రుక్మిణీ కళ్యాణం చదివితే , త్వరగా పెళ్లవుతుంది.
రుక్మిణీ కళ్యాణం చదివితే , త్వరగా పెళ్లవుతుంది.
సేకరణ : లక్ష్మి రమణ
రుక్మిణీ కళ్యాణం చదివితే , త్వరగా పెళ్లవుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజానికి రుక్మిణీ కృష్ణుల అన్యోన్యతలో అనంతమైన ప్రకృతీ , పరమాత్మల పరమార్థం దాగుంది . రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని చూడండి . భాగవతంలో రుక్మిణీ కల్యాణానికి విశేష ప్రాధాన్యముంది. ఈ ఘట్టం చదివినా, విన్నా కలిగే ఫలితం ‘ఇది’ అని చెప్పడానికి మాటలు చాలవు. అందుకే పెద్దలు ఆమాట చెబుతారు . ఇందులో పాఠకులకు లౌకిక, వేదాంతపరమైన రెండు అర్థాలు గోచరమవుతాయి. ప్రేమ, అనురాగం, మమకారం, ఆదరణ లాంటి సున్నిత విషయాలు అంతర్గతంగా ఉన్నాయి.
తన జీవన సహచరుడు ఎలా ఉండాలో కచ్చితంగా నిర్ణయించుకునే శక్తి స్త్రీలకే ఉంటుందని దమయంతి వంటి అనేక పురాణ పాత్రల వల్ల తేటతెల్లమవుతుంది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో మొగమాటాన్ని కాస్త సడలించి, తెగింపు జోడిస్తే ఆశించిన విజయాలు కలుగుతాయని ఆ వనితలు నిరూపించారు. రుక్మిణీ కల్యాణ ఘట్టంలో పై విషయాలు మరింత స్పష్టంగా గోచరమవుతాయి. రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ని వలచింది. ఆ వలపును పండించుకోవడానికి ఆమె చూపిన తెగువ అన్ని కాలాల ప్రేమికులకూ ఆదర్శప్రాయం. త్వరగా నిర్ణయం తీసుకోవడం, అంతలోనే ఒక నిశ్చయానికి రావడం, వచ్చిన వెంటనే అమలు పరచకుండా ‘ఎందుకైనా మంచిది’ అంటూ మళ్ళీ మరోసారి ముందు వెనకలుగా ఆలోచించడం పురుషుడి లక్షణం. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది స్త్రీల లక్షణం. ఒక పట్టాన నిర్ణయానికి రారు. వచ్చిన తరవాత వెనుతిరిగి చూడరు. వారు తీసుకునే నిర్ణయంలోని గాఢత, స్పష్టత అలాంటిది.
ఆ ఘట్టంలో ఆమె కృష్ణుడికి పంపిన సందేశంలో ‘ముకుందా! గుణవతి, స్థిరచిత్త అయిన ఏ స్త్రీ అయినా గుణం, రూపం, శీలం, విద్య, వయసు, ధనం, తేజస్సుల చేత శ్రేష్ఠుడైనవాడినే భర్తగా కోరుకుంటుంది. అందులో నీకు నీవే సాటి అయిన నిన్ను తప్ప ఇతరులను నేను కోరుకోకపోవడంలో తప్పులేదని నా భావన’ అని పేర్కొంది.
రుక్మిణి అనే పదానికి ‘ప్రకృతి’ అనేది ఒక అర్థం. ప్రకృతి పురుషుడి ఆలంబన వల్ల, పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరికొకరు రాణిస్తారు. కృష్ణుడు పూర్ణ (పురాణ) పురుషుడు, రుక్మిణి ప్రకృతి. వారు ఒకర్నొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వల్లనే గాఢంగా ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనే గాఢవాంఛ కలవారయ్యారు.
సాధకుడు భగవంతుణ్ని చేరాలని ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడనేది దీని భావం. జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైంది.రుక్మిణి సాధకుడిలోని జీవ చైతన్యానికి సంకేతం. కృష్ణుడు పరమాత్మ తత్వానికి ప్రతీక. జీవతత్త్వం, పరమాత్మ తత్త్వం ఒకదాన్ని మరొకటి విడిచి వేరుగా ఉండనివని, రెండింటికీ అనుసంధానంగా ఉండేది ఒక్క ప్రేమ తత్త్వమేననీ రుక్మిణీ కృష్ణుల పరిణయాసక్తికి అర్థం.
జీవుడు బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తే, ప్రకృతి కల్పించే మాయాబంధం నుంచి తప్పించి, అజ్ఞానానికి వశం కాకుండా కాపాడమని చేసే నిరంతర జ్ఞానసాధనే రుక్మిణి- అగ్నిద్యోతనుడి చేత సందేశం పంపడంలోని అంతరార్థం. ఆ సందర్భంలో ఆమె ‘భువన సుందరా’ అని సంబోధించింది. ఇక్కడ భువనమంటే సకల చరాచర జగత్తు. వాటన్నింటిలో సుందరుడు అంటే ఆనందం కలిగించేవాడు. సహజమైన ఆనందం దూరమైతే అవ్యక్తానందాన్ని అలౌకిక ఆనందాన్ని కలిగించేవాడు భగవంతుడొక్కడే. అందుకే అలా సందేశం పంపింది.