మతాతీతుడు ఈ మహిమాన్విత గణపతి
మతాతీతుడు ఈ మహిమాన్విత గణపతి
ఏ పూజలోనైనా, ఏ వ్రతంలోనైనా, క్రతువులోనైనా, యజ్ఞయాగాదికాలలోనైనా తొలిపూజలు అందుకునేది వినాయకుడే! ముక్కోటి దేవతలలో వినాయకుడికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఇది. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం గణపతి గాథలను విపులంగా ప్రస్తావించాయి. ప్రాచీన గ్రంథాలను పరిశీలిస్తే, రుగ్వేదంలో గణపతి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. ఇది క్రీస్తుపూర్వం రెండువేల సంవత్సరాల నాటిదని చరిత్రకారుల అంచనా.
మన దేశంలో గుప్తుల కాలం నాటికి... అంటే, క్రీస్తుశకం నాలుగు, ఐదో శతాబ్దాల నాటికి వినాయకుడి ఆరాధన ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్ది నాటికి ప్రత్యేకంగా గాణపత్య మతమే ఏర్పడింది. షణ్మతాలలో ఒకటిగా పేరుపొందింది. మన దేశంలో శైవ, వైష్ణవ, సౌర, శాక్తేయ, గాణపత్య, కౌమార మతాలు ఉండేవి. గాణపత్య మతస్థులు గణపతిని ప్రత్యేకంగా ఆరాధించేవారు. అయితే ఇతర మతాలలోనూ వినాయకుడిని ఆరాధించే సంప్రదాయం ఉంది. బౌద్ధ, జైన మతస్థులు కూడా గణపతిని ఆరాధించేవారు. గణపతి ఆరాధాన మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, నేపాల్, భూటాన్, టిబెట్, చైనా, కంబోడియా, జపాన్, ఇండోనేసియా, సింగపూర్ వంటి దేశాలలోనూ ప్రాచీనకాలం నుంచే గణపతి ఆరాధన ఉండేది. పలు దేశాల్లో గణపతి ఆరాధన ఇప్పటికీ కొనసాగుతోంది.
బౌద్ధ, జైనాలలో వినాయకుడు
గణపతి ఆరాధన హిందూమతానికి మాత్రమే పరిమితం కాలేదు. జైన, బౌద్ధమతాలు కూడా తమదైన రీతిలో గణపతిని ఆరాధించుకుంటాయి. జైనమతం కుబేరుడికి చెందిన కొన్ని కీలకమైన విధులను గణపతికి కేటాయించింది. ‘అభిదానచింతామణి’ అనే జైనగ్రంథంలో వినాయకుడి ప్రస్తావన కనిపిస్తుంది. ఆ గ్రంథం వినాయకుడిని హేరంబుడిగా, గణవిఘ్నేశుడిగా, వినాయకుడిగా ప్రస్తుతించింది. గుప్తుల కాలంలో బౌద్ధులు కూడా వినాయకుడిని ఆరాధించడం మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
తాంత్రిక బౌద్ధంలో మహారక్త గణపతిని పూజించేవారు. షడ్భుజాలు గల మహాకాలుడి రూపంలో బౌద్ధ తాంత్రికులు మహారక్త గణపతిని ఆరాధించేవారు. చైనా, జపాన్ ప్రాంతాల్లో బౌద్ధులు క్రీస్తుశకం ఏడు, ఎనిమిది శతాబ్దాల కాలంలోనే వినాయకుడిని ఆరాధించేవారు. ఇక ‘గణపతి పురాణం’ ప్రకారం బుద్ధుడిని గణపతి అవతారంగానే భావిస్తారు. గణేశ సహస్రనామాల ప్రకారం బుద్ధుడు సాక్షాత్తు గణపతి అవతారమేనని పదిహేడో శతాబ్దికి చెందిన పండితుడు భాస్కరరాయలు అభిప్రాయపడ్డారు. థాయ్‌లాండ్, కంబోడియా వంటి దేశాలలో వినాయకుడిని విజయానికి, అదృష్టానికి కారకుడిగా ఆరాధిస్తారు. వినాయకుడు బుద్ధిబలాన్ని అనుగ్రహించడమే కాకుండా, అదృష్టాన్ని కలిగిస్తాడని పలు దేశాలలో నమ్ముతారు.
ఇక భారతదేశంలో కొందరు ముస్లిం సోదరులు కూడా గణపతి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు . భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన ఈ సంస్కృతిలో , కొందరు తమ ఇళ్లలో గణపతిని నిల్పి , పూజించడం కూడా కద్దు .
- లక్ష్మి రమణ