Online Puja Services

బుద్ధి, సిద్ధి కావాలంటే వసంత పంచమి పూజ చేయాలి

18.223.210.249

బుద్ధి, సిద్ధి కావాలంటే వసంత పంచమి పూజ చేయాలి  
- లక్ష్మి రమణ 
 
వాక్కు సరస్వతీ స్వరూపం . తల్లి గర్భం లో నుండీ బయటికి వచ్చాక క్యార్ మని కేక వేయడం కూడా సరస్వతీ వరప్రసాదమే. అప్పటి నుండీ చిట్ట చివరి క్షణంలో ఈ జీవుడు అంతర్యామిలో సంలీనమయ్యే వరకూ ఆ జ్ఞానాంబికా అనుగ్రహం మనకి అడుగడుగునా అవసరమే ! ఆ అమ్మవారి అనుగ్రహానికి మనలని చేరువ చేసే దివ్యమైన పర్వదినం మాఘమాస శుక్ల పంచమి. దీనికే శ్రీ పంచమి అని వాగీశ్వర జయంతి అని, వసంత పంచమి అనీ పేరు .   

సరస్వతీ దేవి విద్యకు, బుద్ధికి, జ్ఞానానికి, వాక్కుకు అధిష్ఠాన దేవత. శారదాదేవి మూల స్థానం ‘శశాంక సదనం’  అంటే అమృతమయమైన ప్రకాశ పుంజమే సరస్వతీ దేవి మూలస్థానము.  అక్కడ నుండే ఉపాసకులకు నిరంతరం వర్ణమాలా క్రమంలో, అక్షర సమూహంతో జ్ఞానామృతం ప్రవహిస్తుంది. ఆమే శబ్ద బ్రహ్మ రూపంలో స్తుతింపబడుతుంది.

సృష్టి ప్రారంభ సమయంలో పరమాత్మ తన ఇచ్ఛచేత ఆద్యాశక్తిని తనకు తానే ఐదు భాగాలుగా విభజించారు. అలా పరమాత్మ విభిన్న అంగాల నుండి ఐదు మంది దేవతలు ప్రకటితమయ్యారు. వారు రాధాదేవి, పద్మ , సావిత్రి, దుర్గ, సరస్వతి. ఆ సమయంలో పరమాత్మ కంఠం నుండి ఉద్భవించిన దేవి సరస్వతి గా బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది . 

సరస్వతీదేవి తెల్లని వర్ణం కలిగి, వీణా పుస్తకధారిణిగా, తెల్లని  కమలంలో కూర్చుని, శ్వేత హంసవాహినిగా దర్శనం ఇస్తుంది .  ఈ తెల్లని వర్ణం సత్వగుణానికి సంకేతం . సత్వ గుణ సంపన్నురాలు సరస్వతీ మాత. మన మాట, పలుకు సరస్వతీదేవి స్వరూపమే. అందుకే ఈ దేవిని ‘పలుకులమ్మ’ అంటారు.
 
ఈ పలుకులమ్మ పుట్టిన రోజు వసంత పంచమి. ఈ నాడు వాగ్దేవతను విధిగా ప్రతి ఒక్కరూ పూజించాలి. బుద్ధినిచ్చే దేవికదా !  ఆ దేవి ప్రసన్నంగా ఉంటె, బుద్ధి, తద్వారా సిద్ధి లభిస్తాయి . ఈ రెండూ ఉంటె ఏకార్యమైనా, ఏ లక్ష్యమైన సిద్ధించినట్టే కదా !  కాబట్టి ఈ వసంత పంచమి నాడు జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన అమ్మని సరస్వతిగా ఆరాధించి , బుద్ధి సిద్ధి పొందుదాం . అంతరాత్మ ప్రకాశంలో పరమాత్మ సన్నిధిని దర్శిద్దాం .  

శుభం !!

#vasantapanchami

Tags: vasanta panchami, saraswati

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi