కాలమే కొలబద్ద
కనత్కనక తాటంకా లీలావిగ్రహధారిణీ.
సృష్టి స్థితి మరియు లయములకు కొలబద్ధ ఏమిటి ..!? అంటే, కాలమే కొలబద్ద.
కాల గమనము సూర్యమానము మరియు చంద్రమానము. కనుక, కాల గమనమునకు సూర్యచంద్రులే ఆధారం.
ప్రకాశిస్తున్న బంగారపు తాటంకములుగా, సూర్యచంద్రులనే అమ్మవారు ధరించి ఉన్నారు.
కణత్ అంటే ప్రకాశం.
మంత్ర లక్షణమే ప్రకాశమూ మరియూ తేజస్సు.
హిరణ్యవర్ణం. సువర్ణమయమైన తేజస్సు. అదే కనత్కనక.
తాటంకము అనగా దీర్ఘ అక్షరము అని పేరు.
సాగదీసి చెప్పేది. దాని యొక్క తేజస్సుయే కణత్.
'ఓం' దీర్ఘ అక్షరం. దాని యొక్క తేజస్సు కనుక తాటంక అనగా ఓంకార రూపిణీ.
గుప్త ప్రణవము నుండి మహా ప్రణవము వరకు ఉన్న బీజాక్షర రూపిణీ.
అలా అందమైన తల్లి లీలతో విగ్రహాన్ని ధరిస్తున్నది. కనుక లీలావిగ్రహధారిణీ.
లీల అనగా స్వతంత్రముగా మరియు అనాయాసంగా చేయటం.
మన రూపం మనం ధరించటానికి ఎన్నో ఆయాసాలు పడ్డాం. ఇది నిలుపుకోవటానికి ఆయాసం. అయినా ఇది నిలవదు.
మన కన్నతల్లి మన దేహాన్ని ధరించింది. కానీ, ఆ దేహాన్ని ఎప్పుడో ఒకప్పుడు వొదలవలసింది మాత్రం మనమే.
కానీ, దుర్గామాత యొక్క స్మరణము వల్ల అపమృత్యు భయం ఉండదు.
తన భక్తులను, మృత్యువు నుండి విడిపించి అమృతమయం వైపుకు తీసుకుపోతుంది దుర్గామాత.
ఈ శ్లోక పారాయణమే అత్యంత ఫలప్రదం.
ఈ శ్లోక పారాయణ వల్ల కాలగతిలో మన జాతకరీత్యా మనం ఎదుర్కోవాల్సిన దోషములు అన్నీ తొలగిపోతాయి.
కనత్కనక తాటంకా లీలావిగ్రహధారిణీ,
శ్రీ కనకదుర్గా దేవతా పరదేవతా నమోస్తుతే