Online Puja Services

చైత్రమాసంలో జరుపుకొనే వసంతానవరాత్రుల వైభవం,

18.118.193.28

చైత్రమాసంలో జరుపుకొనే వసంతానవరాత్రుల వైభవం, పూజావిధి. 
- లక్ష్మి రమణ 

సంవత్సరంలో రెండు నవరాత్రులు చెబుతున్నారు . ఒకటి వసంత నవరాత్రులు - చైత్రమాసంలో, రెండవది శరదృతువులో  వచ్చేవి . ఈ రెండు కాలాలూ కూడా దుర్గమమైనవి . అంటే గడ్డుకాలాలు . ఆకాలం నుండీ గట్టెక్కించే తల్లి కనుక దుర్గ అన్నారు . ఇవి కాకుండా శ్రీవిద్యా సంప్రదాయంలో మరో రెండు రకాల నవరాత్రులు కనిపిస్తాయి . మాఘమాస పాడ్యమి నండీ వచ్చే నవరాత్రులు- వీటికి మంత్రిణి శ్యామలా నవరాత్రులని పేరు .  అలాగే ఆషాఢమాసం పాడ్యమి నుడీ వచ్చే నవరాత్రులు - వీటికి వారాహీ నవరాత్రులు అని పేరు . ఈ రెండింటినీ గుప్త నవరాత్రులు అని పిలుస్తారు. ఇప్పుడు వస్తున్నది చైత్రమాస నవరాత్రులు/ వసంత నవరాత్రులు కనుక, ఈ తొమ్మిది రోజులూ అమ్మవారి పూజని చేసుకోవడం శుభాలని ఇస్తుంది. దుర్గమ్మ రాబోతున్న దుర్గమమైన కాలంలో తన అనుగ్రహంతో రక్షించి కాపాడుతుంది .  ఈ తొమ్మిది రోజులూ చేసుకోవలసిన పూజా విశేషాలు ఇలా ఉన్నాయి . 

వసంత నవరాత్రులు శ్రీరామ నవమికి తొమ్మిదిరోజులు ముందుగా మొదలవుతాయి.  ఉగాది కాలానికి ప్రతీకగా జరుపుకునే పండుగ. కాల ప్రతీక కాళిక . ఆ దేవదేవిని  తొమ్మిది రూపాలలో ఆరాధించడం ఈ వసంతానవరాత్రుల్లో మనం చేయవలసిన విధి . దీనివలన జగదాంబ అనుగ్రహం సిద్ధిస్తుంది. మానవాళికి ఈతిబాధలు నుండీ విముక్తి లభిస్తుంది. అతివృష్టి , అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు , అకాలమృత్యువులూ లోకాన్ని బాధించకుండా ఉండేందుకు అనాదిగా మనం ఈ వసంత నవరాత్రులని జరుపుకుంటున్నాం .

నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తూ ఆమెని సర్వశ్య శరణాగతి వేడుకోవడం ఈ వసంత నవరాత్రులలో విశేషం .  దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని ప్రశ్నించినప్పుడు, ఆయన ఆ మహర్షికి వివరించినట్టుగా అమ్మవారి నవరూప వివరణ  మనకి వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా తెలియజేస్తోంది .

ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||

పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||

నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||

  ఈ విధముగానే , తొలిరోజు కలశ స్థాపన చేసుకొని , ఆ తర్వాత అమ్మవారిని  ఈ తొమ్మిది రోజులూ నవరూపాలలో అమ్మవారిని ఆరాధించుకోవాలి . ఆ వరుసక్రమం ఇలా ఉంటుంది . 

శైలపుత్రి:

 శైలపుత్రిని నవరాత్రి పండుగ మొదటి రోజు (ప్రతిపాద) నాడు పూజిస్తారు. పర్వతరాజు కుమార్తె  శైలపుత్రి.  బ్రహ్మ, విష్ణు, శివ శక్తుల సమైక్య స్వరూపమైన పరమేశ్వరి. నవరాత్రులలో మొదటి రోజున శైలపుత్రి అమ్మవారికి స్వచ్ఛమైన నెయ్యి నైవేద్యంగా సమర్పించడం ద్వారా భక్తులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారని పెద్దలు  చెబుతారు.

బ్రహ్మచారిణి దేవి:

రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణీ దేవిగా దర్శనమిస్తారు . ఆమె ఒక చేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో కమండలు పట్టుకుని కనిపిస్తారు. బ్రహ్మచారిణి దేవిని ప్రసన్నం చేసుకోవడానికి చక్కెరను నైవేద్యంగా పెడతారు. సౌందర్య దీప్తితో , జ్ఞానప్రకాశంతో వెలుగొందే అమ్మ ఈ రూపంలో  తన భక్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయువును ప్రసాదిస్తుంది.

చంద్రఘంటా దేవి :

మూడవ రోజు అమ్మ చంద్రఘంట రూపంలో పూజలు అందుకుంటారు. దశ భుజాలతో, నుదుటిపైన చంద్రవంకతో దివ్యమైన అమృతతత్వాన్ని అనుగ్రహించే దేవిగా దర్శనమిస్తారు.  పులిపై స్వారీ చేస్తూ దర్శనమిచ్చే దేవదేవి చెడులను నాశనం చేస్తుంది. సర్వశుభాలనీ అనుగ్రహిస్తుంది. అమ్మవారికి పాయసాన్నన్ని ప్రసాదంగా సమర్పించాలి . 

దేవీ కూష్మాండ : 

నాల్గవ రోజు అమ్మ కూష్మాండ స్వరూపిణి.  ఈ పేరు అమ్మ  విశ్వం యొక్క సృష్టికర్త అని తెలియజేస్తుంది . అమ్మవారు జ్ఞానప్రసాదిని.  నవరాత్రుల సమయంలో ఆమెను పూజించడం వల్ల, నిర్ణయాధికారం మెరుగుపడుతుంది. తీయటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించాలి . 

స్కందమాత:

స్కందమాతను నవరాత్రుల్లోని ఐదవ రోజున పూజిస్తారు. తామరపువ్వుపై ఆశీనురాలైన ఈ దేవతకి నాలుగు భుజాలుంటాయి . ఆమె తన రెండు చేతులలో కమలాలని ధరించి ఉంటారు . కార్తికేయుడు ఆమె ఒడిలో కూర్చుని దర్శనమిస్తారు .  సంతాన ప్రదాయని అయిన ఈ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు అరటిపండ్లు సమర్పించాలి.

కాత్యాయిని దేవి:

నవరాత్రుల ఆరవ రోజున అమ్మవారిని  కాత్యాయిని రూపంలో పూజిస్తారు. అమ్మవారు శక్తి సమన్విత.  జీవితంలోని కష్టాలని తొలగించే శక్తి స్వరూపిణి .  ఆమె అనుగ్రహం వలన శత్రునాశనం సిద్ధిస్తుంది .  ఆమె ఒక చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటారు .  కాత్యాయినీ దేవిని  ప్రసన్నం చేసుకోవడానికి తేనెని నైవేద్యంగా  సమర్పిస్తారు.

కాళరాత్రి:

నవరాత్రులలో ఏడవ రోజు అమ్మని  కాళరాత్రిగా పూజించుకోవాలి . అమ్మవారు చూడడానికి చాలా భయంకరమైన ఆకృతిలో కనిపిస్తారు . కానీ ఈవిడని అర్చించినవారికి కష్టం అనేది దరిచేరదు . అమ్మ అనుగ్రహం చాలా గొప్పగా సర్వ శుభాలనీ అనుగ్రహించేదిగా ఉంటుంది. సమస్త విశ్వమూ ఆమెలోనే ఇమిడి ఉన్నది .  ఈ దేవదేవి అనుగ్రహం కోసం బెల్లం , బెల్లం అన్నం నివేదించాలి . 

మహాగౌరీ దేవి:

నవరాత్రుల ఎనిమిదవ రోజు  మహాగౌరీ దేవిని ఆరాధించాలి . శుద్ధమైన సౌందర్య దీప్తితో అమృతత్వాన్ని ప్రసాదించే దేవదేవి. ఈ అమ్మవారికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించాలి . 

సిద్ధిదాత్రి దేవి:

సిద్ధినిచ్చే మాత. జ్ఞానాన్ని, సంపదని, మోక్షాన్ని సిద్ధింపజేసే మాత. అమ్మవారి ఈ స్వరూపం యెక్క గొప్పదనాన్ని అక్షరాల్లో వివరించలేము . అమ్మ అంతటి అనుగ్రహప్రదాయని . వసంత నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున మా సిద్ధిదాత్రిని పూజిస్తారు. అమ్మవారికి నువ్వులు , నువ్వుల లడ్డూలు , నువ్వుల అన్నం నైవేద్యంగా అర్పించవచ్చు. 

ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించుకోవడం అనంతమైన శుభాలని అనుగ్రహిస్తుంది . ఈ వసంత నవరాత్రులు అందరికీ శుభాన్ని సంతోషాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi