వినాయకుణ్ణి ఎత్తుకెళ్లిన లక్ష్మీ దేవి !
అమ్మ పార్వతికి ఒక్క మాటైనా చెప్పకుండా వినాయకుణ్ణి ఎత్తుకెళ్లిన లక్ష్మీ దేవి !
లక్ష్మీ రమణ
విష్వక్సేనుడు, వినాయకుడూ ఇద్దరూ తొలిపూజలందుకునే వారే ! ఒకరేమో శైవ సంప్రదాయంలో గణాధిపతి అయితే, మరొకరు వైష్ణవ సంప్రదాయంలో గణాధిపతి . ఇద్దరూ దేవీ శక్తి స్వరూపాలైన పార్వతీదేవి , లక్ష్మీదేవులకి ముద్దలా బిడ్డలే . వీరి సారూప్యత ఇంతటితో ఆగలేదు . ఆయనకీ ఈయనకే భేదంలేదని , ఆమాటకొస్తే, లక్ష్మీదేవి వినాయకుణ్ణి దొగతనం చేసిందని చెబుతారు . అంతటి అపవాదా అనుకుంటున్నారేమో !! ఈ కథ విన్నారంటే, మీరూ నిజమంటారు మరి !!
గణాధిపత్యాన్ని పొంది , రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కీర్తించడంలో విశేషమేమీలేదుకదా ! ఆ గణాధిపతికి, గుణాధిపతికి జన్మనిచ్చిన గౌరమ్మనికూడా వారందరూ గొప్పగా ప్రసంశించారు. బిడ్డని ఎవరైనా పొగుడుతూ ఉంటె, పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది ? గౌరమ్మ కూడా వినాయకుని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది . ఈ సందర్భంలోనే అనిపించిందట లక్ష్మీదేవికి నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని .
ఆలశ్యం చేయకుండా ఆ సిరిమహాలక్ష్మి , శ్రీమహావిష్ణువుని ప్రార్ధించి , నాకూ వినాయకుడి లాంటి కొడుకే కావాలి . కుదిరితే, వినాయకుడే నా కొడుకు కావాలీ అని అడిగారట !అప్పుడు విష్ణుమూర్తి , నువ్వే ఆ వినాయకుణ్ణి ప్రార్ధించి , ప్రసన్నం చేసుకో లక్ష్మీ అని చెప్పారు . వంటనే అమ్మవారు వినాయకుని కొడుకుగా పొందేందుకు తపస్సు చేశారట . ఆ తల్లి మనసు తపన విని గణేశుడు పరుగున వచ్చి , అమ్మ ! ఎందుకు నన్ను గురించి తాపం చేస్తున్నావు ? నీ కొరికేమిటో తెలియజేయి తల్లి అని అగిడారట . అప్పుడు లక్ష్మీ దేవి నీ నుండీ అమ్మా అన్న ఈ పిలుపు నాకు శాశ్వతంగా కావాలి గణేశా అని కోరారు .
అప్పుడాయ , అది నా అదృష్టం తల్లీ ! అలాగే కానివ్వు అన్నారట ! అంటే, ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీ దేవి, వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకనెట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్లిపోయారట . పార్వతిదేవికి ఒక్కమాట కూడా చెప్పకుండా, ఆవిధంగా ఆ తల్లి బిడ్డని ఎత్తుకుపోవడం ఒక విధంగా దొంగతనమే కదా! కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వరులు ఆమె ముచ్చట కి నవ్వుకున్నారట .
ఈ విధంగా వైకుంఠం చేరిన గణాధిపతి పూర్ణానందుడు అని పేరు పెట్టుకొని, ఏలారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుందట లక్ష్మీ దేవి ! ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్లి అడగండి! అని ఆదిదంపతులు ఆదిలక్ష్మి దగ్గరికి పంపించారు . దేవతలా వినతి మీదట పూర్ణానందుడిని యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీ దేవి . అలా విష్ణుసైన్యానికి నాయకుడై , విష్వక్సేనుడై రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు, ఆరోజు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో , అదే విధంగా లక్ష్మీదేవికి కూడా దేవతలా ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి, ఆమె కోరిక తీర్చాడు . తర్వాత వినాయకుడు లక్ష్మీ దేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షం అవుతాను. అని చెప్పి, సెలవు తీసుకుని కైలాసం చేరుకున్నారు .
అందుకే విష్ణు దేవాలయంలో విశ్వక్సేనుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు.. శివాలయంలో, వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు, దంపతులు లక్ష్మీదేవిలా ఆయన్ని అనుగ్రహించమని పూజిస్తే, ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం . దీనికి సంబంధించి , పుత్ర గణపతి వ్రతాన్ని ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ఆచరించాలని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి . ఈ వ్రతాన్ని గురించి మరొక పోస్ట్ లో వివరించే ప్రయత్నం చేస్తాము . శుభం !!