Online Puja Services

విజయవాడ కనకదుర్గమ్మ స్వయంగా అక్కడికి

3.149.25.109

విజయవాడ కనకదుర్గమ్మ స్వయంగా అక్కడికి వచ్చి గాజులు వేయించుకుంది . 
- లక్ష్మి రమణ 

దైవాన్ని శక్తి స్వరూపంగా ఆరాధించేటప్పుడు, ఆవిడని తల్లిగా భావన చేస్తాం. నిత్యసువాసినిగా, పెద్దముత్తయిదవగా భావిస్తాం . ఆ గౌరమ్మకి  పసుపు, కుంకుమ, మాంగళ్యం , నల్లపూసలు, గాజులు, మెట్టెలు ఇలా అమ్మకి మంగళమైన ద్రవ్యాలని సమర్పిస్తాం. అయితే అమ్మవారికి మట్టి గాజులంటే ఏంటో మక్కువట . ఆ విషయాన్ని నిరూపించే సంఘటనని ఇప్పటికీ విజయవాడ వాసులు చెప్పుకుంటూ ఉంటారు . కనకదుర్గమ్మ వెలసిఉన్న ఈ ప్రాంతంలో అమ్మని ప్రత్యక్షంగా చూసినవారి అనుభవాలు వింటూంటే, ఆ తల్లి కృపకి వళ్లు జలదరించాల్సిందే !!

సనాతన సంప్రదాయం చాలా గొప్పది . దాన్ని ఒప్పుకోలేని వారి కుతంత్రాలు, దాడులు  ఈ ధర్మం మీద ఎన్నో జరిగాయి. సనాతనవలంబకుల నమ్మకం మీద దెబ్బకొట్టే ప్రయత్నం బలంగా చేశాయి . ఆలా జరిగిన ప్రతిసారీ తిరిగి తన ఉనికిని, తన ప్రభావాన్ని రెట్టింపు ప్రకాశంతో చాటుతూనే ఉంది . అలా సుల్తానులు ఈ దేశం మీద దాడులు చేసిన కాలమది . 
     
 తన ధర్మాన్ని గౌరవించినట్టే, ఇతర ధర్మాలని కూడా గౌరవంగా చూసే సంస్కారం సనాతన ధర్మం ఇచ్చింది . కానీ కొన్ని ధర్మాలలో ఆ పరమత సహనం ఉండదు . అందునా, సర్కారు వారి నిరంకుశ పాలన, దాడుల నేపధ్యం లో కనకదుర్గమ్మకి కొంత కాలం నిత్యపూజలు ఆగిపోయాయి . 

కుసంస్కారాలు , కుసంప్రదాయాలు వాటి ప్రభని యెంత బలంగా ప్రయోగిస్తాయే అంత త్వరగా వెనక్కి తగ్గాల్సిందే ! కొంత కాలానికి ఆ అరాచక పాలనకు తెర పడింది . అప్పటి వరకూ ఆ అమ్మని మనసులోనే నిలుపుకొని , ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఆవాహన చేసుకొని పూజలు చేసిన పండితులు ఒక చోట చేరారు. ధర్మానుసారణ చాలా క్లిష్టమైనది . వారికి ఒక ధర్మ సందేహం వచ్చింది . అమ్మవారి ఆలయాన్ని తిరిగి ప్రారంభం చేయాలి. కానీ కొన్ని సంవత్సరాలపాటు మూలవిరాట్టుని అర్చించలేదు . కాబట్టి విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్ట చేయాలా ? లేదా సంప్రోక్షణతో ఆలయాన్ని ప్రారంభం చేయవచ్చా అని . 

ఆ సందేహానికి సమాధానం చెప్పగలవారు అమ్మ కృపని  సంపూర్ణంగా పొందిన  శ్రీవిద్యా పూర్ణ దీక్షా దక్షులైన పెదకళ్లేపల్లి వాస్తవ్యులు  శ్రీ విద్యా  శ్రీ ఉమాపతి శాస్త్రి, శ్రీ చలపతిశాస్త్రి గార్లు అని తీర్మానించుకున్నారు . వారి సలహాని అభ్యర్ధించారు . 

మహామంత్రవేత్తలైన ఆ వెలనాటి వైదిక బ్రాహ్మణులు, ''ఇంద్రకీలాద్రి మీద ఉన్నది విగ్రహం కాదయ్యా ! ఆమె స్వయంగా వచ్చి నిలిచిన దుర్గమ్మ . ఆ దేవి స్వయంభువు. ఆవిడని  తిరిగి పునః ప్రతిష్ట చేయాల్సిన అవసరం లేదు. మంత్ర పూర్వకంగా మహా సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది'' అని ధర్మసందేహాన్ని తీర్చి,  వారే స్వయంగా దుర్గమ్మ  ఆలయానికి వచ్చి   సంప్రోక్షణా కార్యక్రమాలు నిర్వహించారు . 

ఈ కార్యక్రమ నిర్వాహణ , అమ్మవారి ఉపాసనా విజయవాడలోని ఆలయంనే ఉంటూ సకుటుంబంగా కొనసాగించాల్సిన అవసరం కలిగింది .  ఒకరోజు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు గాజులు వేయించుకోవడానికి ఇంటింటికీ తిరిగి గాజులమ్మే అతన్ని పిలిచారు . గాజులు వేయించుకున్నారు . గాజులు వేసాక అతను “అయ్యా మొత్తం ఐదుగురు గాజులు తొడిగించుకున్నారు డబ్బులివ్వండని” అడిగాడు . 

అయ్యో ! పొరపాటు పడ్డట్టున్నావు గాజులబ్బీ ! మా ఇంట్లో ఉన్నది నలుగురు ఆడవాళ్ళే  ! అన్నారు శాస్త్రి గారు . కాదు శాస్త్రిగారూ మీతో అబద్ధం ఆడతానా ? వారితో పాటు మరొక చిన్న పాప కూడా వచ్చి గాజులు తొడిగించుకుంది. అని చెప్పాడు . శాస్త్రి గారు ఆశ్చర్యపోయారు . 

ఇంతలో ఇంట్లోని ఆడవాళ్లు “ లేదు మేము నలుగురమే గాజులు తొడిగించుకున్నాం కదా? మరి ఐదుగురెక్కడున్నారు'' అని గాజులమ్మే
వానిని ప్రశ్నించారు. 'లేదమ్మా !  నేను ఐదుగురికి గాజులు తొడిగాను. ఆ ఐదో పిల్ల ఎక్కడో లోపలకెళ్లి దాక్కుని ఉంటుంది! అని ఆ గాజులవాడు రెట్టించాడు.

వారి వాదన విన్న ఆ పండితులు ఐదో అమ్మాయి ఎవరు ఎక్కణ్ణించి వచ్చింది, ఎక్కడకెళ్లింది, అని ఆలోచిస్తూ ఆలయం చుట్టూ వెతికారు. ఆలయంలోకి వెళ్లి చూసిన వారి ఆశ్చర్యానికి అంతేలేకుండా పోయింది .  ఆ గాజుల వర్తకుడు గాజులు తొడిగిన చెయ్యి సాక్షాత్తూ ఆ అమ్మవారిదే ! అతను తొడిగిన గాజులు అమ్మవారి మూలవిరాట్టు చేతులున్నాయి . వెంటనే అతనికి ఆనందంగా డబ్బులిచ్చి పంపేశారు . 

అద్భుతమైన ఈ విషయాన్ని వారు మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న భక్తులూ , ఇతర పండితులూ ఇలా అందరూ చూశారు . అప్పటి నుండీ అమ్మవారికి మట్టి గాజులంటే యెంత ఇష్టమో , ప్రపంచానికి తెలిసింది . 

ఈ విషయం ఆనోటా ఆనోటా చేరి ఊరంతా ప్రచారమైంది. ఆనాటి నుంచి కనకదుర్గమ్మ వారికి గాజులంటే ఎంతో ఇష్టం అనీ, ఆ తల్లికి గాజులు సమర్పిస్తే ఎంతో సంతోషిస్తుందని భావిస్తూ భక్తులందరూ అమ్మవారికి ఆలయంలో గాజులు సమర్పించే సంప్రదాయాన్ని ప్రారంభించారు.

ఈ గాజుల సంప్రదాయం ఆనాటి నుంచి నేటి వరకూ కొనసాగుతూనే ఉంది. 

ఇలా అమ్మవారికి గాజులు సమర్పిస్తే, సువాసినులకి అఖండమైన సౌభాగ్యం, ఐదవతనం సంప్రాప్తిస్తుందని విశ్వాసం. విజయవాడ దుర్గమ్మకు కాదు, శక్తి స్వరూపిణులైన అమ్మవారి ఆరాధనలో గాజులు సమర్పించడం అనంతమైన ఫలితాలని అనుగ్రహిస్తుంది . ఆలయానికి వెళ్లినా, ఇంట్లో అమ్మవారి పూజ చేసుకునేప్పుడు యెర్రని గాజులు అమ్మకి సమర్పించండి. శుభం .  

#vijayawada #kanakadurga #durga 

Tags: vijayawada, kanakadurga, kanaka, durga, bangles

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi