కృష్ణుడు ఇలాగే ఉంటాడని మొదట చిత్రించినవారెవరు?
కృష్ణుడు ఇలాగే ఉంటాడని మొదట చిత్రించినవారెవరు?
లక్ష్మీ రమణ
కృష్ణుడు ఎంతో మనోహరంగా ఉంటాడు . ఆయన చిత్రాలని చూస్తూ ఆయన మోములోని లావణ్యానికి చిత్తై, మనం కూడా ఒక చిత్తరువై అలా నిలబడిపోతామంటే అతిశయోక్తి కాదు. చేతిలో పిల్లనగ్రోవితో , తలపైన నెమలి పింఛముతో , ఆ కనులలో అంతులేని కరుణ, వాత్సల్యాలతో నీలమేఘశ్యాముడు చిత్తరువుతోనే చిత్తాన్ని దోచుకోవడం ఖాయం . కానీ నిజంగా కృష్ణుడు ఇలాగ ఉండేవారా ? అసలు ఆయన ఇలా ఉంటారు అని ఒక చిత్తరువు రూపంలో రాసి ఈ జగతికి అందించిన వారెవరు? దివి పారిజాతాన్ని సాధించి తెచ్చిన మహావీరుని రూపావిలాసాలు ఇంతటి లావణ్యంగా, సుకుమారంగా ఉండేవా ?
నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళిపరిసర్హితపించమువాడు నవ్వు రా-
జిల్లెడుమోమువాడొకడు చెల్వలమానధనంబు దెచ్చె నో
మల్లియలార మీపొదలమాటున లేడు గదమ్మ చెప్పరే
నల్లనివాడు, పద్మములవంటి కన్నులు గలవాడు , కృపారసాన్ని ఒలికించే చూపులు గలవాడు , నెమలి పింఛాన్ని ధరించి ,చక్కని చిరునవ్వులు చిందించే మోము గలవాడైన ఆ చిలిపికృష్ణుడు మీ పొదలమాటునేమైనా దాగి ఉన్నాడా ? ఓ మల్లెలలారా కాస్త ఆ మనోహరుని జాడని మాకు చెప్పి పుణ్యం కట్టుకోరూ అని గోపికలంతా మల్లెపొదలని వేడుకున్నారట . ఈ పద్యం భాగవతంలోని పోతనగారి తెలుగు సేత. ఆ విధంగా కృష్ణుడుంటాడని పోతన గారు కూడా చూడలేదు కదా !
మరి ఎవరు కృష్ణుని రూపు ఇంత మనోహరంగా ఉంటుంది అని వర్ణించింది అంటే, అర్జనుడు , సుభద్రల కొడుకు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర . ఆమె మహాభారతంలోని పాండవుల అజ్ఞాతవాసంలో మనకి కనిపిస్తుంది. బృహన్నలగా విరాటరాజు కూతురికి నాట్యాన్ని బోధిస్తాడు కదా అర్జనుడు. అలా అర్జనుడికి నాట్య శిష్యరికం చేసింది ఈ ఉత్తర .
కృష్ణనిర్యాణం తర్వాత, ద్వారకా సముద్రుని పాలై పోయిన తర్వాత , ఆ కన్నయ్య ఇలా ఉంటాడని ఉత్తర వర్ణిస్తుంటే, కృష్ణుని మనుమడైన వజ్రనాభుడు ఆయన రూపాన్ని చిత్రించాడు . అదే కృష్ణుని తోలి చిత్రం . ఆ వజ్రనాభుడే ,గుజరాత్ రాష్ట్రంలో , గోమతీ నది , అరేబియా సముద్రంలో సంగమించే చోట జగత్ మందిర్ నిర్మాణాన్ని చేశారు . ద్వారక లోని ఈ ద్వారకాధీశుని దేవాలయాన్ని విశ్వ పుణ్యక్షేత్రం అని పిలుస్తారు. హరిగృహం (శ్రీకృష్ణుడు నివసించిన ప్రదేశం) ఉన్న ప్రదేశంలో అతను ఈ ఆలయాన్ని నిర్మించారని , ఇక్కడి ప్రతి ధూళికణమూ ఆ పరమాత్ముని పాదస్పర్శతో పునీతమైనదేనని ఇక్కడి వారు చెబుతారు .
కాబట్టి, ఉత్తర, అర్జనులు ఖచ్చితంగా కృష్ణ దర్శనం చేసుకున్నవారు! ఆమె వివరణలో రూపుదిద్దుకున్న భగవానుడి రూపం కాబట్టి, ఆ మురళీలోలుడు ఇలాగే ఉండేవారని భావించవచ్చు .