పంచభూతాధిపతి ఈ గణాధిపతి
పంచభూతాధిపతి ఈ గణాధిపతి .
వినాయక చవితి వచ్చిందంటే, భారతదేశమంతటా సరికొత్త పండగ వాతావరణం నెలకొంటుంది . సృష్టిలోని ప్రతి రూపం వినాయక ప్రతిరూపమేనన్నట్టు , వినాయకమండపాల్లో నానావిధరూపాల్లో దర్శనమిస్తుంటాడు మన గణనాయకుడు . అయితే మన పురాణ ఇతిహాసాలననుసరించి ముప్పై రెండు రూపాలలో విఘ్నేశ్వరుణ్ణి అర్చించడం విశేషమైన ఫలితాలను అందిస్తుందని చెబుతారు . సాధారణంగా చతుర్భుజాలను కలిగి ఉండే గణపతి సందర్భాన్ని బట్టీ పదహారు నుండీ ఇరవై భుజాలతో దర్శనమిస్తారు . విశేషానుసారంగా రకరకాలైన పళ్ళు , పూలు , ఆయుధాలు తదితరాలను ధరించి కనిపిస్తారు . పంచభూతాలకూ ప్రతీకలుగా ఈ 32 గణపతుల్లోని మొదటి ఐదు రూపాలనూ పేర్కొంటారు . మిగిలిన రూపావిశేషాలకన్నా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పంచభూత్మకమైన ఈ గణేశుని రూపాలను ఆరాధించడం అత్యుత్తమమని శృతి వచనం . ఆ రూపాలు ఇవీ :
బాల గణపతి -
విశిష్టమైన 32 గణపతుల్లో మొదటి రూపం ఈ బాలగణపతి . పేరుకి తగినట్టే చిన్నారి బాలుడి రూపంలో దర్శనమిస్తారు ఈ స్వామి . చతుర్భుజాలతో ఉండే బాలగణపతి, తన చేతుల్లో మామిడి పండు , అరటిపండు, పనసపండు , చెఱకు గడ ధరించి ఉంటారు . తొండంతో తనకిష్టమైన మోదకాన్ని గ్రహిస్తూ, ఉదయిస్తున్న సూర్యబింబంలా అరుణ కాంతితో ముద్దులొలికే బాలుడై కనిపిస్తారు .
బాలగణపతి పంచభూభక్తి గణపతితాలలో పృధివీ తత్వానికి ప్రతీక . పంటలు బాగా పండాలంటే , బాలగణపతిని ఆరాధించడం శ్రేయస్కరం . భక్త సులభునిగా పేరున్న బాలగణపతిని ఆరాధించడం వల్ల పిల్లల్లో తెలివితేటలు వృద్ధి చెందుతాయని , వారు మంచి అలవాట్లతో చక్కని జీవితాన్ని పొందుతారని చెబుతారు .
బాలగణపతిని తమిళనాడులోని చిదంబరంలో ఉన్న ప్రసిద్ధ నటరాజస్వామి దేవాలయంలో దర్శించవచ్చు .
తరుణ గణపతి
వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి నవయువకుడిగా ఎర్రని రంగులో కాంతివంతంగా విరాజిల్లుతుంటాడు. ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు.
ఈయనకి ఎనిమిది చేతులుంటాయి. వీటిలో కుడివైపున్న చేతుల్లో దంతం, జామపండు, చెరుకు గడ,అంకుశాలనూ ఎడమవైపున మోదకం , వెలగపండు , లేతమొక్కజోన్నపొత్తి , వలని ధరించి ఉంటాడు.
పంచభూతాలలో ఈయన వాయుతత్వానికి ప్రతీక .
వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.
ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం నెరవేరతాయి. స్కాంద పురాణంలోనూ, బ్రహ్మ పురాణంలోనూ, వామన పురాణంలోనూ ముద్గళ పురాణంలోనూ తరుణ గణపతిని గురించిన ప్రస్తావన ఉంటుంది.
ఇక తరుణ గణపతిని తిరువనంతపురంలోని పళవంగడి గణపతి ఆలయంలోనూ, మధ్యప్రదేశ్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో దర్శించుకోవచ్చు.
భక్త గణపతి
పేరుకి తగ్గట్టు భక్తులకి వరదాయకుడు ఈ భక్త గణపతి. శరణన్నవారి పాలిట కొంగు బంగారమే . వసంత కాలంలో విరిసే పూర్ణచంద్రబింబంలా తెల్లని దేహ కాంతితో, చతుర్భుజాలను కలిగి ప్రసన్నవడ్ఢనంతో దర్శనమిస్తారు. తనచేతుల్లో అరటిపండు , మామిడిపండు , కొబ్బరికాయ పాయసాన్నపు పాత్రలను ధరించి ఉంటారు .
పంచభూతాలలో జలతత్వానికి ప్రతిరూపంగా ఈ గణపతిని చెబుతారు . వినాయక చవితితోపాటు సంకష్టహర చతుర్థి నాడు ఈ రూపంలో స్వామిని అర్చించడం విశేషఫలదాయంగా చెబుతారు .
ఒత్తిడిని అధిగమించడానికి , క్రోధావేశాలమీద ఏడుపును సాధించడానికి, మనశాంతిని పొందడానికి ఇంకా జీవితంలో ఎదురయ్యే ఆపాలనుండీ రక్షణ పొందేందుకు ఈ గణపతి ఆరాధన శ్రేష్ఠమని నమ్ముతారు .
వీర గణపతి -
ప్రధానమైన ముప్పై రెండు గణపతి ప్రతిరూపాల్లో నాలుగవ రూపం వీరగణపతి . పైన చెప్పిన మూడురూపాలకూ విరుద్ధంగా ఈ రూపంలో గణనాయకుడు శాస్త్రాస్త్రాలను ధరించి పదహారు భుజాలతో, రౌద్ర స్వరూపంగా దర్శనమిస్తారు.ధైర్య సాహసాలకు ప్రతీకైనా ఈ గణాధిపతి ధనుస్సు, బాణం, చక్రం , త్రిశూలం, భేతాళం,పరశువు , ఖడ్గం , గద ,నాగ పాశాలను ధరించి విజయ ధ్వజంతో జ్వాజ్వాల్యమానమైన ఎరుపు వర్ణంలో వీరత్వానికి ప్రతీకలా వెలిగిపోతుంటాడు .
వీరగణపతిని పంచభూతాలలో అగ్ని స్వరూపంగా చెబుతారు . ఈ స్వామిస్వరూపాన్ని అర్చించడం వల్ల సకల భయాలు , ఆపదల నుండీ రక్షణ లభిస్తుంది . దుష్ట శక్తుల పీడ నుండీ విముక్తి లభిస్తుంది .
వీరస్వరూపుడైన గణపతిని తమిళనాడురాష్ట్రంలోని మధురైలో ఉన్న మీనాక్షీ సుందరేశ్వరస్వామి ఆలయంలో దర్శించుకోవచ్చు .
శక్తి గణపతి
శక్తి స్వరూపంమైన అమ్మవారితో కూడిఉన్న రూపమే ఈ శక్తి గణపతి . సింధూర వర్ణంలో విరాజిల్లుతూ , తన ఎడమ తొడపైన శక్తి స్వరూపిణి అయినా దేవితో, నాలుగు భుజాలతో దర్శనమిస్తారు ఈ గణపతి . ఒక చేతిలో దంతాన్ని పట్టుకొని మరో చేతిరో సర్వ జీవులకూ శక్తి ప్రదాయని అయిన ఆకుపచ్చని వర్ణంలో ఉన్న శక్తి మాతను చుట్టి ఉండే ఈ స్వామి మరో రెండు చేతుల్లో అంకుశం , పాశం ధరించి ఉంటారు.
ఆకాశతత్వానికి ప్రతీకగా పేర్కొనే శక్తి గణపతి ఆరాధనకు తంత్ర శాస్త్రం అధిక ప్రాధ్యాన్యనిస్తుంది . ఈ రూపంలోని విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన ఇంద్రియ నిగ్రహం , సర్వకార్య సిద్ధి లభిస్తాయి . ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి గృహంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయి .
తమిళనాడు, మధురై లోని తిరుప్పరంకుండ్రంలో నెలకొనివున్న మురుగ దేవాలయంలో ఈ రూపంలో ఉన్న గణాధిపతిని దర్శనం చేయొచ్చు .
--లక్ష్మీ రమణ