Online Puja Services

పంచశక్తులు - దుర్గా దేవి !

18.222.113.135

పంచశక్తులు - దుర్గా దేవి !
-కామకోటి వారి సౌజన్యంతో 

పరాశక్తి అయిన జగన్మాత లోకసంరక్షణార్ధం వేఱువేఱు సందర్భాలలో వేఱువేఱు నామరూపాలతో ఆవిర్భవించింది. ఆయా దేశకాలాలలో తన దైన "దివ్య ప్రణాళిక" ను నిర్వహించే నిమిత్తం 'దుర్గ'గా , 'రాధ'గా, 'లక్ష్మి' గా, 'సరస్వతి'గా, 'సావిత్రి'గా అవతరించింది. ఈ ఐదు సన్నివేశాలలో వ్యక్తమైన దేవతామూర్తులకే "పంచశక్తులు "అని పేరు. వీరిలో తోలి శక్తి అమ్మ దుర్గమ్మ . శాకంబరిగా, శతాక్షిగా ఆ అమ్మ ఎలా మారిందో , ఎలా తన బిడ్డల్ని అసురీ శక్తుల నుండీ కాపాడిందో ఈ వృత్తాంతం మనకి వివరిస్తుంది . 

దుర్గాదేవి
దేవీ మహిమలను శ్రద్ధాళువై అలకిస్తున్న జనమేజయ మహారాజు వ్యాసమహర్షికి కృతజ్ఞతాంజలి సమర్పిస్తూ "మహర్షీ! పరాశక్తి ప్రభావాన్ని గురించి ఎంతగా విన్నా తనివి తీరడం లేదు. ఆశ్రయించిన వారికి అనంత సంపదలను అనుగ్రహించే ఆ తల్లి వాత్సల్య విశేషాలను తెలియజేసి నన్ను తరింప చేయండి" అని ప్రార్థించాడు.

జనమేయుని మాటలకు సంతోషించిన వ్యాసమహర్షి "రాజా! దేవి యందు గల భక్తి శ్రద్ధలతో నీ వడిగిన ఈ కోరిక సంతోషం కలిగించింది. సావదాన చిత్తుడవై ఆలకించు "అని దుర్గాదేవి కథను ఈ విధంగా వివరించాడు.

"పూర్వం హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనే రాక్షసుడు పుట్టాడు. దేవతలకు వేదమే బలమని గుర్తించిన అతడు, వేదాలను తుదముట్టించి దేవతలను నాశనం చేయవచ్చునని ఆలోచించాడు. ఒక పథకం ప్రకారం వేయి సంవత్సరాలు బ్రహ్మను గురింతి తీవ్రమైన తపస్సు చేశాడు. కేవలం వాయి భక్షణతోనే జీవయాత్ర సాగిస్తూ, అతడు తపస్సును కొసాగించాడు. అతని కఠోర తపశ్చర్యకు లోకం అల్లకల్లోలమైంది. బ్రహ్మా అతనికి ప్రత్యక్షమయ్యాడు వేదాలను తనకు అనుగ్రహించ వలసిందిగా, దేవతలను జయించ గల శక్తిని తనకు ప్రసాదించ వలసిందిగాను వరం కోరుకున్నాడు దుర్గముడు. బ్రహ్మదేవుడు "తథాస్తు" అని మాయమయ్యాడు.

బ్రహ్మ యిచ్చిన వరప్రభావం వల్ల రాక్షసుడైన దుర్గమునికి వేదాలన్నీ స్వాధీనమయ్యాయి. ఆ నాటి నుండి విప్రులు వేదాలను మరచిపోయారు. భూలోకంలో వేదధర్మాచరణ  క్షీణించింది. స్నానసంధ్యాదులు, జపహోమాదులు, యజ్ఞ యాగాదులు అన్ని అంతరించాయి. వేదవాఙ్మయ విజ్ఞానం తమకు దూరమై పోవడంతో బ్రాహ్మణులకు యజ్ఞనిర్వహణ అసాధ్యమైపోయింది. యజ్ఞాలు లేకపోవడం వల్ల, హవిస్సులు లేని  దేవతలు నిర్వీర్యులయ్యారు. రాక్షస గణం దేవలోకాన్ని అక్రమించింది. ఇంద్రుడు స్వర్గాన్ని విడిచి, కొండల్లో, కొనల్లో అజ్ఞాతవాసం చేస్తూ పరాశక్తిని ప్రార్థించ సాగాడు. బ్రాహ్మణులందఱూ హిమాలయాలకు వెళ్ళి భవానీ మాతను ప్రార్థించి, తమ అపరాధాలను క్షమించి, దయచూడ వలసిందిగా వేడుకున్నారు. తెలియక చేసిన తప్పులను మన్నించి, కనికరించ వలసిందిగా ప్రాధేయ పడ్డారు.

వారి ప్రార్థనలు విని జగన్మాత ప్రత్యక్ష మయింది. నిలువెల్లా కన్నులతో దివ్య కాంతులతో ప్రత్యక్షమయింది. తన బిడ్డలైన ప్రాణికోటి కష్టాలను చూడలేత శతనేత్రాలతో తొమ్మిది రోజుల పాటు ధారాపాతంగా కన్నీరు కారుస్తూ రోదించింది. తన బిడ్డల బాధ చూడలేక కన్నీరు మున్నీరుగా ఆమె విలపించగా, ఆమె కన్నీటి దారల చేత చెట్లన్నీ చిగురించి, పుష్పించి, ఫలించి , ఆర్తులకు మధుర ఫలాలను అందించాయి. అంతట జగన్మాత స్వయంగా తన చేతులతో వివిధ ఫలాలను, రకరకాల శాకాలను ఆర్తుల నోటికి అందించి, వారి ఆకలిని తీర్చింది. ఆనాటి నుండి ఆ దేవిని "శతాక్షి"అని, "శాకంభరి "అని పిలుస్తూ, దేవతలందఱు ఆమెను పూజింపసాగారు.

ఈ వృత్తాంతం విన్న దుర్గముడు రాక్షస సమూహాలను వెంటబెట్టుకొని వెళ్లి దేవతలను, బ్రాహ్మణులను చుట్టుముట్టి, పరిపరి విధాలుగా వేధిస్తూ, వారిని భయ భ్రాంతులను చేయసాగాడు. దేవతలు, బ్రాహ్మణులు ఆర్తితో శతాక్షీదేవిని ప్రార్థించారు.

వారి మొఱలు ఆలకించి, జగన్మాత తేజోరాశి అయిన చక్రాన్ని సృష్టించి రాక్షసులతో యుద్ధం ప్రారంభించింది. దేవ దానవ సంగ్రామం భయంకరమైన , వారు పరస్పరమూ ప్రయోగించుకొనే శరపరంపరలతో సూర్య మండలం మూసుకు పోయింది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. రాక్షసులు మరింతగా విజృంభించారు. అపుడు దేవి కనుబొమలు ముడిచి, హుంకారం చేసింది. ఆమె దివ్యదేహం నుండి అజేయమైన శక్తులు అనేకం ఆవిర్భవించాయి.అలా ముప్ఫయి రెండు శక్తులు ఆవిర్భవించి, రాక్షసులను చీల్చి చెండాడాయి. పదిరోజులు యుద్ధం సాగిన తర్వాత దానవ సైన్యం అంతా నశించింది. దుర్గముడు ఒక్కడే మిగిలాడు. దుర్గముడు అతి కోపంతో దేవి పైకి విజృంభించాడు. అపుడు శతాక్షీదేవి తీక్షణమైన చూపులను ప్రసరింపచేసి, దుర్గమునిపై బాణవర్షం కురిపించింది. దుర్గముని రథాశ్వాలను, సారధిని వధించింది. ఆ పై మరో ఐదు బాణాలు ప్రయోగించి దుర్గముణ్ణి సంహరించిది. అప్పుడు దేవతలు, త్రిమూర్తులు ఆ దేవిని  శాకంభరీ దేవి! నమస్తే శతలోచనే!
"సర్వోపనిషదుద్ఘషే! దుర్గమాసుర నాశిని!"

అని సంస్తుతించారు.

అంతట ఆ దేవి వానితో " దేవతలారా ! వేద విప్రులారా ! మీరిప్పుడు చూస్తున్న ఈ నా రూపం చాలా పవిత్రమైనది. ఈ రూపాన్ని చూడనందు వల్లనే ఇంత కాలమూ మీరు ఇన్ని కష్టాలు పడ్డారు. దుర్గమాసురుణ్ణి చంపిన నన్ను 'దుర్గ' అనే పేరుతో పూజిస్తూ, మీ కష్టాలను దూరం చేసుకొని సుఖంగా ప్రశాంతంగా జీవించండి" అని అభయమిచ్చి, అంతర్ధానం మైంది.

ఆ నాటి నుండి దేవతలు, వేదవిప్రులు యథావిధిగా తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ, ప్రశాంతంగా జీవయాత్ర సాగిస్తూ, ఆ దేవిని దుర్గగా, శతాక్షీ దేవిగా, శాకంభరిగా వ్యవహరిస్తూ, ఆమెను ఆరాధించి, ఆమె అనుగ్రహంతో తమ జీవితాలను చరితార్ధం చేసుకున్నారు.

ఈ కథ విశేషాన్ని వినిపించి, వ్యాసమహర్షి ఇలా అన్నాడు-"జనమేజయ మహారాజా !
పవిత్రమైన ఈ శతాక్షీ మహిమా వృత్తాంతం విన్న వారికి దేవీ భక్తి కలుగుతుంది.కష్టాలు తొలిగిపోతాయి. ఆమె అనుగ్రహం పొందితే, సర్వమూ సిద్ధించినట్లే. నీవు కూడా ఆమెను పూజించి, కృతార్ధతను పొందు."

ఈ రీతిగా పంచశక్తులలోని మిగిలిన అవతార వైభవ విశేషాలను కూడా వ్యాసమహర్షి జనమేజయ మహారాజుకు వివరించాడు. వాటిని మరో పోస్టులో తెలుసుకుందాం . 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi