చండీ అనుగ్రహం కోసం సప్తశతిని పారాయణ చేస్తున్నారా ?
చండీ అనుగ్రహం కోసం సప్తశతిని పారాయణ చేస్తున్నారా ?
- లక్ష్మి రమణ
చండీ సప్తసతి చదువుతుంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో క్లుప్తమైన సంకేతాలు లభిస్తాయి . ఆ సంకేతాలు గ్రహించడం అంత తేలికైన విషయం కాదు. వాటిని అనుసరించడమూ తేలికైన విధానము కాదు . వీలైనంతవరకూ ప్రయత్నించాలని సూచిస్తూ , పండితులైనవారు మనకోసం వాటిని విపులంగా అందించారు . వాటిని సేకరించి హితోక్తిని అనుసరించేవారి సౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం .
1. మధు కైటబులు - తీపి, చేదు కలిగిన రుచికి ప్రతీకలు : పొగడ్తలు/ విమర్శలని స్వీకరించి/స్పందించే విధానం లో పరిపక్వత. అలాగే, మంచి రుచి ఉన్న ఆహారాన్ని ఆస్వాదించడం, రుచి లేని పదార్ధాన్ని కూడా నిరసించకుండా స్వీకరించడం.
2. మహిషాసురుడు - దున్నపోతు : కోపం, ఆవేశం, సున్నితత్వం లేకపోవడం వంటి లక్షణాలు కలిగినవాడు . వీటిని సవ్యంగా, సంయమనం తోటి మాత్రమే పొందడం అభ్యాసం చేయాలి . తద్వారా గుణాలని అధిగమించాలి .
3. ధూమ్రలోచనుడు - పొగలు కమ్మిన దృష్టి: అంటే సరైన బుద్ధి లేకపోవడం . బుద్ధికి పొగలు కమ్మితే దూర/లోతైన ద్రుష్టి ఉండదు. మన ఆలోచనా విధానాన్ని సంస్కరించుకోవడం అభ్యాసం చేయాలి .
పై మూడు అహిత శత్రువులు. క్రింది మూడు హిత ( మంచి గా కనబడతాయి) శత్రువులతో కలిగే అడ్డంకులు
1. చండ ముండులు -
చండ : ఇష్టమైన విషయం మీద మన శక్తిని , సమయాన్ని వెచ్చించేసి మిగతావాటిని పట్టించు కోకుండా చేయడం.
అంతర్గత సంఘర్షణ ( ముండుడు ) : నేను తీసుకున్న నిర్ణయం/వెళుతున్న దారి సరైనదేనా, ఇంకోలా చేస్తే సరిగ్గా ఉండేదా అనుకుంటూ సంశయాత్మగా , మనః శాంతి లేకుండా ఉండిపోవడం. అటువంటి సంశయాత్మక స్థితి నుండీ బయటపడే ప్రయత్నం చేసి, పోరి నమ్మకాన్ని అమ్మ పాదాలమీద స్థిరపడేలా చేయాలి .
2. రక్త బీజడు - కోరికలకు ప్రతీక . ఆయనకి ఉన్న వరం తెలుసుగా! ఒక్కొక్క రక్తపు బొట్టు నుండీ తనలాంటి మరో రక్తబీజుడు ఉత్పత్తి అవుతాడు . తీరే ప్రతి కోరిక నుండీ పుంఖాను పుంఖాలుగా కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అంతం లేని వీటిని శక్తిమాత దయతో నిగ్రహించాలి .
3. శుంభ నిశుంభులు - ఇది మంచి, ఇది చెడు. ఇది శుభం, ఇది అశుభం అన్న స్థితిని దాటడం. సర్వం పరమాత్మ స్వరూపమే అనే స్థితికి చేరడం .
ఈ ఆరు దాటిన తరువాత ( షట్ చక్రాలు) ఏడవ చక్రంలో ఉన్న శక్తిని (అమ్మవారిని) చేరుకుంటారు అని ఈ విద్య ఉద్దేశం.