నరసింహుడు తెలుగు నేలపైన ఎందుకు అంత ప్రసిద్ధి?
నరసింహుడు తెలుగు నేలపైన ఎందుకు అంత సుప్రసిద్ధుడయ్యారు ?
-లక్ష్మీరమణ
తెలుగునేలమీద యాదగిరి , నర్సింహ అని పిలుస్తే, ‘ఓయని’ వేలగొంతుకలు పలుకుతాయి. ఇందుకు తెలుగు నేలపైన ఉన్న అనేక నారసింహకేత్రాలు కావొచ్చు . కానీ ఆ నారసింహక్షేత్రాల వైభవం మాత్రం ఇప్పటికంటే ఎన్నో రేట్లు ఎక్కువ. బౌద్ధం , జైనం ప్రబలంగా ఉన్న సమయంలో కూడా నారసింహునికి ఆదరణ తగ్గలేదు . ఆయనమీద ప్రజలకి విశ్వాసం వీసమెత్తయినా కరగలేదు . ఆ వైభవోపేతమైన విశేషాలతోపాటు నరసింహుని వైభవవ్యాప్తికి కారణమైన వివరాలుకూడా ఇక్కడ చెప్పుకుందాం .
తెలుగు నేలని అత్యంత పురాతన వంశాలుగా భావించే శాతవాహనులు, ఇక్ష్వాకులు పరిపాలించారు . పురాణాలూ, ఇతిహాసాలలో పేర్కొన్న ఎన్నో ఆలయాలు, సంస్కృతులకు నిలయంగా ఉంది ఈ ప్రాంతం .ఆంధ్ర , తెలంగాణా రెండు ప్రాంతాలలోనూ నారసింహుని ఆరాధన గొప్పన్నే జరిగింది . ఇప్పటికీ జరుగుతోంది కూడా ! అయితే, ప్రత్యేకించి తెలంగాణా ప్రాంతంలో బౌద్ధం, జైనం,శైవం, వైష్ణవంలతో పాటు ప్రకృతి ఆరాధకులుగా శాక్తేయ దేవతలను, గ్రామ దేవతలను కూడా సమాన స్థాయిలో ఆరాధించారు. ఈ క్రమంలో నరసింహ తత్వాన్ని ఆదరించడం, ఆరాధించడం కూడా జరిగింది .
.
ప్రస్తుత తెలంగాణా రాష్ట్రంలో 11వ శతాబ్దకాలం నుండే నారసింహ ఆలయాలున్నాయి. 17వ శతాబడం వరకూ ప్రజలు పెద్దఎత్తున ఇక్కడ నారసింహుని ఆదరించారు . ఈ నారసింహ క్షేత్రాల గురించి పురాణాలలోనూ ప్రస్తావన కన్పిస్తుంది. ఒక్క తెలంగాణాలోనే పురాతనమైనవిగా భావించే 176 నారసింహ క్షేత్రాలున్నాయంటే, ఈ తెలుగు గడ్డలో నారసింహ తత్వానికి ఆదరణ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు .
వాయుపురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, మత్స్య, హరివంశ, కూర్మ పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణంలతో పాటు మరికొన్ని ప్రాచీన పురాణాలలో నారసింహ తత్వ ప్రస్తావన కనిపిస్తుంది .ఈ కారణాలన్నిటితోపాటు , నారసింహుని దివ్యశక్తి వలన తగ్గే జబ్బులు ప్రజల్లో ఆ స్వామి మీద భక్తిని తగ్గకుండా చేశాయి ఆనందంలో సందేహంలేదు. ఇప్పటికీ ఆ సత్యం నారసింహుని నమ్మినవారికి అనుభవమే . దీర్ఘకాలికవ్యాధులు , పరిష్కారం దొరకని శతృ పీడలు , తగాదాలు, సంతానలేమి వంటి సమస్యలకి నారసింహుని శరణువేడడం కన్నా , మరో సులువైన మార్గం లేనేలేదు .
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నృసింహాలయాలుగా పేర్కొనే వాటిలో ప్రధానంగా ..నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, మట్టపల్లి, అర్వపల్లి, వాడపల్లి, కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి, వరంగల్ జిల్లాలోని కొడవటంచ, మల్లూరు, నిజామాబాద్ జిల్లాలోని భీంగల్, చుక్కిపురలున్నాయి. వీటిల్లో కొలువైన క్షేత్రమని నారసింహుడే యాదగిరి గుట్టని గురించి చెప్పినట్టు , శ్రీశైల మల్లికార్జనుడు ఆ స్వామికి నమస్కరించినట్టు పురాణాలు చెబుతున్నాయి .
తెలంగాణలో అత్యంత పురాతన నారసింహ ఆలయంగా నల్లగొండ జిల్లాలోని వాడపల్లి లోఉన్న నరసింహా ఆలయాన్ని భావిస్తారు. ఇది, 7వ శతాబ్దంలో నిర్మించారని శాసనం ద్వారా స్పష్టమవుతోంది.. ఇక్కడి ఆలయంలోని స్తంభంపై కన్నడ, ప్రాకృత లిపిలో ఉన్న శాసనం అనుసరించి ఈ ఆలయం తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన నారసింహాలయం అని భావిస్తున్నారు.
ఆలంపూర్‌లోని శివబ్రహ్మ ఆలయంలోని దక్షిణ భాగంలోని కుడ్యాలపై నరసింహ, హిరణ్యాక్ష శిల్పాలున్నాయి. 7-8 శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 10వ శతాబ్దం ప్రథమాబ్దములో ధర్మపురిలో లక్ష్మి, నరసింహాలయాన్ని నిర్మించారు.
వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు గుట్టల్లో ఉన్న మల్లూరు నరసింహ స్వామి ఆలయానికి ప్రత్యేకత ఉంది. దట్టమైన అడవుల మధ్య గుట్టపై నిలువెత్తు విగ్రహముంది. తల సింహంలాగా, శరీరం మానవాకృతి మాదిరిగా ఉంటుంది. ఉగ్రరూపంలో ఉన్న ఈ మల్లూరు విగ్రహం బొడ్డు సమీపంలో మెత్తగా ఉంటుంది.
మల్లూరు నరసింహ స్వామిని దేశంలోనే అరుదైనదిగా భావిస్తారు. ఈ స్వామిని తాకితే మనిషిని తాకిన అనుభూతి కలుగుతుంది . ఆ మూర్తికి రోమాలుంటాయి . స్వయంభువుగా స్వామి ప్రకటితమయ్యారు . భూమిలో నుండీ ఆయనని బయటికి తీసేప్పుడు తగిలిన గునపం పోతూ నుండీ నేటికీ చీము కారుతుండడం విశేషం . దానినే పిల్లల కోసం తల్లడిల్లేవారికి ప్రసాదంగా ఇస్తారు . దానివల్ల బిడ్డలు కలుగుతారని విశ్వాసం .
దేశంలో తొలినాళ్లలో జీవన విధానాన్ని ప్రభావితం చేయడంలో మతం కీలక పాత్ర వహించింది. అనేక, మతాలున్నప్పటికీ, నారసింహ తత్వం ప్రాధాన్యం పొందింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నారసింహ క్షేత్రాలున్నప్పటికీ ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 35 నారసింహ క్షేత్రాలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని నరసింహులు పల్లెలో పంచ ముఖ నరసింహ స్వామి విగ్రహం ఒక పెద్ద రాతిపై చెక్కి ఉంది. 16 చేతులు గలిగిన ఈ విగ్రహం లాంటిది మరెక్కడా లేకపోవడం విశేషంగా చెప్పవచ్చు.
ఏదిఏమైనా , సులభసాధ్యుడైన నారసింహుడు , మహావైద్యునిగా రోగాలని నయం చేసి , భక్తుల కోరినకోర్కెలు తీర్చే కొంగుబంగారంగా ఉండడం వలనే ఆయనకి తెలుగు నేలపై ఇంతటి ప్రాచురం లభించిందని అంటారు సనాతనవాదులు .