Online Puja Services

ఏడు వారాల అధిపతులైన ఏడు గ్రహాలు - వాటి ఆరాధన

3.142.200.102

ఏడు వారాల అధిపతులైన ఏడు గ్రహాలు - వాటి ఆరాధన . 
- లక్ష్మి రమణ 

గ్రహాలు తొమ్మిది . ఈ తొమ్మిది గ్రహ గతుల ప్రభావం మానవుల దైనందిన జీవితం మీద ఉంటుందని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం. అయితే, కాల గణనలో కీలకమైన వారం లోని ఏడు రోజులకూ వీరిలో ఏడుగురు గ్రహాలు అధిపతులుగా ఉండడం విశేషం . కాలహారంలోని మణి పూసల్లాంటి ఈ వారాలకి అధిపతులైన గ్రహాల గురించి స్థూలంగా తెలుసుకుందాం . 

ఆదివారం - ఆదిత్యుడు  

వారాలలో మొదటిది ఆదివారం . ఆదివారం ఆంగ్లేయుల పుణ్యమా అని ఆటవిడుపు వారంగా ప్రసిద్ధిని పొందింది. నిజానికి ఇది చాలా గొప్ప రోజు.  ఈ వారానికి అధిపతి సూర్యుడు. ఆదిత్యుడు.  ఆది అంటే మొదటిది అని అర్థం కదా!  ఉషస్సులో లోకానికి తొలిత కనిపించేవాడు సూర్యుడే!  అందుకే అతడు వారాధిపతి. ఈ రోజు సూర్యారాధన చక్కగా చేసుకోవడం ఆరోగ్యాన్ని అందిస్తుంది . రామాయణంలోని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పరిశీలిస్తే, సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా, విజయప్రదాతగా దర్శ నమిస్తారు. అగస్త్య మహర్షి రాములవారి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు.  కనీసం ఆదివారమైనా, ఈ ఆదిత్యస్తోత్రాన్ని ఖచ్చితంగా చేసుకొనేలా అలవాటు చేసుకోవడం గొప్ప ఫలితాలనిస్తుంది . 

సోమవారం - సోముడు 

సోమవారానికి అధిపతి చంద్రుడు.  సోముడు అంటే అమృతాన్ని పంచేవాడు. చంద్రుడు మనకి అందించే  వెన్నెల అమృతమే కదా ! మన శేరీరంలోనూ చంద్రస్థానం నుండీ వర్షించే అమృత బిందువుని ఖేచరీ ముద్రతో పారణ చేయమని చెబుతుంది యోగశాస్త్రం . చంద్రుడి వెన్నెల ఎన్నో ప్రాణప్రదాలైన ఓషధులను బ్రతికిస్తోంది. సూర్యకాంతిని అద్దంలా ప్రతిఫలించే చంద్రుడు అమృత కిరణాలను భూమికి అందిస్తున్నాడు . అందుకే భూలోకానికి సూర్యుడి తరువాత చంద్రుడే ప్రాణదాత.  చంద్రుడు మనసును వికసింప చేస్తాడు . ఇంట్లో ప్రశాంతతకు, బంధాలలో ఆప్యాయతలు పెరగడానికి, మానసికమైన శాంతికి చంద్రుని ఆరాదించాలి. ఉమాసహితుడైన పరమేశ్వరుణ్ణి కూడా సోమవారం ఆరాధన చేయడం వల్ల సమాన ఫలితాలు కలుగుతాయి . 

మంగళవారం - మంగళుడు (కుజుడు)

మంగళవారానికి అధిపతి కుజుడు.  ఇతన్ని అంగారకుడు/ మంగళుడు  అని కూడా పిలుస్తారు.  కుజ శబ్దానికి భూమి నుంచి పుట్టిన వాడు అని అర్థం ఉంది. ఎర్రగా ఉన్న కారణంగా కుజ గ్రహాన్ని అరుణగ్రహమని కూడా పిలుస్తారు.  అంగారకం అంటే నిప్పు.  నిప్పులా ఎర్రగా ఉంటాడు కనుక, అంగారకుడు అని పిలుస్తారు.  మంగళం అంటే శుభమే కదా! ఈ గ్రహాన్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.  అంగారకుడు భూమి పుత్రుడు అనే విశ్వాసం అనాదిగా ఉంది. ఈయన ఆరాధన వలన వివాహాలు జరుగుతాయి . సంతానం ప్రాప్తిస్తుంది . రుణబాధలు తీరిపోతాయి . సకల శుభాలనూ అనుగ్రహిస్తాడు అంగారకుడు . కుజదోషం ఉన్నప్పుడు, అంగారకాధిపతి అయిన సుబ్రహ్మణ్య ఆరాధన మంచి ఫలితాలని అనుగ్రహిస్తుంది. 

బుధవారాధిపతి - బుధుడు : 
 
బుధవారానికి అధిపతి బుధుడు. ఈయన చంద్రుడి పుత్రుడని పురాణాలు చెబుతున్నాయి.  బుధుడు అంటే జ్ఞాని, పండితుడు  అని అర్థం.  అయితే, గ్రహాలుగా వాటి ఫలితాల పరంగా ఆలోచిస్తే, బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే ఆయన ప్రతిఫలిస్తాడని జ్యోతిషశాస్త్రవేత్తలు చెబుతారు . 

గురువారాధిపతి -  దేవగురువు బృహస్పతి:
 
బుద్ధి కుశలతకు మారుపేరైన బృహస్పతి అనుగ్రహం ఉంటే సకల విద్యలు అలవాడతాయని విశ్వాసం. సౌర మండలంలో అతిపెద్ద గ్రహం. ఈ రోజున గురుపూజ చేసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది . సాయిబాబాని ఆరాధించవచ్చు. దక్షిణామూర్తి , దత్తాత్రేయుడు తదితర గురుస్వరూపారాధన చేయడం వలన జ్ఞాన సిద్ధి కలుగుతుంది . సర్వకార్యాలలోనూ విజయం కలుగుతుంది.  

శుక్రవారానికి అధిపతి - శుక్రాచార్యుడు: 

శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. నీతివేతల్లో  అగ్రగణ్యుడని పేరొందినవాడు. మృత సంజీవిని విద్య తెలిసినవాడు.  ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగేవాడు. వేగుచుక్కగా వెలిగే ఈయన్ని అందరూ  కొలుస్తారు. ఈయన గొప్ప మార్గనిర్దేశకుడు . లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని మార్గాలుంటాయో, అన్నిమార్గాలలో ఉత్తమమైన దానిలో అనుసరించేవారు  శక్తిని బట్టి  నిర్దేశించగలిగిన గొప్ప గురువు శుక్రాచార్యుడు.  ఆయన అనుగ్రహం ఉంటె, ఇక భవిష్యత్తుకి తిరుగేలేదు. శుక్రవారం నాడు ఈ గ్రహాధిపతి అయిన అమ్మవారిని ఆరాధించడం వలన ధనం , శక్తి సిద్ధిస్తాయి .  

శనివారం అధిపతి - శనీశ్వరుడు . 

శనీశ్వరుని గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది . అందుకే ఈయన్ని మందగమనుడని పిలుస్తారు. శనివారం దుర్ముహూర్తం ఉంటుంది, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవమని పెద్దలు చెబుతూ ఉంటారు. 

ఈయన  ఛాయా దేవి ,  సూర్యదేవుల  పుత్రుడు . నల్లని వాడు యమధర్మరాజు యమునా ఇతని సోదర సోదరీమణులు.  ప్రాణుల పాప ప్రాణుల పుణ్య పాపాలకు ఫలాలను వెంటనే ప్రసాదించే వాడిగా శనేశ్వరుడికి పేరు ఉంది. శనీశ్వరుణ్ణి ఆరాధిస్తే చెడు తొలగిపోతుంది. 
శనీశ్వరుని ప్రభావం నుండీ రక్షించే వేంకటేశ్వరుని ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం మంచి ఫలితాలనిస్తాయి .  

వీరే వారంలో ఏడు రోజులకీ అధిపతులైన ఏడు గ్రహాలు. మిగిలిన రాహువూ , కేతువూ అనే గ్రహాలున్నా వారు గ్రహణ సమయాల్లో తప్ప వారాధిపతులుగా మనకి కనిపించరు. ఇలా ఏ వారానికి అధిపతి అయిన గ్రహాన్ని ఆ నాడు  తలుచుకుని పూజించడం, వారి అనుగ్రహాన్ని కోరడం మానవ జీవితానికి శ్రేయస్సుని చేకూరుస్తుంది. శుభం .   

#graha #aradhana

Tags: navagraha, graha, aradhana

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya