కాత్యాయనీదేవి అమోఘ ఫలదాయిని
ఓం శ్రీ మాత్రే నమః
"కాత్యాయని దేవి".
దుర్గామాత ఆరవ స్వరూపం ‘కాత్యాయని’ (లక్ష్మి)
ధ్యాన శ్లోకం:
చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహనా!
కాత్యాయినీ శుభం దద్యాదేవి దానవఘాతినీ!!
పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు.
అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి.
ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన...
‘కాత్యాయన’ మహర్షి.
ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక.
భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది.
ఈ మహిషాసురుని సంహరించడానికై...
బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు.
మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు.
అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.
ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ.
ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో "కాత్యాయన" మహర్షి పూజలందుకొని "విజయదశమి"నాడు మహిషాసురుని వధించింది.
కాత్యాయనీదేవి అమోఘ ఫలదాయిని
ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ.
ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది.
ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది.
ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ... మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది.
ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ...
మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి.
పసుపు రంగు చీర ధరించిన ఆమె సింహం మీద అధిరోహించి దర్శనమిస్తుంది.
"కాత్యాయనీ దేవి భక్తుల పాలిట కల్పవల్లి.
ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్ధాలు సిద్ధిస్తాయి.
రోగములు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆయురారోగ్యైశ్వర్యాలు కలుగుతాయి.
ఓం శ్రీ మాత్రే నమః
- సత్య వాడపల్లి