శ్యామలా నవరాత్రుల్లో ఏరోజు ఏరూపంలో అమ్మని కొలుచుకోవాలి ?
శ్యామలా నవరాత్రుల్లో ఏరోజు ఏరూపంలో అమ్మని కొలుచుకోవాలి ?
- లక్ష్మీరమణ
దేవీ నవరాత్రులు అమ్మ కరుణా కటాక్షాలని అందించే దివ్యమైన సమయం . అమ్మ కరుణాతరంగిణే! ఎప్పుడు పూజించినా ఆ కరుణా కటాక్షాలకి లోటేమీ లేదు. అయితే, ఈ దివ్యమైన నవరాత్రీ పర్వంలో ఆ దేవదేవిని ఆరాధించడం మరింత విశేషమైన ఫలితాలని అనుగ్రహిస్తుంటుంది . ఈ పర్వం ఏడాదిలో నాలుగు సార్లు వస్తుంది . వీటినే ప్రత్యక్ష నవరాత్రి, గుప్త నవరాత్త్రి అని వ్యవహరిస్తారు . మాఘమాసంలో మనం జరుపుకోబోతున్న నవరాత్రులకి మాతంగీ నవరాత్రులని పేరు .
శ్యామల సరస్వతీ రూపం, జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిణి అంటారు. అమ్మవారికి శ్యామలా దేవి మంత్రిగా వారాహి మాత సేనాధిపతిగా ఉంటారు. శ్యామల ఉపాసన అనేది దశ మహా విద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి, రాజమాతంగి, రాజ్యశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలలో ప్రధానంగా శ్రీవిద్యను పాసిస్తే, తరువాత అంత ప్రసిద్ధంగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన.
ఈ ఉపాసన వామాచారం దక్షిణాచారం రెండు పద్ధతుల్లోనూ ఉంటుంది. ఈ పది విద్యలలో ఏ శక్తిని ఉపాసించిన మిగతా తొమ్మిది విద్యలు అందులో కలిసి ఉంటాయి. కాబట్టి దశ మహా విద్యలలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలినవన్నీ ఇంటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది. త్వరగా సిద్ధిస్తుంది అయితే ఈ దశ మహా విద్యలలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు శంకరులు వ్యాప్తిలోకి తీసుకొచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వాన్ని గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామల నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు.
శ్యామల నవరాత్రుల్లో మొదటి రోజున శ్యామలాదేవిని లఘు శ్యామలాదేవిగా, రెండవ రోజు వాగ్వాదిని శ్యామలాదేవిగా, మూడవరోజు నకుల శ్యామలాదేవిగా, నాల్గవ రోజు హసంతి శ్యామలాదేవిగా, ఐదవరోజు సర్వసిద్ధి మాతంగి దేవిగా, ఆరవ రోజు వాస్య మాతంగి దేవిగా , ఏడవ రోజు సారిక శ్యామలాదేవిగా, ఎనిమిదవ రోజు సుఖ శ్యామలాదేవిగ, తొమ్మిదవ రోజు రాజమాతంగి దేవిగా ఇంకా రాజశ్యామలాదేవిగా ఆరాధిస్తారు .
గుప్త నవరాత్రి ప్రయోజనాలు
శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ దేవి మంత్రిణి శక్తి అయిన శ్రీ శ్యామలాదేవిని శాంత పరచడానికి, మాఘమాసంలో నవరాత్రి లేదా గుప్త నవరాత్రిని జరుపుకుంటారు. దేవి తన భక్తులకు శ్రేయస్సు, ఆరోగ్యము, సంపద, ఆనందం, జ్ఞానం ఇంకా సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది.
ఈ నవరాత్రులలో ప్రతిరోజు ప్రత్యేకమైన ఆచారాలతో విశేష మంత్రాలను ఉపాశించడం వల్ల దేవతా అనుగ్రహం అతి తొందరగా ఆ ఉపాసకునికి లభిస్తుంది. అంతేకాకుండా, ఆ ఉపాసకుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గ్రామంలో ఉండే ఆస్తికులైన ప్రజలందరూ కూడా దుఃఖం నుంచి విముక్తులవుతారు. గుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను, ఆందోళనలను తగ్గిస్తుంది. భక్తులు గొప్ప విశ్వాసాన్ని పొందుతారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్య లో రాణింపు ఉంటుంది. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధిని పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధంగా చేస్తారు.
శుభం !!
#syamalanavaratri
Tags: shyamala, syamala navaratri, syamala, navratri