మంగళగిరి పానకాల స్వామి నరసింహుడు
ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం
భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్
శ్రీ నరసింహుడు సద్యోజాతుడు. అంటే భక్త రక్షణార్ధం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటివారు తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరాన వెలసిన ఐదు క్షేత్రాలను పంచ నారసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు..ఈ ఐదు క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.
అవి
1. మంగళగిరి ,, పానకాలయ్య
2. వేదాద్రి .. స్నానాలయ్య
3. మట్టపల్లి ,, అన్నాలయ్య
4. వాడపల్లి .. దీపాలయ్య
5. కేతవరము .. వజ్రాలయ్య
మంగళగిరి అనగానే గుర్తుకొచ్చేవి పానకాల స్వామి, గాలి గోపురం, చేనేత వస్త్రాలు (మంగళగిరి చేనేత వస్త్రాలు - ముందుగా ఆలయ చరిత్ర తెలుసుకుందాము.
స్ధల పురాణం
మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం.
హిరణ్యకశిపుని వధానంతరం శ్రీ నరసింహస్వామి చాలా భయంకర రూపంతో, రౌద్రంగా, అందరికీ భీతికొల్పుతూ వున్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్ధించినా ఫలితం కనబడలేదు. శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతము సమర్పించినది. దానిని గ్రహించి స్వామి శాంత స్వరూపులైనారు. ఈయనే మంగళాద్రిపై వెలసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామి. ఈయనకి భక్తులు కృత యుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.
పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారిగారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంక పానకం పోయటం ఆపి, మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించక పోవటం విశేషం.
సర్వ మంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది.
- సూర్యప్రకాష్ సాధనాల