అఖిల జగత్తులకు మాతృమూర్తి
అంబికానాదినిధనాహరిబ్రహ్మేంద్
దేవి జగన్మాత, వాగ్రూపిణి, భూస్వరూపిణి, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తిస్వరూపిణి, రాత్రిరూపిణీ, నిద్రాస్వరూపిణి అయినది.
అఖిల జగత్తులకు మాతృమూర్తి. అమ్మ.
సకల విద్యలకు మూలరూపిణి లలిత. రుద్రాణ్యాత్మకమైన ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తుల సమిష్టి రూపమైన దేవి అంబిక.
రాత్రి లేదా నిద్రా రూపము గలది.
విశ్వ కోశము నందు ' కైతవ సిద్ధి, ఆకాశము, నిద్ర, రాత్రి, అంబిక' అని కలదు.
స్కాంద పురాణం నందు' మహాదేవి రాత్రిరూపిణి, మహాదేవుడు దివాస్వరూపుడు' అని తెలిపెను.
హరి వంశమందు'మాయ అనునది నిద్రగా లోకమందు కలదు.ఆమె దేహమే చీకటిని వెలువరించును, పగటిని నాశనము చేయును.
రాత్రి లోకమందలి జీవుల అర్ధ జీవమును మ్రింగి వేయును, అది అతి భయంకరమైనది. నిద్రకు సాటి ఎవరూ లేరు. విష్ణువు తప్ప ఆమె వేరే దేవతలు ఆమె వేగమును నిగ్రహింపజాలరు' అని చెప్పబడెను
మార్కండేయ పురాణములో ' సృష్టి స్థితి లయకారిణిని విష్ణువుతో సాటి లేని నిద్రను పూజ్యురాలిని స్తుతించెదను' అని కలదు.
ఆది అంతములు లేనిది దేవి కావున ఆమె అనాదినిధన, ఆద్యంతరహిత.
వరరుచి సిద్ధాంతం ప్రకారం "ద అనగా 8 అ అనగా 0 సంస్కృతమునందు అంకెలను ఎడమనుంచి పలుకుదురు కావున 08-80 గా మార్పు చెందింది, ఈ ఎనుబది అమృతవిఘాతములు, మరణసదృశములు.
అట్టి విఘాతములు లేనిది దేవి. ఉపాసించు భక్తుని ఇట్టి ఎనుబది విధములైన మృత్యు సాధనముల నుండి తొలగించునది దేవి.
ఈ ఎనుబది పాశ, వధ అని రెండు విధములు.
పాశ మరణములు 52, వధ మరణములు 28.
విష్ణుపురాణం ప్రకారం, అహంకారం వలన 28 విధములైన మరణములు జీవుని పీడించును.లింగ పురాణం ప్రకారం అవిద్య ద్వారా 52 విధములైన మరణములు సంభవించును
( వధ 28+పాశ 52 = 80)
వధ మరణములలో తుష్టి తొమ్మిది విధములు అవి
1. అష్టవిధ ప్రకృతులనుంచి విడివడినదను తుష్ఠి
2. సన్న్యాసదీక్ష పొందినదను ఉపాదాన తుష్ఠి
3. దుఃఖకారకములతోఏమి? అన్నింటికీ కాలము
వలననే ఫలము కలుగును అని కాలతుష్ఠి
4. ఫలం భగవదధీనం అని భాగ్యతుష్ఠి
5. శబ్దం వల్ల 6. స్పర్శ వల్ల 7.రూపం వల్ల 8.రసం
వల్ల. 9.గంధము వల్ల కలుగు ఆనందములు
సిద్ధులు ఎనిమిది విధములు
1.ఊహ(ఉపదేశం లేకుండా భావమును అవగాహన
చేసుకొనుట)
2. శబ్దం వినినంతనే దాని అర్ధమును తెలియుట
3. గురూపదేశంతో సత్యార్థం అధ్యయనం చేయుట
4. మంచి స్నేహితులను పొందుట
5. విద్వాంసులను, తపస్వులను శుశ్రూష చేయుట
6. ఆధ్యాత్మిక 7. ఆధిదైవిక 8. ఆధిభౌతికము
ఇవి కాక ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సనెడి పదకొండు బుద్ధి మాంద్యం వలన ధర్మరహితమైన సాధనములు.
ఈ ఇరువది ఎనిమిది మరణసాధనముల వలన జీవి రాబోయే జన్మలలో గ్రుడ్డి తనము, చెవిటి తనము, మూగతనము, అంగవైకల్యములు సంభవించును.
పాశ మరణములు 52 రకములు పాశము తో కూడిన ఆశ అహంకారం ఉన్నంత కాలం మరణం ఆవశ్యం. కానీ ఆ ఆశ భగవంతుని పొందాలని భావించిన అట్టి మరణమును లలితా దేవి తొలగించి అనుగ్రహం ప్రసాదించును.
వాయు పురాణం నందు"ఎనిమిదవ సృష్టి అయిన అనుగ్రహము నాలుగు విధములు
1.విపర్యయము - వృక్షాదిస్థావరసృష్టి
2.అశక్తి - పశుపక్ష్యాది సృష్టి
3. సిద్ధి - మనుష్య సృష్టి
4. తుష్టి - దేవతల సృష్టి" అని చెప్పబడెను
విష్ణు బ్రహ్మ ఇంద్రాదులచే సేవింపబడునది. ఆమెను సేవించియే పదవులను పొందిరి.
శ్రీ చక్రనగరమందు పద్దెనిమిది పదిహేడు ప్రాకారములలో విష్ణువు, పదిహేడు పదహారు ప్రాకారాల మధ్యలో బ్రహ్మ కు పధ్నాలుగు పదునైదు ప్రాకారాల మధ్యలో ఇంద్రలోకపాలురకు దేవిని సేవించుటకై ఏర్పరచబడిన నివాసస్థానములు.
దేవీ భాగవతము లో బ్రహ్మ విష్ణు శంభువులు, ఇంద్ర వరుణ తమ వాయు అగ్ని కుబేర త్వష్ట పూషులు
అశ్వనీ దేవతలు భగుడు ఆదిత్యులు వసువులు రుద్రులు విశ్వదేవతలు మరుద్గణములు అందరూ సృష్టి స్థితి లయకారిణి అయిన దేవిని ధ్యానించుచున్నారు"అని చెప్పబడెను.
విష్ణుబ్రహ్మదులే దేవిని యాచించువారై ఉండగా వారిని యాచింపక దేవిని యాచించువారు సర్వార్థ సిద్ధిని పొందుచున్నారు. మోక్షము పొందుతున్నారు.
శ్రీ మాత్రే నమః