Online Puja Services

శివాలయాలలో ఈ రాహుముఖుని దర్శనం చేస్తున్నారా ?

3.146.206.246

భారతీయులు కళా ప్రియులు. ధార్మికావలంబకులు. మన దేశంలో ఎన్నో పవిత్రమైన ఆలయాలున్నాయి. ఆ ఆలయాలలో ఒక శిల్పం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అన్ని ఆలయాలలో ఉండే శిల్పమే అని కొట్టిపారేసినా, దీనివెనుక ఉన్న కథ తెలిసిన వారు, ఆ శిల్పాన్ని కీర్తి ముఖం అనే పేరుతొ గుర్తిస్తారు. అసలు ఏమిటీ కీర్తి ముఖం ప్రత్యేకత ? రాహువుకీ కీర్తి ముఖునికీ ఏదైనా సంబంధం ఉందా ?

పద్మ పురాణంలోనూ, స్కంద పురాణంలోనూ ఈ కీర్తి ముఖుని గురించిన వివరణ మనకి కనిపిస్తుంది. శివపురాణం కూడా జలంధరుడు అనే రాక్షసుడు, పరమేశ్వరుల మధ్య జరిగిన యుద్ధాన్ని తెలియజేస్తుంది. జలంధరుడు శివుని త్రినేత్రం నుండీ రాలిన అగ్గిరవ్వ. ఆ అగ్గిరవ్వ సముద్రగర్భంలో పురుడుపోసుకొని ఈ రాక్షసుడిగా అవతరించింది. వార గర్వంతో విర్రవీగుతూ దేవతలందరినీ జయించిన ఆ జలంధరుడికి పార్వతీదేవి అమ్మ లాగా కాక అప్సరసలాగా కనిపించింది.బూడిద పూసుకొని శివుని కన్నా, సురలోకాలనేలుతున్న తన దగ్గర ఆమె ఉండాలని కోరుకున్నాడు. ఆమెని చేపట్టాలనే ఉద్దేశ్యంతో చెప్పాల్సినవన్నీ చెప్పి ఈశ్వరుని దగ్గరికి రాయబారిగా రాహువును పంపాడు.

అసలే ఆయన రాహువు. ఆపైన దైత్య రాజరాజు తన మధ్యవర్తిత్వం కోరుకున్నాడు. ఇకనేం, దేవతలా మీద తనకున్న అక్కసునంతా రంగలించి మరీ, మహా ధూర్తత్వంతో "బూడిద పూతల వల్లకాటివాసా! భూతప్రేత సహవాసా! లోకోత్తర సౌందర్యరాశి అయిన గిరిసుతని నీ గుప్పెట ఎలా ఇరికించావో గాని, ఆమెకు నువ్వు ఎంత మాత్రం తగవు! అసలు నీలాంటి విరాగి; తిరుగుడు దేవరకు గౌరి దేనికి? అనవసరంగా భార్యని కలిగిఉన్నావు. రత్నాకర పుత్రుడైన జలంధరునికి ఆమెని సమర్పించుకో!" అన్నాడు.

అంతే, ఆ మాటలకి పరమేశ్వరుని కోపం తారాస్థాయికి చేరింది. తానూ తండ్రినయ్యి జన్మ నిచ్చిన బిడ్డకి తల్లి అయినా పార్వతీ మాతని అటువంటి నీచపు బుద్ధితో జలంధరుడు చూడడం, రాహువు తగుదునమ్మా అంటూ మధ్యవర్తిత్వానికి పూనుకోవడం క్షమించరాని నేరం. శివుడు మూడో కన్ను నుండీ తీక్షణమైన ఒక జ్వాల ఒక సింహం వంటి ఆకారం జన్మించింది. అది రాహువుని చంపేలోపు, రాహువు శరణు వేడాడు.

బోళా శంకరుడు సరే, వదిలేయమన్నాడు. కానీ తనకు ఆకలిగా ఉందని ఆ ఆకారం అంటే "నిన్ను నీవే తిను" అని శివుడు అన్నారట. వెంటనే ఆ సింహా కారం తన అన్ని అవయవాలను తినేస్తుంది. చివరకు తల మాత్రమె మిగులుతుంది. అప్పుడు శివుడు దాన్ని మెచ్చుకుని నీవు కీర్తించ బడతావు అని అనుగ్రహించారు. అంతేకాక, తన భక్తులు శివాలయం ప్రవేశ ద్వారం వద్ద ఉండే ఈ సింహముఖం ఉన్న కీర్తి ముఖం చూసి తర్వాత లోనికి వెళతారు అని కూడా చెప్తారు.


ఇందులో అంతరార్ధం భక్తులు తమ అహం,పాపాలు తనకు తానూ భక్షించిన కీర్తిముఖం కి అప్పగించి, పరమాత్మకు సర్వశ్య శరణాగత భావంతో భగవంతుని దర్శనానికి వెళ్లాలని.

ఈ కీర్తిముఖ శిల్పాన్నే గ్రాసముఖం / రాహుర్ముఖం అని కూడా పిలుస్తారు. ఇవి గోపురం అంచులలో, గవాక్షాల పైన, అంతరాలయం సోపానాల అంచులలో,కమానుల్లో, స్తంభాల పైన చెక్కుతారు. సింహం ముఖం ఉండటం వల్ల సింహముఖ అని కూడా పిలుస్తారు. రెండు కొమ్ములు, బైటికి పొడుచుకు వచ్చిన గుండ్రని కనుగుడ్లు,పెద్దగా తెరుచుకుని ఉన్ననోరు కనిపిస్తుంది. మొత్తానికి భీతి గొలిపే ఆకారం ఇది. హంపిలో, బృహదీశ్వర ఆలయం లో, వరంగల్ కాకతీయుల శిల్ప కళలో ఒకటేమిటి అన్ని చోట్ల ఇది మీకు కనపడుతుంది. వ్యాళము లాగా ఇది కూడా రక్షణ కోసం గుడుల బాహ్య ప్రాకారాల పైన కూడా కొన్ని చోట్ల చెక్కుతారు.

చైనా (Taotie),జపాన్ (Oni), కొరియా (Gamyeon), ఇండోనేసియా (kalamakara) లలో కూడా ఇటువంటి జంతుముఖం ప్రార్ధనా స్థలాల పైన చెక్కి ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో "ఒని -Oni" కి కీర్తిముఖానికి పోలిక బాగా కనిపిస్తుంది.

అదీ కీరి ముఖుని వృత్తాంతం. ఈ సారి దేవాలయానికి వెళ్ళినప్పుడు, ప్రత్యేకించి, శివాలయానికి వెళ్లినప్పుడు ఈ కీర్తి ముఖుని దర్శనం తప్పకుండా చేసుకోండి.

శుభం !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi