కాలానికి, మహా పాతకాలకి కూడా కాలభైరవుడు అధిదైవం
కాలానికి, మహా పాతకాలకి కూడా కాలభైరవుడు అధిదైవం ఎలా అయ్యారు ?
- లక్ష్మి రమణ
కాలభైరవ ఉపాసన చాలా మహిమాన్వితమైనది. కాలభైరవుని ఉపాసించిన వారికి తీరని కోరిక అనేది ఉండదు. కొలిచినవారికి కొంగుబంగారమయి నిలిచే కాలాభైరవుని చూసి మహాపాతకాలు కూడా దూరంగా పారిపోతాయట. బ్రహ్మహత్యాపాతకం కూడా కాలభైరవ స్వామిని చూసి దూరంగా పారిపోతుందని పరమేశ్వరుడే స్వయంగా వరాన్ని అనుగ్రహించారని కాశీఖండం తెలియజేస్తుంది . అటువంటి విశేషమైన కాలభైరవ ఆవిర్భావాన్ని గురించి అగస్త్యునికి స్వయంగా కార్తికేయుడు ఇలా వివరిస్తున్నారు .
పూర్వం మేరు శృంగం లో బ్రహ్మ దేవుడు ఏకాంతం గా తపస్సు చేస్తున్నారు. అప్పుడు మహర్షులు ఆయన దగ్గరకు వెళ్లి “ బ్రహ్మదేవా మీరీవిదఃముగా ఏకాంతంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అప్పుడు బ్రహ్మగారు ‘’నేను జగత్సృష్టికర్తని. జగత్తును సృష్టించి, పోషించి, లయం చేస్తుంటాను. నేనే స్వయంభు ని .సర్వేశ్వరుడిని .జగాలన్ని నా అధీనంలోనే ఉన్నాయి. నా కంటే గొప్ప దేవుడే లేడు’’ అని ప్రగల్భాలు పలికాడు. అప్పుడు నారాయణాంశతో అవతరించిన క్రతువు బ్రహ్మతో “అయ్యా! మీరు పర తత్వాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. నేను కర్తను ,నారాయణుడిని ,యజ్న స్వరూపుడను .’’అన్నాడు. ఈ విధంగా ఆ ఇద్దరికీ వాగ్వాదం జరిగింది.
అప్పుడు చతుర్వేదాలలో ప్రవీణులైన విప్రులను సాక్షులుగా పిలిపించి వారి సమక్షంలో వాగ్వివాదాన్ని కొనసాగించారు. వేదములే జగత్తుకి ప్రమాణము. కనుక, వేదాలలో ఏమి చెప్ప బడిందో తెలియజేయమని వారిద్దరూ ఆ పండితోత్తములని కోరారు.
అప్పుడు వారు ఋగ్వేదం “ఈ సకల భూత గణం ఎక్కడి నుంచి వచ్చి ,మళ్ళీ ఎక్కడికి చేరుతుందో అదే పర తత్త్వంఅయిన రుద్రుడు” అని చెబుతున్నది అన్నారు. యజుర్వేదం “ఎవరు యజ్ఞాధిపతిగా ఉన్నారో , ఏ యోగం చేత అర్చింప బడే వాడేవ్వడో, ఎవరు అందరికి ప్రమాణమో ఆయనే సర్వజ్ఞుడైన శివుడు” అని చెప్పింది. సామవేదం “ఎవరి చేత విశ్వ భ్రమణం జరుగుతోందో, యోగులెవరిని గూర్చి నిత్యమూ చింతిస్తూ ఉంటారో, ఎవరి కాంతి చేత ఈ విశ్వం ప్రకాశిస్తుందో ఆయనే పరమ శివుడైన త్రయంబకుడు” అన్నది. అధర్వవేదం “దేవేశ్వరుడెవరో, కైవల్య స్వరూపుడెవరో అతడే దుఃఖములని నాశనం చేసేటటువంటి శంకరుడు” అని చెప్పింది అని ఈ విధంగా చతుర్వేదాలలో ఉన్న విశ్వేశ్వర తత్వాన్ని వివరంగా చెప్పారు.
అప్పుడు బ్రహ్మా, క్రతువు లిద్దరూ హేళనగా “శ్మశానం లో విభూతి పూసుకొని దిగంబరం గా తిరిగే వాడూ ,ఎద్దునేక్కి తిరిగే వాడు, సర్పములే ఆభరణములుగా కలిగినవాడు ఎలా బ్రహ్మత్వం పొందుతాడు”అని ప్రశ్నించారు .
అప్పుడు అశరీరవాణి “పరమేశ్వరుని తెలుసు కోవటం అంత సులువైన పని కాదు. లీలా రూపంతో ఆ సర్వేశ్వరుడు నాట్యమాడుతుంటాడు. ఆయన స్వయం జ్యోతి, సనాతనుడు, ఆనంద స్వరూపుడు” అని చెప్పింది. అయినా బ్రహ్మ అజ్ఞానం నాశనం కాలేదు. అప్పుడు ఒక జ్యోతి వారి ముందు ప్రత్యక్ష మైంది. అది భూమ్యాకాశాలను ఆక్రమించింది. జ్యోతిర్మండలమైన పురుషాకారంతో అది బ్రహ్మకున్న ఐదో శిరస్సును తగులబెట్టింది. తరువాత ఆ జ్యోతి శివరూపం చెంది ప్రత్యక్షమైనాడు.
అయినప్పటికీ బ్రహ్మ అహంకారం చావలేదు. “పూర్వం నువ్వు నా ఫాలభాగం నుండి పుట్టావు. కనుక నువ్వు నన్ను శరణు వేడు. నేను నిన్ను రక్షిస్తా” అని గర్వంగా అన్నాడు. అప్పుడు కోపంతో మహా భైరవా కారాన్ని శివుడు తన నుంచి సృష్టించాడు .
“ కాలభైరవా ! నువ్వు కాలాన్నే శాశించేవాడివి. కాలమే నిన్నుచూసి భయపడుతుంది. పాప భక్షకుడివి నువ్వు. కాశీకి క్షేత్రపాలకుడివి , రక్షకుడివి ” అని కాలభైరవుని ఆశీర్వదించారు . భైరవుడు తన ఎడమ చేతి బొటన వ్రేలితో బ్రహ్మ ఐదో తలను గిల్లి వేశాడు. భయపడిన బ్రహ్మ శత రుద్రీయాన్ని పఠించాడు. అప్పుడు శాంతించిన శివుడు బ్రహ్మను ఓదార్చి, కాల భైరవుని తొ ‘’నువ్వు యజ్ఞాలలో మాన్యత్వాన్ని పొందుతావు .బ్రహ్మ కపాలాన్ని చేతి లో ధరించి ,బ్రహ్మ హత్యా దోషం పోవటానికి తపస్సు చెయ్యి .’’అని చెప్పాడు .
ఆ శివుడు బ్రహ్మహత్య అనే పేరుకల కన్య ను సృష్టించాడు. ఆమె ఎర్రనిది. యెర్రని వస్త్రాలు, యెర్ర చందనం ధరించి, కోరలతో కూడిన విశాల మైన నోటితో వ్రేలాడే నాలుకతో, ఒక కాలు పైకెత్తి రక్త పానం చేస్తూ ఖడ్గం రక్త పాత్ర ,తల పుర్రె చేతుల్లో ధరించి అందర్ని భయ భ్రాంతులను చేసింది. శివుడు కాలభైరవునితో ‘’నువ్వు అన్ని ప్రదేశాలలో తిరిగే అధికారం కల వాడివి .ఈమె తొ నీకు కావాల్సిన పని చేయించుకో ‘’అని చెప్పి అంతర్ధానమయ్యాడు . ఆవిధముగా కాలానికి మాత్రమే కాకుండా, బ్రహ్మహత్యాది పాతకాలకి కూడా శాశకుడయ్యారు కాలభైరవుడు.
కపాలపాణియై, కాపాలికా వ్రతము ధరించి, భైరవుడు త్రిలోక సంచారి అయ్యాడు. కాశీలో కాలభైరవుడు నిరంతరం సంచరిస్తూ ఏ దోషాలు రాకుండా కాపాడుతాడు. అంతేకాకుండా, శరణన్నవారి వెంటే ఎల్లప్పుడూ ఉంటూ కోరినవన్నీ అనుగ్రహించే, దివ్యానుగ్రహ ప్రదాయకుడు శ్రీ కాలభైరవస్వామి. ఎప్పుడైతే, కాలభైరవుడు కాశీలో ప్రవేశించగానే ‘’బ్ర హ్మ హత్య ‘’భయపడి పాతాళ లోకానికి పారిపోయింది.
సర్వేజనా శుఖినోభవంతు !! శుభం !!