గణపయ్య కేవలం భారతీయ దేవుడంటే , ప్రపంచం ఒప్పుకోదు.
గణపయ్య కేవలం భారతీయ దేవుడంటే , ప్రపంచం ఒప్పుకోదు.
వినాయక చవితి వచ్చింది అంటే మన దేశమంతా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో గణపయ్యలను తయారు చేసి వాటికి అంగరంగవైభవంగా పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. ప్రతిపూజలోనూ తొలిపూజలందుకొనే గణపతి నవరాత్రులతోనే , భారతదేశంలో భారీ పండుగలు మొదలవుతాయి . అందుకే ఈ పండుగకి దీనికి అత్యధిక ప్రధాన్యత ఉంటుంది. అయితే,, గణపయ్య కేవలం భారతీయ దేవుడంటే , ప్రపంచం ఒప్పుకోదు . ఎందుకంటె, వివిధ దేశాల్లో బోజ్జగణపయ్యలకు దేవాలయాలు ఉన్నాయి. రకరకాల పేర్లున్నాయి . ఆ విశేషాలు తెల్సుకుందాం పదండి .
అమెరికా
అమెరికాలోని న్యూయార్క్‌లో ‘శ్రీ మహావల్లభ గణపతి ఆలయం’ ప్రసిద్ధి. అక్కడ నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయాన్ని స్థానికులు ‘ఫ్లషింగ్ టెంపుల్’అని పిలుస్తారు. అమెరికాలో చాలాచోట్ల లంబోదరునికి ఆలయాలున్నాయి.
జపాన్‌లో
జపాన్‌లో గణపతిని కాంగిటెన్ అని పిలుస్తారు. షాటెన్, గణాబాచి, బినాయకటెన్ ఇలా పలు పేర్లతో పిలుస్తారు. టోక్యోలో అతి పురాతన బౌద్ధ ఆలయాల్లో కాంగిటెన్ ఆలయమూ కనిపిస్తుంది. కొన్ని ఆలయాల్లో ఆడ ఏనుగు (స్త్రీ శక్తి)ను ఆలింగనం చేసుకున్న రూపంలోనూ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలను పెట్టెల్లో ఉంచే సంప్రదాయం ఉంది. ఉత్సవాల సమయంలో వెలుపలికి తీసి పూజలు నిర్వహిస్తుంటారు. ఆర్థిక విజయాలు ప్రసాదించే దైవంగా వినాయకుడిని కొలుస్తారు జపనీయులు.
సింగపూర్
సింగపూర్‌లోని సిలాన్ రోడ్డులో ‘శ్రీ సెంపెగ వినాయగర్’ ఆలయం ఉంది. చోళ రాజుల నిర్మాణ శైలిలో నిర్మితమైన దీనికి 162 ఏండ్ల చరిత్ర ఉన్నది.
ఐర్లాండ్
బెర్లిన్‌కు చెందిన విక్టర్ లాంగ్‌హెల్డ్ద్‌కు ఆధ్యాత్మిక యాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. ఆసియాలో పర్యటించినపుడు వినాయకుడి భక్తుడిగా మారాడు. వినాయకుడి మీద ఉన్న భక్తితో వివిధ భంగిమల్లో విగ్రహాలను చెక్కించాడు. వీటిని ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలోని ‘విక్టోరియా వే’ పార్కులో ప్రతిష్ఠించాడు. తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పకారులు ఈ విగ్రహాలను చెక్కారు. విగ్రహాల కోసం గ్రానైట్ శిలను ఉపయోగించారు. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి ఐదుగురు శిల్పులు దాదాపు ఏడాదిపాటు శ్రమించారు. ఒక్కో విగ్రహం 3 నుంచి 5 అడుగుల ఎత్తు ఉంటుంది.
నేపాల్‌లో తంత్ర గణపతి
నేపాల్‌లో హిందూ దేవుళ్ల ఆలయాలు కోకొల్లలు. గణపతి గుళ్లూ ఎక్కువే! అక్కడి వారు తాంత్రిక ఉపాసనలో విఘ్నేశ్వరుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేపాల్‌లోని ఆలయాల్లో కనిపించే గణపయ్య విగ్రహం కాస్త భిన్నంగా ఉంటుంది. ఏటవాలు కళ్లతో ఉంటాడు. విగ్రహం చేతుల్లో మొక్కలు ధరించి ఉండటం విశేషం. ప్రకృతి ప్రేమికులు గణపతిని పంటల దేవుడిగా భావిస్తారు.
మయన్మార్‌లో బ్రహ్మగా
వినాయకుడు అంటే మనం శివపార్వతుల తనయుడిగా కొలుస్తాం. కానీ, మయన్మార్‌లో విఘ్నేశ్వరుడిని బ్రహ్మగా భావిస్తారు. అందుకు ఓ పురాతన గాథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడి శిరస్సు భంగం అయినప్పుడు.. ఏనుగు తలను అతికించారనీ.. అలా బ్రహ్మ దేవుడు కాస్తా గజాననుడిగా మారాడని విశ్వసిస్తారు. నేటికీ మయన్మార్‌లో వినాయక చవితికి గణపతిని పరబ్రహ్మగా పూజిస్తుంటారు. వినాయక చవితి సమయంలో వారం రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు.
ఇది మన వినాయకుడి కథలాగే వుందికదూ !
ఇండోనేషియా
వినాయకోత్సవాల్లో వీళ్ళు మనకంటే ఘనులు .
ఇండోనేషియాలోని బాలిదీవిలో గణపతికి ఆలయాలు ఉన్నాయి. పాఠశాలలు, ప్రముఖ నిర్మాణాల్లోనూ గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తుంటారు. ఇండోనేషియా కరెన్సీపై కూడా గణపతి బొమ్మను చూడొచ్చు. బాలీతో పాటు సుమత్రా దీవులు, జావా ద్వీపంలోనూ గణపతి ఆలయాలు దర్శనమిస్తాయి. వినాయక చవితితో పాటు ఇతర పర్వదినాల్లో గజాననుడికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. అంతేకాదు, బాలీలో 30 అడుగుల ఎత్తున్న వినాయక విగ్రహన్ని 2006లో ప్రతిష్ఠించారు. భారత్‌లోలానే ఇండోనేషియాలో కూడా గణపతి నిమజ్జనోత్సవాలు ఎంతో కోలాహలంగా జరుపుతారు. పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు హాజరయిన భక్తులు కొబ్బరి కాయలు కొడుతుంటారు. ఆ కొబ్బరి చిప్పలను తొలగించడానికి ఒక రోజంతా పడుతుంది. ఈ విగ్రహం చుట్టూ 204 దేశాల జెండాలను ఉంచుతారు.
థాయ్‌లాండ్
వినాయకుణ్ణి థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికనెట్’ అని పిలుస్తారు. బ్యాంకాక్‌కు చెందిన ల్యూంగ్ పొర్ అనే బౌద్ధ భిక్షువు గణపతికి ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని కోరాడు. దానికోసం తన భూమిని విరాళంగా ఇచ్చాడు. కొంతమంది దాతల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేసింది. ఇందులో థాయ్‌లాండ్‌లోనే అతి పెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒక విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. మరో విగ్రహాన్ని 2010లో చెక్కారు. ఇది 9 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే , అద్భుతం ఈ వక్రతుండిని విదేశీ ప్రాభవం అనిపిస్తోంది కదూ ! మరింకెందుకాలస్యం , మీరూ చేతులు జోడించి మనసారా నమస్కారం చేస్కోండి .
తొండము నేకదంతము తోరపు బొజ్జయు
వామహస్తమున్
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్!!
- లక్ష్మి రమణ