దసరా శోభల్లో ఆధ్యాత్మిక అద్భుతం
దసరా శోభల్లో ఆధ్యాత్మిక అద్భుతం
దసరా పండుగ వచ్చిందంటే , భారతావనిలో సరికొత్త ఆధ్యాత్మిక హేల మొదలయినట్టే ! దేశమంతా వాతావరణ శాఖ ప్రమేయం లేకుండానే రెండురకాలైన వాతావరణం అలుముకొని ఉంటుంది . అత్తింటికి వచ్చి అలకలు పోయే కొత్త అల్లుళ్ళు , అల్లుళ్ళ గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఆపసోపాలుపడే మామలు , పిండివంటలతో త చేతి మహత్యాన్ని చూపించాలని ఆరాటపడే అత్తగార్లు .పట్టుచీరల రెపరెపలు , ఆహార్యాల జిగిబిగులు . ఇదంతా ఒకెత్తు . ఆధ్యాత్మిక వాతావరణం మరో ఎత్తు .
నవరాత్రి వ్రతం చేతును , శరన్నవరాత్రి వ్రతం చేతును , నవనవమై ప్రణవనవము నవచించును . అంటూ దేశం మొత్తం అపరాజితాదేవి ఆరాధనలో నిమగ్నమైపోతుంది . పసుపు , కుంకుమల జావళిలో ఆధ్యాత్మికావేశ తరంగమై ఉప్పొంగుతుంటుంది .
అనాదికాలం నుండీ మనదేశ ఆధ్యాత్మిక సంపద అత్యంత ఉన్నతమైన విషయాలను , ఒక విధంగా చెప్పాలంటే సృష్టి రహస్యాలని విడమరచి చెప్పింది . చక్కని కథలుగా రూపుకట్టి పామరులకైనా అర్ధమయ్యే రీతిలో మలిచి అందించింది . అటువంటి అద్భుతాలలో ఒకటి ఈ దసరా పండుగ కూడా అంటే ఆశ్చర్యంలేదు . ఈ చరాచర సృష్టిని సృజియించి , నడిపిస్తున్న వాడు ఒక్కడే ! ఆయనే భగవంతుడు . అయితే, మనం బొమ్మ చేయాలంటే మట్టి కావాలిగా , అట్లాగే, ఈ సృష్టి సృజనకు పదార్ధం ప్రకృతి . చతుర్వింశతి తత్వాలతో ఈ ప్రక్రుతి మూర్తీభవించిన మాతృ స్వరూపంగా ఆ పరమాత్మ సృష్టికి శక్తిగా నిలబడింది అంటాడు సాంఖ్యాశాస్త్రంలో కపిల మహర్షి . అమ్మ లేకపోతె, బిడ్డని కనేదెవరు చెప్పండి ! ఇప్పుడీ విషయాన్ని మహిషాసుర మర్దనిగా అమ్మ ఆవిర్భావం కధలో నిక్షేపించి చూడండి . అంతరార్థం అవగతం అవుతుంది .
జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అదే ఇప్పటికీ మనం జరుపుకొనే దసరా పండుగ .
బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి, వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము , బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషరూపము, సింహరూపము, మానవరూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి కూడా.
అందుకే దసరా అంటే, సరదాల పండుగే కాదు , దసరా అంటే, ప్రకృతిని ఆరాధించే పండుగ . సృష్టి , స్థితి , లయ కారులైన త్రిమూర్తుల శక్తిని నింపుకున్న పరమ ప్రకృతి ఆ అపరాజితా దేవి . చెడుమీద సాధించిన ఆ ప్రకృతి మాత కధని విని ఆ ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని మనం కూడా పునీతులమవుదాం .
శుభం .
- లక్ష్మి రమణ