ద స్వరూపునిగా, మంత్రాధిపతిగా సర్వసృష్టికర్తగా కనిపిస్తారు. ‘గణానాంత్వా గణపతికుంహవామహే’ అనే వైదిక మంత్రం ఈ భావననే చెబుతుంది. మంత్రాలకి - గణాలు, కవులు అని పేరు. వాటికి అధిపతిగా ఉన్న పరమేశ్వర చైతన్యమే గణపతి స్వరూపం . ఈ మంత్రాలన్నీ కూడా అక్షరాత్మకములు. అక్షరాలన్నీ కూడా నోటి ద్వారానే కదా ఉచ్చరింపబడతాయి. అందుకే అక్షరాలే ఉచిష్టాలు. అన్ని అక్షరాలకు, మంత్రాలకు అధిపతి అయిన ఆ పరబ్రహ్మ గణపతిగా, ఉచ్చిష్ట గణపతిగా ఆవిర్భవించారు.
ఉచ్చిష్ట గణపతి సహస్రనామాలలో ‘జిహ్వ సింహాసనః ప్రభుః’ అనే నామం ఉంటుంది. నోరు అనే కలుగులో నాలుక అనే మూషికం పైన తిరిగే అక్షరాకృతే ఉచ్చిష్ట గణపతి. ఇలా భావించి ఉచ్చిష్టగణపతిని ఉపాసించే వైదిక ఆచారములో ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆరాధకులకు విద్యా, విజ్ఞానాలకు లోటుండదు . విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు . ఒక్క పరబ్రహ్మము తప్ప . అలా అన్ని మాయమైపోయాక మిగిలే వాడు (శిష్ట ) ఎవరున్నారో, ఆ జగత్ప్రభువే ఈ ఉచ్చిష్టగణపతి .
ఇక దేవేరిని (శక్తి) స్వరూపాన్ని సృష్టి ప్రతీకగా కలిగిఉన్న ఈ స్వామీ , సత్సంతానాన్ని అనుగ్రహిస్తాడని ప్రతీతి . సృష్టి మొత్తాన్ని రచించినవాడు, ఆయన అనుగ్రహం ఉంటె వారసత్వానికి లోటేముంది.
ఉచ్చిష్ట గణపతి ఆరాధన చాలా ఉత్కృష్టమైనది, ఉత్తమమైనది . అయినా ఈ స్వరూపంలో స్వామి దర్శనమిచ్చే ఆలయాలు చాలా అరుదుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు . అటువంటివాటిల్లో పెద్దది, ప్రముఖమైనదీ తమిళనాడులోని తిరువన్వేలిలో ఉంది. ఇక్కడి ఆలయంలో ఉన్న గణపతి తన తొడ మీద కూర్చుని ఉన్న శక్తిమాట లక్ష్మీదేవి ఉదరభాగాన్ని, తొండంతో తాకుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ భంగిమ సంతానప్రాప్తిని సూచిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకనే సంతానాన్ని కోరుకునేవారు, ఈ ఆలయంలోని గణపతిని పూజిస్తే వారి కడుపు పండుతుందని భక్తులు విశ్వశిస్తారు .
శుభం .