అష్ట గణేశావతారాలు
అష్ట గణేశావతారాలు
1. వక్రతుండావతారం: 'మత్సరా'సురుని సంహరించినది ఈ అవతారం. సింహ వాహనంపై ఉండే గణపతి ఇతడు. జీవుల 'శరీరతత్వం'లోని దివ్యత్వం ఈ గణేశ రూపం. 'దేహబ్రహ్మధారకుడు' అని పురాణం పేర్కొంది.
2. ఏకదంతావతారం: 'మదా'సురిని పరిమార్చిన ఈ గణపతి మూషికవాహనుడు. మనలో 'జీవ' (దేహి) భావంగా వ్యక్తమయ్యే చైతన్యతత్వం ఈ మూర్తి.
3. మహోదరావతారం: 'మోహాసురు'ని నశింపజేసిన ఈ వినాయకుడు మూషిక వాహనుడు. 'జ్ఞాన'చైతన్యానికి అధిపతి.
4. గజాననావతారం: సాంఖ్య (పరబ్రహ్మ) తత్వానికి అధిష్ఠానదేవతగా కొలిచే ఈ స్వామి జ్ఞానప్రదాత. 'లోభా'సురుని సంహరించిన ఈ గణపతీ మూషికవాహనుడే.
5. లంబోదరావతారం: 'క్రోధాసురుని మర్దించిన అవతారం. 'శక్తి' బ్రహ్మగా ఈయనను పురాణం కీర్తించింది. 'దేవీతత్వ' స్వరూపం- గణపతి అని పురాణ భావం. మూషికాన్ని వాహనంగా కలిగిన స్వామి.
6. వికటావతారం: 'కామా'సురుని సంహరించిన స్వరూపమిది. మయూర వాహనంపై ఉన్న స్వామి ఇతడు. 'సూర్యబ్రహ్మ'గా సౌరతత్వంగా పూజలందుకుంటున్నాడు.
7. విఘ్నరాజావతారం: ఆదిశేషుని వాహనంగా స్వీకరించిన గణేశమూర్తి ఇది. 'మమతా'సురుని సంహరించిన ఈ స్వరూపాన్ని 'విష్ణుబ్రహ్మ'గా విష్ణుతత్వంగా చెబుతారు.
8. ధూమ్రవర్ణావతారం: 'అభిమానాసురు'ని సంహరించిన ఈ అవతారం మూషిక వాహనంపై శోభిల్లుతున్నది. 'శివ'రూపంగా అర్చించతగిన శైవతత్వమూర్తి ఇది. -
ఈ ఎనిమిది అవతారాల వైనాలను గమనించితే ఒక చక్కని సమన్వయం తేటపడుతుంది.
1. శరీరంలోనూ, 2. జీవభావంలోనూ, 3. బుద్ధిశక్తిలోనూ, 4. బ్రహ్మజ్ఞానంలోనూ భాసించే భగవచ్ఛైతన్యం మొదటి నాలుగు అవతారాలు. 5. శక్తి, 6. సూర్య 7. విష్ణు, 8. శివ తత్వాలు ఒకే భగవంతుడి వ్యక్తస్వరూపాలు- అనే ఏకత్వం తరవాతి నాలుగు అవతారాలు. పై ఎనిమిది రూపాలున్న గణేశుని ఆరాధించితే మనలో ఉన్న దుర్గుణాలు తొలగిపోతాయంటారు.
అవి: మాత్సర్యం, మదం, మోహం, లోభం, క్రోధం, కామం, మమత ('నాది' అనే రాగం), అభిమానం (అహంకారం)- ఈ ఎనిమిది రకాల రాక్షసులే విఘ్నశక్తులు.
వ్యక్తి పురోగతికి ఇవే విఘ్నాలు. ఈ అసురగుణాలను ఈశ్వరారాధన ద్వారా తొలగించుకోగలిగితే- అదే ఆరాధన, అర్చన, సాధన. వీటిని నశింపజేసే దైవబలాన్ని మనలో జాగృతపరచేందుకే వినాయకపూజ. పూజలో పరమార్థం- మానవుడు దివ్యత్వ స్థితికి పరిణమించడమే. భగవద్రూప, నామ, అవతార ఘట్టాల్లో
ఋషులు చూసి, చూపించిన దివ్యభావాలివి.
(సేకరణ )
శ్రీ రాధా లక్ష్మి