శ్రీ వ్యాఘ్రలక్ష్మినరసింహస్వామి దేవాలయం, ఆగిరిపల్లి
శ్రీ వ్యాఘ్రలక్ష్మినరసింహస్వామి దేవాలయం, ఆగిరిపల్లి
దేవాలయం దర్శనవేళలు : 8:00 am - 11:30 am, 5:00 pm - 7:00 pm
దక్షిణాన హిందూ దేవాలయాల్లో ప్రసిద్ధిగాంచినది ఆగిరిపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి. ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ - నూజివీడు మధ్యన కలదు. ఇదొక ప్రాచీన దివ్య క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులు ఆధ్యాత్మికానికి లోనవుతూ పరవశించిపోతారు. దీనికి శివ కేశవుల క్షేత్రం అనే పేరుకూడా ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం తో పాటు పరమశివుని గుడి కూడా ఉన్నది.
శివరాత్రి పర్వదినం అక్కడ వైభవంగా జరుపుతారు. రాత్రుళ్ళు భక్తులు గుడి ప్రాంగణంలో జాగరణ చేస్తారు. ప్రస్తుతం ఈ గ్రామం సి ఆర్ డి ఏ పరిధిలోకి వెళ్ళింది.
ఆగిరిపల్లి లో ప్రధానంగా చెప్పుకోవలసినవి దేవాలయాలు. ఇక్కడ శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహ స్వామి గుడి, శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ముక్తేశ్వరస్వామి వారి ఆలయం ముఖ్యమైనవి, చూడవలసినవి. వీటితో పాటు దుగ్గిరాల రావమ్మ తల్లి తిరునాళ్ళ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, కోదండరామ స్వామి ఆలయం తో పాటు చర్చి మరియు ఇతర ధార్మిక మత కేంద్రాలను చూడవచ్చు.
కోరినకోర్కెలను తీర్చే దేవదేవునిగా శ్రీ శోభనాచలపతి స్వామి వారికి పేరున్నది. మాఘమాసంలో ఇక్కడి పుష్కరిణి లో స్నానమాచరించి శోభనాచలపతి స్వామిని దర్శించుకోవటానికి భక్తులు తహతహలాడుతుంటారు. మొన్న జరిగిన రథసప్తమి నాడు కూడా అసంఖ్యాక భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి నాడు విశేష రీతిలో జాతర, రథోత్సవం జరుపుతారు. ప్రతిఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని అంచనా. ఏటా కార్తీక మాసంలో ఊరి కొండ మెట్ల మీద దీపాలంకరణ (నెయ్యి) కనులవిందుగా ఉంటుంది. ఈ ఆలయం నూజివీడు జమీందార్లచే నిర్మించబడింది.
జమీందార్లు ఆగిరిపల్లి గ్రామం మధ్యలో ఒక కళ్యాణ మంటపాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ విశాల మంటపంలో కళ్యాణోత్సవాలు జరుపుతారు. ఇటువంటి కళ్యాణ మంటపాలు గ్రామములో మరో మూడు, నాలుగు ఉన్నాయి. పెద్దదైన మంటపాన్ని 'కోట' అంటారు. వీటిలో ఆయా పర్వదినాల్లో స్వామి వారి ఉత్సవాలు కనులపండుగగా జరుగుతాయి. ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి ప్రజలు ఎద్దులబండ్లు, ట్రాక్టర్లు వేసుకొని వచ్చి మరీ చూసి వెళతారు. జాతరలో పాల్గొంటారు.
ఈ ఆలయం స్థానిక మెట్లకోనేరు వద్ద ఉన్నది. దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వసంత నవరాత్రుల కార్యక్రమం వైభవంగా జరుపుతారు. ఈ గ్రామము లోనే ప్రతి ఏటా మాఘమాసంలో జరిగే దుగ్గిరాల రావమ్మ తల్లి తిరునాళ్ళ చూడటానికి స్థానికులు, చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు.
వసతి : ఆగిరిపల్లి లో వసతి సదుపాయాలు లేవు. కనుక పర్యాటకులు దగ్గరలోని విజయవాడ లో వసతిని పొందవచ్చు. ఇక్కడ అన్ని తరగతుల వారికి గదులు దొరుకుతాయి. విజయవాడ హోటళ్ళ వివరాక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా చేరుకోవాలి ? ఆగిరిపల్లి సమీపాన గన్నవరం దేశీయ విమానాశ్రయం, అలాగే విజయవాడ రైల్వే స్టేషన్ లు కలవు. విజయవాడ నుండి ప్రతిరోజూ మెట్రో బస్సులు ఆగిరిపల్లి కి తిరుగుతాయి. ఆగిరిపల్లి ఎక్కడి నుండి ఎంత దూరం : నూజివీడు నుండి రోడ్డు మార్గం : 12 కి.మీ., గన్నవరం నుండి రోడ్డు మార్గం : 17 కి.మీ., హనుమాన్ జంక్షన్ రోడ్డు నుండి 20 కి.మీ.
సర్వేజనా సుఖినోభవంతు
- రామకృష్ణంరాజు గాదిరాజు