Online Puja Services

సంకష్టహర చతుర్థి

3.16.91.85

సంకష్టహర చతుర్థి

సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి!

పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఆ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట. పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.

ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని *అంగరక చతుర్థి* అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం, ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరునని ప్రతీతి. 

కొంతమంది ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా చేస్తారు. దాని కోసం వినాయకుడి ముందు తెలుపు లేదా ఎర్రటి జాకెట్‌ గుడ్డని పరిచి, అందులో పసుపుకుంకుమలు వేయాలి. మనసులో ఉన్న కోరికను తల్చుకుని ఆ గుడ్డలో మూడు గుప్పిళ్లు బియ్యం పోయాలి. ఆపై రెండు ఖర్జారాలు, రెండు వక్కలు, దక్షిణ వేసి మూటకట్టాలి. ఈ ముడుపుని స్వామి ముందు ఉంచి టెంకాయ కొట్టి నైవేద్యం చేసి... సంకటహర చతుర్థి వ్రతకథని చదువుకోవాలి.

ఈ వ్రతాన్ని3,5,11, లేదా 21 నెలల పాటు చేయాలి. ఈ వ్రతాన్ని చివరగా చేసే రోజున ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎలాంటి కోరికైనా తీరిపోతుందంటున్నారు. ఒకవేళ సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ, వ్రతం చేయడం కానీ కుదరకపోయినా ఫర్వాలేదు. ఆ రోజు ఓ నాలుగుసార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లినా కూడా ఆ స్వామి ప్రసన్నం అవుతాడట.

ప్రస్తుత పరిస్థితుల్లో దేవాలయం వెళ్లడం కుదరకపోవచ్చు. కావున ఇంట్లో నుండే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చు.

శ్రీ గణేశాయ నమః

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha