దసరాల్లో అపరాజితా దేవి ఆరాధన అవసరం
దివ్యమైన దసరాపర్వదినాల్లో అపరాజితా దేవి ఆరాధన అవసరం .
నవరాత్రి వాస్తవానికి ఋతువుల సంధికాలం. అందుచేత సృష్టికి కారణమైన మహా మాయ తీవ్రవేగం కలిగి ఉంటుంది. పూజాదుల చేత అమ్మవారిని ఆహ్వానించటం సులభ సాధ్యం. తొమ్మిది రోజులు నవ దుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి. రాహు ప్రతికూల ప్రభావం తగ్గి, దోష నివారణ జరుగుతుంది. దేవి అర్చనలో లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయి. రోగ పీడలతో బాధపడే వారు, జాతకంలో అపమృత్యు దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం.
పరమ శివునికి జగన్మాత దుర్గాదేవికి, సిద్ది ప్రదాత గణపతికి శమీ పత్రి సమర్పించే ఆచారం అనాదిగా వస్తోంది. పూర్వం జమ్మిచెట్టు కాడల రాపిడి ద్వారా సృష్టించిన అగ్నితోనే యజ్ఞ యాగాదుల క్రతువులు నిర్వహించేవారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శమీ వృక్షంలో అగ్ని ఉంటుందనే విశ్వాసం దృడపడింది. అగ్ని వీర్యమే సువర్ణం కనుక జమ్మి బంగారం కురిపించే చెట్టుగా పూజార్హత పొందింది. ఈ రోజే శ్రీ రాముడు రావణునిపై విజయం సాధించాడు. విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు.
శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు, బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేసి పూజిస్తారు. అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కో అవతారం ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు.
జమ్మి చెట్టుని పూజించేప్పుడు ఈ శ్లోకాన్ని ఆచారం .
శమీ శమయతే పాపం
శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనః
తాత్పర్యం :
ఓ జమ్మి వృక్షమా ….నిను వేడుకున్నట్లయితే పాపం వినాశనమవుతుంది.
ఓ జమ్మి వృక్షమా నిన్ను కొలిచినట్టయితే , శత్రు వినాశనం అవుతుంది. నిన్నాశ్రయించిన అర్జనునికి విజయాన్ని అందించావు . నిన్ను అర్చించడంచేత సాక్షాత్తూ నారాయణుడైన రాముడు శ్రీదేవి అయిన సీతామాతను చేరగలిగాడు .
అపరాజితా దేవి రూపమైన అమ్మా , మాకునూ విజయాలను అనుగ్రహించెదవుగాక !
- లక్ష్మి రమణ