అమ్మ ఈ రూపాల్లో మరింత అనుగ్రహప్రదాయని
అమ్మ ఈ రూపాల్లో మరింత అనుగ్రహప్రదాయని !!
దసరా పండుగల్లో అమ్మవారిని అనేక రూపాల్లో దర్శించడం చాలా సాధారణామైన విషయం . అదేసమయంలో విశేషమైన ప్రాశస్త్యాన్ని కలిగిన విషయం కూడా !! అమ్మ ఏ చీరకట్టినా , ఏ నగలు పెట్టినా , ఏ డ్రెస్ వేసుకున్నా అమ్మే కదా ! పిల్లవాడికి చలిచీమ కుట్టినా తల్లడిల్లిపోయే అమృత కల్పవల్లే కదా ! అమ్మ రూపంలో విశేషం ఉండొచ్చు . అది భక్తుల ముచ్చట . కానీ అమ్మ మనసులో తేడాలేదు . ఆమె పంచే అనురాగంతో తేడాలేదు . ఆ కరుణా వాత్సల్యాలు నిండిన అమృత ధరలు నిరంతరం తన బిడ్డలపై వర్షిస్తూనే ఉంటాయి . కానీ, పుట్టినరోజునాడు అమ్మ మరింత ప్రసన్నురాలై ఏదడిగితే అది ఇచ్చేస్తుంటుంది చూడండి , అదిగో అలంటి అమ్మ దసరాల్లో మనకి దర్శనమయ్యే జగజ్జనని . ఇక అమ్మ నీవుతప్ప ఇతర దేవతలే లేరు , నీవు తప్ప నాకు శరణాగతి లేరని ఆమె ముందర మోకరిల్లితే , ఆ చందమామ కావాలని అడిగినా లేదనకుండా తెచ్చి ఇచ్చేస్తుంది కాదంటారా ?
నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే
నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. అని చేతులు జోడిస్తే చాలు అమ్మ అనుగ్రహం మనకి దక్కినట్టే !
అయితే, మార్కండేయ మహర్షి అమ్మ అవతారాల గురించి బ్రహ్మగారిని అడగ్గా , ఆయన స్వయంగా ఈ క్రింది విధంగా సెలవిచ్చారని చెబుతుంది వరాహపురాణం . .
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది. బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పిన ఆ నవదుర్గల రూప విశేషాలేమిటో చూడండి .
శైలపుత్రి
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, ఆ తర్వాత పర్వతరాజైన హిమవంతుని యింట జన్మించినందుకు ఆమెకు శైలపుత్రి అని పేరొచ్చింది . వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము ఉంటుంది . తలపై చంద్రవంకను ధరించి ఉంటారు . పార్వతి, హైమవతి అని ఆమె ఇతరనామాలు . శైలపుత్రి గా అమ్మ మహిమలు, శక్తులు అనంతములు. కోరిన కోర్కెలు ఈడేర్చే వాంఛితార్థ ప్రదాయని ఈ శైలపుత్రి .
బ్రహ్మచారిణి
'బ్రహ్మచారిణి' అంటే , యోగిని రూపముగా తపస్సు చేసుకునేటటువంటి దేవీస్వరూపము . బ్రహ్మమునందు చరించునది కాబట్టి బ్రహ్మచారిణి అని కూడా చెబుతారు .కుడి చేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి ఉంటారు . పరమేశ్వరుని పతిగా పొందేందుకు తీవ్రమైన తపస్సుని చేసి ఉమ అని పేరు పొందినది . ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, అత్యంత శుభంకరము. భక్తులకు, సిద్ధులకు అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తిస్థాయిని శ్రుతివచనం .
చంద్రఘంట
తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' అనే పేరొచ్చింది .ఈ రూపంలో ఉన్న దేవి శరీరము హిరణ్య వర్ణంలో కాంతులీనుతూ ఉంటుంది . తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములు , బాణము మొదలైన అస్త్రములను ధరించిఉంటుంది . ఈమె సింహ వాహన. ఈమె సర్వదా యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది . ఈ దేవి ధరించిన గంటనుండి వచ్చే భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు గడగడలాడిపోతారు . కాని తన భక్తులకు, ఉపాసకులకు ఈమె అత్యంత సౌమ్యముగను, ప్రశాంతముగను దర్శనమియ్యడం విశేషం . .
ఈ దేవి ఆరాధన సర్వకార్యసిద్ధిదాయకం . భక్తుల కష్టములపైన దండెత్తి , వాటిని శీఘ్రముగా నివారించి, వారికి శాంతి సౌఖ్యాలని చేకూరుస్తుంది . సింహవాహనము పైన ఆశీనమైన చంద్రఘంటా దేవిని అర్చించినవారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు . ఏవిధమైన భయములు వారి దరి చేరలేవు . .
కూష్మాండ
కూష్మాండ మంటే , బ్రహ్మాండము . అవలీలగా బ్రహ్మాండమును సృజించునది కాబట్టి ఈ దేవిని 'కూష్మాండ' అని పిలుస్తారు. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావము దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు కూష్మాండ మాత ప్రతిరూపమే ! .
'అష్టభుజాదేవి' అని కూడా పిలువబడే ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లుతుంటుంది . ఏడు చేతులలో వరుసగా కమండలం , ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - ధరించి ఉంటుంది . ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది . ఈ దేవికూడా సింహవాహన స్థిత గానే దర్శనమిస్తుంది .
కూష్మాండ దేవిని ఉపాసించడం వల్ల ,భక్తులు వారి రోగములు , శోకములనుండి విముక్తిని పొందుతారు . శులభం ప్రసన్నంగా, భక్తులపాలిటి కొంగుబంగారంగా ఈ రూపంలో ఉన్న దేవిని చెబుతారు .
స్కందమాత
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధిస్తారు . ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొని ఉంటుంది . ఇంకొక కుడిచేత పద్మము ధరించి ఉంటుంది . ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.
స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
కాత్యాయని
"కాత్యాయనీ మాత" బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుణ్ణి వధించింది .
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని వివాహమాడేందుకు గోదామాతతో పాటుగా యమునాతీరమున ఈమెను ఉపాసించారు . ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణ మేనిఛాయలో నాలుగు భుజములతో విరాజిల్లే దేవి కాత్యాయని . ఈమె కుడిచేతుల్లో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగి ఉంటాయి . ఎడమ చేతుల్లో ఒకదానితో ఖడ్గము, మరొకదానితో పద్మము ధరించి ఉంటుంది . సింహవాహనారూఢగానే ఈమెకూడా దర్శనమిస్తుంది .
ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.
కాళరాత్రి
"కాళరాత్రి" దేవి రూపము చాలా భయంకరంగా ఉంటుంది . గాఢాంధకారము లాగా నల్లని శరీరముతో ఉంటుంది . తలపై కేశములు చెల్లాచెదురై ఉంటాయి . మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది . ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములని పోలినట్టు గుండ్రంగా ఉంటాయి . శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెలువరిస్తుంటాయి . వాహనము గార్దభము. నాలుగు భుజములు కలిగిఉండే ఈ దేవి ఒక కుడిచేతి తో వరముద్ర ద్వారా అందఱికి వరములను ప్రసాదిస్తే , మరో కుడిచేయి అభయ ముద్రను కలిగి ఉంటుంది . ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించి ఉంటుంది .
చూసేందుకు భయంకర స్వరూపమైన కాళరాత్రి ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదిస్తుంది. అందువల్ల ఈమెను "శుభంకరి" అనికూడా అంటారు.కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రము చేతనే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవడం తథ్యము. ఈమె అనుగ్రహము చేత గ్రహబాధలును తొలగిపోతాయి. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులుగా ఉంటారు .
మహాగౌరి
అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపిస్తాయి .ఈమె ధరించే వస్త్రాలు , ఆభరణాలు సైతం ధవళ కాంతులని వెదజల్లుతూ ఉంటాయి . చతుర్భుజాలతో వృషభవాహనాన్ని అధిరోహించి చరిస్తూంటుంది . కుడిచేతులలో ఒకదానిలో అభయముద్రను, ఇంకొకదాంట్లో త్రిశూలమును ధరించి ఉంటుంది . అట్లే ఎడమచేతులలో ఒకదానిలో డమరుకమును, ఇంకొకదానిలో వరముద్రను కలిగి ఉంటుంది . ఈ దేవిదర్శనము మానసిక శాంతిని ప్రసాదిస్తుంది . .
పార్వతి అవతారంలో ఉన్నప్పుడు శివుని భర్తగా పొందగోరి ఘోరమైన తపస్సును ఆచరించిన కారణంగా శ్వేతవర్ణ శోభితమైన ఆమె శరీరము కృష్ణ వర్ణంలోకి మారిపోయింది . దాంతో ఈమెకి గౌరీ అనే పేరు వచ్చింది . ఈమె ఉపాసనా ప్రభావము చేత అసంభవములైన కార్యములు సైతము సంభవము అవుతాయి .
సిద్ధిధాత్రి
ఈ దేవి సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి అని పేరుపొందింది . పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణములో పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలిచింది . సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించి ఉంటుంది . ఎడమవైపున ఒక చేతిలో శంఖమును, మఱియొక హస్తములో కమలమును కలిగి ఉంటుంది . నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులు కరతలామలకమవుతాయి .
ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్ని సఫలమవుతాయి . సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలు నశించి పోతాయి . ఆధ్యాత్మిక ఉన్నతి సంప్రాప్తిస్తుంది .
దసరా పర్వదినాలలో ఈ రూపాలలోనో అమ్మని ఆరాధించే సంప్రదాయం భాదతదేశంలో ఉంది . అయితే, శ్రీ రామకృష్ణ పరమహంసకి పరమ శాంతి స్వరూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించిన కాళీమాత లాగా , అమ్మరూపం ఎలా ఉంటేనేమి ? అమ్మ అమ్మే కదా !! జగత్తును అనుగ్రహించే ఆ అమ్మకి నీరాజనాలు పలుకుతూ , ఆమె కృప ఎల్లరకూ నిండుగా ఉండాలని కోరుకుంటూ , శలవు.
- లక్ష్మి రమణ