Online Puja Services

మాతంగ కన్యని ప్రార్ధించడం వలన

18.117.123.49

మాతంగ కన్యని ప్రార్ధించడం వలన సాహిత్యం , చదువు , తెలివి, జ్ఞానం ప్రాప్తిస్తాయి.
-లక్ష్మీ రమణ  

మాతంగ మాత వీణాపాణి .  శ్యామలా రూపంగా, సరస్వతీ స్వరూపమై  అనుగ్రహించే ఈ దేవి బ్రహ్మగారి పక్కనుండే ఆయన అర్థాంగి కాదు . ఈ మాతంగ కన్య అమ్మవారి శక్తి .  దశమహావిద్యల్లో ఒక స్వరూపం . మాతంగియే రాజ శ్యామల, లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లి ఈ శ్యామల. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధిస్తాయి .

తంత్రసారం మాతంగి మాతని నీలిరంగులో (శ్యామల వర్ణంలో ) ఉన్నట్టుగా వివరిస్తుంది . శ్యామల వర్ణం అనేది పూర్ణమైన జ్ఞానానికి ప్రతీక . శివశక్తి - జ్ఞానాంబిక గ , విష్ణుస్వరూపము - రాముడు, కృష్ణుడు ,వేంకటేశ్వరుడు ఇలా ఆ విష్ణు స్వరూపాలన్నీ కూడా ఇదే వర్ణం లో ఉండడము ఇక్కడ గమనించదగిన విషయము. ఇంకా ఆమె చంద్రవంకని శిరస్సున ధరించి , త్రినేత్రాలతో, చక్కని వెన్నెల వంటి నవ్వుతో విరాజిల్లే తల్లి ఈ మాతంగ మాత .  64 కళలకూ అధినేత్రి ఆమె . శారదాతిలకం అమ్మ రాజమాతంగి కూడా సరస్వతీ దేవిలాగానే వీణని చేతిలో ధరించి ఉంటుంది . కానీ ఈమెని మాతంగ శివుని భార్యగా కాళిదాసుని శ్యామలదండకం వర్ణిస్తుంది .

మాణిక్యవీణాం. ముఫలాలయంతీం
మదాలసాం మంజులవాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్
మాతంగకన్యామ్ మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే.
కుచోన్నతే కుంకుమరాగశోణే.
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే
నమస్తే... నమస్తే... నమస్తే...
జగదేకమాతః 

ఈ అమ్మని కన్నులారా దర్శించుకొని, ఆ దేవీ స్వరూపాన్ని మనసు నిండా నిలుపుకొని , ఈ శ్యామలా దండకాన్ని రోజూ చదువుకుంటే, ఆ అమ్మ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది . పిల్లలకి ఈ దండకాన్ని నేర్పించి రోజూ చదువుకునేలా చేస్తే, వారు అమ్మ అనుగ్రహంతో మంచి విజ్ఞానవంతులవుతారు . కాళిదాసు కూడా అలా విజ్ఞానవంతులైనవారే కదా ! 
 
ఈ దేవి మాతంగ మాతగా ఆవిర్భవించడం వెనుక ఒక కథ ఉంది . మహా తపస్సంపన్నుడు , విజ్ఞానఘని అయిన మతంగ మహర్షి కుమార్తెగా ఆ గౌరమ్మ ఆవిర్భవించింది.  అందువలన ఆమె మాతంగ కన్యగా , మాతంగ మాతగా పేరొందింది . 

మాతంగ మహర్షి  వారు హిమవంతునికి స్నేహితుడు. ఒకనాడు హిమవంతుడు, ఆయన గౌరి దేవికి తండ్రిని అని , ఎంతో గర్వంగా , అతిశయంతో చెప్తారు. ఈ మాటకి అవమానపడినట్లుగా భావించిన , మతంగ మహర్షి తపస్సు చేస్తారు. ఆయన లలితాపరాభట్టారికా స్వరూపమైన శ్యామలాదేవి (ముద్రిణీ దేవి, మంత్రిణీదేవి అని కూడా అంటారు) ని ఉద్దేశించి తపస్సు చేశారు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్యామలాదేవి, మతంగ మహర్షి భార్య అయిన సిద్ధమతి దేవికి స్వప్నంలో కనిపించి ఒక పువ్వుని ప్రసాదంగా ఇస్తారు.

అనతి కాలంలోనే మతంగ మహర్షి, సిద్ధమతిదేవి లకి ఒక చక్కని ఆడపిల్ల జన్మించినది. ఆ వచ్చినది అమ్మవారే. ఆమెని లఘుశ్యామ అని పిలిచారు. అంటే చాలా తక్కువ సమయంలో జన్మించింది అని. ఆమెనే మాతంగి, మాతంగ కన్యకా అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మతంగ కన్యయే, ఆమె యొక్క శక్తితో కోట్ల మంది కన్యలను సృష్టించినది, వారు మంత్రిణీ దేవి యొక్క ప్రాంగణంలో ఉండి అమ్మవారి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే, మాతంగ మాత శ్యామల దేవికి , లలితాదేవికీ భేదము లేదు . 

శుభం . 

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore