విఘ్నేశ్వరుని అవతారం వైభవం
గణపతి వైభవం:- 2
విఘ్నేశ్వరుని అవతారం వైభవం/విశిష్టత:
వినాయకుడంటే భౌతికంగా మనకి కనిపించే ఆకారం మాత్రమే కాదు. ఆయన రూపు, స్వభావం వెనుక లోతైన అర్థం ఉందని వేదాంతులు, శాస్త్రాలు చెబుతుంటాయి. గణేశుని ఆరాధనతో ఈ సంసారం నుంచి సులభంగా విముక్తి పొందవచ్చని సూచిస్తుంటారు. అందుకే గణేశుడే ప్రముఖంగా ఆరాధించబడే గణాధిపత్యం అనే శాఖ కూడా ఉంది. వినాయకుని ఆరాధనలో ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేందుకు ఓ గొప్ప ఉదాహరణ ఆయన అవతారాలు. ముద్గల పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు. వాటి గురించి ఈ రోజు "గణపతి వైభవం" లో తెలుసుకుందాం.
వక్రతుండుడు :-
పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలావిలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం.
ఏకదంతుడు :–
చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి, దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు... ఇక మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులుతీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’ని గా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యవత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా!
మహోదరుడు :–
శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనే లేదయ్యే! దాంతో పార్వతి కంగారుపడిపోయింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంది. ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చింది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది. ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు "మహోదరునిగా" అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు, విశాలమైన దృక్పథానికి సూచనగా మహోదరుడు నిలుస్తారు.
గజాననుడు :–
కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాక తప్పవు. ఇతే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం.
లంబోదరుడు:-
దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు, విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజరూపంలోకి వచ్చాడో... శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జనించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు, ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన (ప్రీతి) దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం.
వికటుడు:-
పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది.
విఘ్నరాజు:-
కామ, క్రోధ, మోహ, లోబ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి.
ధూమ్రవర్ణుడు :-
అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం.
కంటిన్యూ...Nxt Post
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః
- L. రాజేశ్వర్