దేవీ సప్తశతి చదువుతున్నారా ?
దేవీ సప్తశతి చదువుతున్నారా ? అందులోని రహస్యం బోధపడిందా ?
- లక్ష్మి రమణ
రక్తసంబంధీకులు ఎంతమంది ఉన్నా కన్న తల్లిని మించిన వారు ఎవరు ఉంటారు. దేవీ దేవతలు ఎంతమంది ఉన్నా అమ్మని మించిన కరుణామయి మరొకరు ఉండరు . అమ్మ అనుగ్రహం లభించిందా, ఇక ఆ జీవికి మరో జన్మలేదు. అందుకే అమ్మ ఆరాధకులు అందరూ కూడా ఆ లోక జననిని సప్తశతితో కీర్తిస్తూ ఉంటారు. శాక్తేయులకు పరమ పవిత్రమైన పారాయణ గ్రంథం ‘సప్తశతి’. దీనికే చండీ విద్య అని కూడా పేరుంది. చతుర్విధ పురుషార్ధసాధనలో దీనికి మించిన రహస్య విద్య మరొకటి లేదు. శక్తి దేవతల అనుగ్రహాన్ని సంపాదించడానికి చెప్పబడిన అనేకానేక పారాయణ గ్రంథాలన్నింటిలోకి ఇది మకుటాయమానమైంది. సమస్తతంత్ర గ్రంథాలలోని విషయాలకన్నింటికీ ఇదే ఆధార భూతం. భగవతి సాక్షాత్కారాన్ని మనం ఎలా పొందాలో ఇందులో వివరంగా వర్ణించబడింది. ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకుందాం .
సృష్టి మూలతత్వాన్ని లేదా పరబ్రహ్మాన్ని స్త్రీ మూర్తిగా భావించి చేసే ఉపాసనే శ్రీవిద్య. శ్రీ విద్యాప్రదాత గురుదేవులు శ్రీ దత్తాత్రేయ వారు. ఆయన మొదట ఈ విద్యను పరశురాముడికి బోధించగా, పరశురాముడు హరితాయన మహర్షికి ఈ విద్యను ప్రసాదించారు. ఆ హరితాయన మహర్షి ఈ శ్రీవిద్యను లోకానికి వెల్లడించాడు. ఆ హరితయునుడికే ‘సుమేధ’ అని మరో పేరు ఉన్నదని త్రిపుర రహస్యం వెల్లడిస్తుంది. ఈ’ శ్రీవిద్య’ లలితా పర్యాయం, చండీ పర్యాయం అని రెండు రకాలుగా ఉంది. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితా మహిమను ప్రతిపాదిస్తే; మార్కండేయ పురాణం చండీ మహిమను ప్రకటించింది. ఆదిశక్తి యొక్క శాంతాకారాన్ని- లలిత అని, రౌద్రాకారాన్ని- చండిక అని వ్యవహరిస్తారు. సప్తశతి చండీ మహిమను ప్రకటిస్తుంది. ఈ చండీ స్వరూపిణిని ఋగ్వేదంలో కాళీ తార మొదలైన పేర్లతో స్తుతించారు . శ్రీవిద్యా ఉపాసన చాలా కష్టసాధ్యం. దుర్గమం . కనుక దీనినే దుర్గా సప్తశతి అంటారు .
అసలు ఎవరీ చండిక?
చండిక అంటే పరబ్రహ్మ పట్టమహి అయినటువంటి దేవత. పరబ్రహ్మము యొక్క శక్తి అని భావించవచ్చు . చెడి, కోపే అనే ధాతువుల నుండి చండిక అనే పదం ఉత్పన్నమైంది. మహాభయ జనకమగు క్రోధమే చెడి అనే ధాతువుకు అర్థము. అటువంటి కోపమే పరబ్రహ్మ. అదే మాయ. బ్రహ్మము వేరు, మాయ వేరు అని లోకములో ఒక భావన ఉంది . కానీ ఆ రెండు ఒకటే. బ్రహ్మతో అభిన్నము అయిన ఆ ధర్మమునకే, పరబ్రహ్మమునకే ‘చండి’ అని పేరు. చండిక భిన్నములైన ధర్మ రూపములకుఅంటే జ్ఞాన ,ఇచ్ఛా, క్రియలకు రూపాలే మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులు.
సప్తశతిలో మూడు చరిత్రలు ఎందుకు ఉన్నాయి?
అమ్మ విజయానికి సంకేతాలుగా ఉన్న కేవలం మూడు యుద్ధాల గురించి మాత్రమే సప్తశతి వివరిస్తుంది . యుద్ధంలో దేవతలు రాక్షసుల చేత మూడుసార్లు ఓడిపోయారు. వాళ్ళని రక్షించడానికి దేవి మూడుసార్లు వేరువేరు రూపాలతో అవతరించింది కాబట్టి మూడు చరిత్రలు చెప్పబడ్డాయని కొందరు చెబుతారు. కానీ, రాక్షసులకీ, దేవతలకే మధ్య పోరు కేవలం మూడుసార్లే జరగలేదు కదా ! మన పురాణాల ప్రకారం ఎన్నో వేల పర్యాయాలు యుద్ధం జరిగినట్లు ఉంది . అందులో కొన్నిసార్లు దేవతలు గెలిచారు . మరికొన్నిసార్లు దైత్యులు గెలిచారు .
అయితే, సప్తశతిని మూడు చరిత్రలుగా చెప్పడంలో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. . మన అంతఃకరణలో మూడు దోషాలు ఉన్నాయి. అవి మల దోషము, విక్షేప దోషము,ఆవరణ దోషము. జన్మజన్మాంతర వాసనకు మలమని పేరు. మానసిక చంచలతనే విక్షేపమంటారు. స్వరూప జ్ఞానమునే (తానెవరో తాను తెలుసుకో లేకపోవడాన్ని) ఆవరణము అంటారు. ఈ మూడు దోషాలే మూడు గ్రంథులు. ఇవే మానవుని సంసార చక్రానికి గట్టిగా బంధించేస్తున్నాయి. ఈ గ్రంధి భేధనం జరిగితే గాని మానవుడు సంసార చక్రం నుంచి బయటపడడు. ఈ మూడు గ్రంథులకే బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అని పేర్లు ఉన్నాయి.
ఈ గ్రంథిత్రయాన్ని ఛేదించి, బ్రహ్మాన్ని చేరుకోవడం సాధనాపరంగా సామాన్యమైన విషయం కాదు . కుండలిని శక్తి మూలాధార, స్వాధిష్ఠానచక్రములను దాటితే, బ్రహ్మగ్రంథి భేదనం జరుగుతుంది . మణిపూర, అనాహత, చక్రాలను దాటితే విష్ణుగ్రంధి బేధము; విశుద్ధ, ఆజ్ఞా చక్రాలను దాటితే రుద్రగ్రంధి భేదనము జరుగుతుందని యోగశాస్త్ర సిద్ధాంతము . ఈవిధంగా ఉన్న ఆ మూఢుగ్రంధులు -ప్రధమ చరిత్రలో సత్ అంటే సత్ యొక్క ఉపాసన, మధ్యమ చరిత్రలో చిత్ అంటే చైతన్యం యొక్క ఉపాసన, ఉత్తమ చరిత్రలో ఆనంద ఉపాసన చేయడం దేవీ సప్తశతి పారాయణ వలన జరిగి, దీని వలన వరుసగా గ్రంధి త్రయ భేదనము జరుగుతుంది.
యోగాశాస్రం ఈ గ్రంధి భేదనాన్ని చాలా శ్రమతో ,నియమ నిష్ఠలతో కూడిన సాధనతో సాధించవలసిన మజిలీగా చెబుతుంది . కానీ దేవీ సప్త శతి ని అర్థం చేసుకొని చదివితే, శక్తి చేతనమై సహస్రారానికి చేరుతుంది . అదే దేవీ సప్తశతి రహస్యం . ఇందులోని కథలు , మూడు యుద్ధాలు , మూడు ప్రకరణాలు దీనినే సూచిస్తాయంటున్నారు విజ్ఞులు . ప్రధమ చరిత్రలో వచ్చేటటువంటి మధుకైటబుల సంహారమే బ్రహ్మ గ్రంధి భేదనం. మధ్యమ చరిత్రలో పేర్కొన్న మహిషాసుర మర్దనమే- విష్ణు గ్రంధి భేదనం. ఇక ఉత్తమ చరిత్రలో శుంభ నిశుంభుల వధ రుద్ర గ్రంధి భేదనం. ఇలా మూడు గ్రంథాల వేదనము జరిగి, సాధకుడు జీవన్ముక్తుడు కావడానికి, సచ్చిదానంద స్వరూపముగా మారడానికి ఆ మూడు చరిత్రలు సప్తశతిలో చెప్పారు .
సప్తశతి ఒక ఆధ్యాత్మిక రహస్యం. శక్తి పరిణామ రూపమైన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలపై ఉన్న అభిమానంతో దుఃఖపడే జీవుడు, తన పురాకృత పుణ్య విశేషము వల్ల చండీ తత్వ పరిజ్ఞానంతో ప్రాణవాయువును నిరోధించే అభ్యాసము గలవాడై, మూలాధార చక్రంలో , నిర్దిష్ట మూలాధార చక్రంలో నిద్రిస్తున్న కుండలిని శక్తిని జాగృతం చేయగలుగుతాడు . అప్పుడు కుండలిని శక్తి సుశుమ్ననాడిలో ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. మూలాధారాధి షట్ చక్రాలను, బ్రహ్మ విష్ణు రుద్ర గ్రందులను సేవించుకుని సహస్రారం అనే స్వస్థానాన్ని చేరుకుంటుంది. ప్రాణవాయువుని నిరోధించే యోగాభ్యాసము లేకపోయినప్పటికీ , చండీ అనుగ్రహము లభించినట్లయితే సాధకుడు ఆత్మవిచారము చేత కూడా ఈ శరీర త్రయాభిమానాన్ని నాశనం చేసుకునేటందుకు వీలుంటుంది. కాబట్టి దేవీ సప్తశతిని నిత్యం శ్రద్ధగా పారాయణ చేయడం వలన అమ్మకరుణ అవాజ్యముగా లభించి అనంతమైన పాపరాశి దగ్దమై మోక్షము లభించే అవకాశము ఉంది .
శుభం .