Online Puja Services

రహస్యం

3.15.228.162

రహస్యం

మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు.మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. 

*కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ? ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ? ఇవన్నీ ఎందుకు జరగలేదు ? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగానే వస్తాయి.*

వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు.. 

ఉద్ధవుడు : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా.., ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?

*కృష్ణుడు* : ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా.

ఉద్ధవుడు : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?

*కృష్ణుడు* : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను.

ఉద్ధవుడు : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో , చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?

*కృష్ణుడు* : ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి.. నాకు తెలీదు అనుకోని, తప్పులు చేస్తుంటారు ఆ తప్పుల కర్మ ఫలాన్ని అనుభవిస్తూ దుక్కిస్తుంటారు. నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గుర్తించి స్మరించి ... కర్మని ఆచరించండి ... అప్పుడు ఆ కర్మ ఫలం ఎంత మధురంగా ఉంటుందో చూడండి ..

అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే..
మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం. 

అన్నింటిని అంగీకరించటమే కృష్ణ తత్వం...

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore