Online Puja Services

కర్మ ఫలం

18.188.219.131

కర్మ ....

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.. 

ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు..? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు..? ఈరోజు తనకి వంద మంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు...

"ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు.. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. 

యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు).. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించిన వాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మ బంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది.., వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింప చేస్తుంది.. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 

ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు.. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి.. "ఓ రాజా! వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు... అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డ పనితో తుడిచి పెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం.. 

    ఓం నమో భగవతే వాసుదేవాయ 

- పాత మహేష్

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore