కాళీ మాత సర్వ సౌభాగ్య ప్రదాయిని .
కాళీ మాత సర్వ సౌభాగ్య ప్రదాయిని .
- లక్ష్మి రమణ
కాళీ - ఈమాట వినగానే ఒక నల్లని, నీల రౌద్ర స్వరూపము మన కనుల ముందర దర్శమిస్తుంది. ఆ రూపాన్ని తలుచుకోగానే నిత్యమూ కొలిచే భక్తులకి అమ్మల గన్న అమ్మ దర్శనమిస్తుంది. అధర్మపరులకి దుష్టశిక్షణ చేసే మహా కాళీ గుర్తుకువస్తుంది. ఆ కాళీ స్వరూపమే ఒక అద్భుతమైనది. ఆమె స్వరూపంలో దాగిఉన్న సత్యాలేమిటి ? ఎందుకు ఆ దేవదేవి మాతృ స్వరూపమైన అంతటి భీకరంగా కనిపిస్తుంది ? ఈ వసంత నవరాత్రుల్లో ఆ దేవదేవిని గురించి తెలుసుకుందాం రండి .
కాళీ మాత కాలస్వరూపిణి. ఆ కాలము ఇప్పుడున్న విభజన పొందిన కాలము కాదు. ఈ విశ్వ సృష్టికి పూర్వము ఉన్న కాలము. ఏ విభజనా లేని అనంత కాలశక్తి. అందుకే కాళీ అనంత శక్తి స్వరూపము. విభజన చెందని కాలములో ఏది ప్రస్తుతం, ఏది గతం , ఏది భవిష్యత్తు? అక్కడ కాలము గమనంలో ఉంది అనాలా ? లేదూ అనాలా ? ఏదీలేని నిరాకార నిర్వికార శూన్యం. ఇది కాదా పరమాత్మ స్వరూపం .
మన సౌలభ్యం కోసం ఈ సృష్టికి ఆ దివ్యశక్తిని అమ్మగా భావిస్తే, ఆమె కాళీ అయ్యింది. నాన్నగా భావన చేస్తే, ఆయన కాలుడు అయ్యారు. అంతకన్నా వారిద్దరికీ భేదం లేనేలేదు. అమ్మ స్వరూపంలో రౌద్రం సృష్టి మాతృ స్వరూపం కాళీ మాతే. ఆమె పరమ ప్రక్రుతి . ఈ మాట అనుకున్నప్పుడు విరిసినపూలు, చిగురించిన చెట్లు, దూకే జలపాతాలు, అందమైన పక్షులు , జంతువులూ ఇలా ప్రకృతిలోని రమణీయత మనకి గుర్తుకొస్తుంది. ఆ రమణీయత కాళీ అమ్మవారి రూపంలో కనిపించదు . ఆమె పరమాప్రకృతి ఎలా అయ్యింది ? అదే అమ్మవారి రూపవిలాసంలో ఉన్న విశేషం .
అమ్మవారి నేత్రాలు సూర్య, చంద్రులు, అగ్ని. అగ్ని నుండే సృష్టి మొదలయ్యింది అని వేదాలు చెబుతున్నాయికదా ! ఆ అగ్నిని ధరించినది విశ్వేశ్వరి. సృష్టి తననుండి మొదలయ్యింది అని చెప్పడానికి చేతులని తన అంగవస్త్రంగా అమ్మతనాన్ని నిండుగా కప్పుతూ ధరించింది. తన భారమైన పాలిండ్లు సృష్టిని పోషించే అమ్మతనాన్ని తెలియజేస్తుంది.
ఇందులో విశృంఖలత్వం కనిపిస్తే, అది చూసేవారి చూపులకున్న దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు . అమ్మవారు అని కాళిని సంబోధిస్తున్నాం . ఆ అమ్మే ఆమెలో కనిపించాలి . అర్థం చేసుకున్న వారికి ఆమె అమ్మ అని ఆ రామకృష్ణుడు నిరూపించలేదా ! కాబట్టి కాళీ తత్త్వం అర్థం చేసుకోవడం చాలా అవసరం . సమ్మోహనమైన ఆ కాలతత్వాన్ని అర్థం చేసుకొని ఆమెని చేరుకోగలిగితే , దివ్యమైన జ్ఞానం సిద్ధిస్తుంది . అమ్మ మానని తన చేతులతో కాలం నుండీ తప్పించి తనలో లయం చేసుకుంటుంది . నిజంగా కోరుకోవలసింది , ఏ కోరికా లేకుండా చేరుకోవాల్సినది అయిన గమ్యం అదే కదా !
శుభం