Online Puja Services

శివానుగ్రహం కోసం చదవాల్సిన శృతి విశేషం.

3.135.205.231

శివరాత్రినాడు లింగోద్భవకాలంలో శివానుగ్రహం కోసం చదవాల్సిన శృతి విశేషం.
- లక్ష్మి రమణ 
 
శరీరము, దానిని అంటిపెట్టుకొని ఉన్న బంధాలు, పాశాలు ఒక మాయ అని తెలిసినా ఆ మాయ పారడాని తప్పించుకోవడం అంత సులువైన విషయం కాదు. దానికి ఎంతో దీక్ష ,పట్టుదల,  నిగ్రహము, భగవంతుని యందు ప్రీతి ఉండాలి . ఒకవేళ అధిగమించినా, పరమేశ్వరుని పరీక్షని ఎదుర్కోక తప్పదు. ఒకప్పుడు అటువంటి పరీక్షలో మూనిపత్నులు మొహానికి చిక్కుకున్నారు . క్రోధాన్ని జయించాల్సిన మునులు   క్రోదాకాంత చిత్తులై పరమేశ్వరుని శపించారు. ఆ తర్వాత అహకారంతో బ్రహ్మ అసత్యమాడారు. కేవలం పైకి చూసేందుకు కనిపించే అర్థాన్ని మాత్రమే తీసుకొని అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న పరధర్మవాదులు తమ  వాదనకి మూలం అనుకుంటున్న ఈ ఉదంతం స్కాందపురాణంలోనిది . పరమేశ్వరుణ్ణి తండ్రి అని సంబోధించడానికి ఉన్న మూలం ఈ పురాణకథనం . దీనిని శివరాత్రినాడు ఖచ్చితంగా స్మరించుకోటం మంచిది . 
    
ఏ చెట్టూ లేకుండానే తొట్టతొలి విత్తు పుట్టింది . సృష్టి ఉంది కదా ! కాబట్టి పుట్టింది . ఎలా పుట్టింది ? ఆ విత్తుకి తండ్రి ఎవరు ? తండ్రి విత్తనమైతే తల్లి క్షేత్రం . ఆ విశ్వసృష్టికి కారణమైన తొలి విత్తు పరమేశ్వరుడు . ఆ అనంతుని అర్థం చేసుకోవడం నోటికొచ్చినట్టూ మాట్లాడినంత సులువు కాదు ! పురాణ వాగ్మయం వేద వాగ్మయానికి తీసుపోయేదికాదు. గొప్ప ధర్మాలని పామరులకు సైతం అర్ధమయ్యే రీతిలో, వేదాన్ని చదివిన భాగ్యాన్ని అందిచగలిగిన గొప్ప దార్శనికత తో దర్శించి మహానుభావులు వ్యాసుడు మనకి అందించారు. సూతమహర్షి వాటిని ఈ లోకానికి వినిపించారు . వాటి గురించి మాట్లాడేప్పుడు ఆ యా పురాణాలను ఆమూలాగ్రం చదివి అర్థం చేసుకొని ఆ తర్వాత మాట్లాడడం అవసరం . ఇంతకీ ఇంత చర్చకూ కారణమైన ఆ కథ ఇదీ !

పూర్వం ఒకనాడు పరమేశ్వరుడు భిక్షాటన కోసం దేవదారు వనానికి వెళ్లారు. ఆ వనంలో ఎంతోమంది నిష్టాగరిస్టులైన మనులు ఆశ్రమాలు నిర్మించుకుని, తమ తమ భార్యలతో ఉంటున్నారు. శివుడు ఆ వనానికి భిక్ష కోసం వచ్చేసరికి మధ్యాహ్న సమయం అయింది.  అప్పుడు ఋషులందరూ తీర్థంలో స్నానం చేయడం కోసం వెళ్లారు.  వారి కుటీరాలలో కేవలం వారి భార్యలు మాత్రమే ఉన్నారు. శివునికి సోమసుందరుడు అని పేరు . ఆయన మూర్తిగా అవతరిస్తే, పరమ ప్రకృతే (పార్వతీదేవి) ఆయనకీ వశమై పోయింది. పైగా ఆయన నిర్వ్యామోహుడు. దిగంబరుడై భిక్షాటన చేస్తున్నాడు . అప్పటికే సతీదేవి దక్షయజ్ఞంలో ప్రాణాలు అర్పించింది . దాంతో శక్తికి దూరమైన ఈశ్వరుడు అలా సంచరిస్తూ ఉన్నారు .  

అటువంటి సౌందర్య స్వరూపాన్ని చూసి కృష్ణుణ్ణి చూసిన గోపికల్లా, శివుని చూసి సమ్మోహితులయ్యారు  ఆ మునిపత్నులందరూ. వాళ్ళు ఆయన పాత్రని నింపేయడమే కాక , మంత్రించిన ముగ్ధల్లాగా ఆయన వెంటే అనుసరిస్తూ వెళ్ళసాగారు .   

స్నాన సంధ్యా విధుల్ని ముగించుకుని ఋషులందరూ తమ తమ ఆశ్రమాలకు తిరిగివచ్చారు. వారి ఆశ్రమాకాంతలు ఎవ్వరూ కనిపించలేదు . ఏం జరిగిందో తమ దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నారు . వారికి శివుని మీద పట్టలేని కోపం వచ్చింది. అందరూ మూకుమ్మడిగా ఆయనను చేరి, ‘ఓ పరమేశ్వరా ! నీవెంతో గొప్పవాడివి, విరక్తుడివి అనుకున్నాము. తాపసుల భార్యలను అవమానిస్తావా? ఇది నీకు న్యాయమేనా?’ అని మౌనంగా కైలాసం వైపు వెళుతున్న శివుడిని ఘోరంగా నిందించారు.  అంతటితో వారి ఆగ్రహం చల్లారక శివా ! నీవు ఇలాంటి పని చేసినందుకు ‘నీ లింగం నిలబడి నేలపై పడిపోవుగాక!! నీవు నపంసకుడివైపోగాక!! అని శపించారు. తమ శక్తికి కారణమైన పరమేస్వరుణ్ణి తమ భక్తితో శపించారు . 

ఆకారమే లేని శివుడు (నిరాకారుడు), మొహమనేదిలేని (నిర్మోహుడు) పరమేశ్వరుడు భక్తి అనే పాశానికి కట్టుబడ్డాడు. ఫలితంగా పరమేశ్వరుడి లింగం ఊడిపోయి భూమి మీద పడింది. శివుని శరీరం మామూలు శరీరము, అది తుచ్ఛమైన కామజనితమైన అంగమూ కాదు . ఆయన పరమ ఈశ్వరుడు . మహా ఈశ్వరుడు . పరమ ఆత్మ . ఈ సంఘటనని నీచమైన , బాహ్యమైన దృష్టితో చూసి, కుహనా ఆలోచనలు చేసేముందు ఈ పదాలకి అర్థం తెలుసుకోవాలి .  అలా తెలుసుకున్నా చాలు , పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది . 

ఆయనే ఈ విశ్వ స్వరూపం. మహా అగ్ని స్వరూపం . కాల స్వరూపం. ఈ విశ్వం . ఆయన లింగం అంటే అది సృష్టి బీజం కాదా ! అది నేల మీద పడగానే మహా వేగంగా ఏడు పాతాళ లోకాలను, మరో క్షణంలోఊర్ధ్వ లోకాలని ఆక్రమించింది. స్వర్గాది లోకాలన్నీ లింగంతో కప్పబడిపోయాయి.  భూమి లేదు, దిక్కులు లేవు, నీరు లేదు నిప్పు లేదు గాలి ఆకాశము ప్రకృతి ఇవేవీ లేనే లేవు అంతా లింగమైపోయింది. లింగము తప్ప రెండో విభాగమే లేదు.  అన్ని లింగంలోనే లీనం అయిపోయాయి (అధ్యాయం 6 స్కాంద పురాణం ). 

 ఈ విధంగా జగత్తు అంతా కూడా లింగంలో లయమై పోవడం సృష్టికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదైతే బీజములో ఉన్నదో అదేకదా మొక్కై ఎదుగుతుంది . అంటే ఆ బీజములో ఉన్నదే మొక్కలో ఉన్నది తప్ప వేరుకాదు . పరమాత్మలో ఉన్నదే ఆయన సృష్టిలో ఉన్నది . ఆయనకీ సృష్టికీ భిన్నత్వం ఎక్కడున్నది ? ఇంతకీ అలా అఖండమై , అంతమై  పెరిగిపోతున్న లింగాన్ని చూసి దేవర్షులందరూ ఆశ్చర్యపోయి, సృష్టి, స్థితికారకులని ఆశ్రయించారు . ముందుగా విష్ణుమూర్తిని “ ఓ శ్రీహరి నీవు లింగ మూలాన్ని కిందకు వెళ్లి చూడు.  బ్రహ్మదేవా! నీవీ మహాలింగం పైకి వెళ్లి దాన్ని శిరస్సు ఎక్కడి దాకా వ్యాపించిందో చూడు అని విన్నవించారు.  వారి మాట ప్రకారం శ్రీహరి పాతాళంలోకి, బ్రహ్మదేవుడు హంస వాహనాన్ని అధిరోహించి ఊర్ధ్వలోకం వైపు  ప్రయాణమయ్యారు. 

 బ్రహ్మదేవుడు ఎంత పైకి వెళ్ళినా శివలింగం అంతం ఎక్కడుందో చూడలేకపోయాడు.  అలాగే శ్రీహరి పాతాళంలో ఎంత లోతులోకి వెళ్లిన ఆ లింగం ఆదిని చూడలేకపోయాడు. ఆది మధ్యాంత రహితుడు అని ఆ మహేశ్వరుని ఊరికే అన్నారా !  బ్రహ్మగారు అంతాన్ని కనుక్కోలేక పైనుంచి వెనక్కి తిరిగి బయలుదేరారు.  దారిలో ఆయనకి మీరు పర్వతం మీద సురభి కనిపించింది ఆ ధీనువు బ్రహ్మదేనువ బ్రహ్మదేవా ఎక్కడి నుంచి తమరి రాక అని అడిగింది బ్రహ్మ నవ్వుతూ సురభి నన్ను దేవతలు ఈ లింగం అంతం ఎక్కడ వుందో కనుక్కోమన్నారు. అది కనుక్కొని తిరిగి వస్తున్నాను అని చెప్పారు. తాను ఈ లింగం అంతం కనుక్కోలేకపోయాను అనే  విషయాన్ని దేవతల ముందు ఒప్పుకోవడానికి బ్రహ్మగారికి అహం అడ్డొచ్చింది . తనకి , ఆ మహాలింగం అంతాన్ని చూశానని దొంగ సాక్ష్యం చెప్పడానికి ఆవునీ,  కేతకీ పుష్పాన్నీ  వెంటబెట్టుకొని వచ్చారు .  బ్రహ్మ మాటలు విని, ఆయనకీ వత్తాసు పలికిన సాక్ష్యాలని చూసి దేవతలంతా ఆయన్ని ప్రశంసించారు. 

అంతలో పాతాళం వైపు వెళ్ళిన శ్రీహరి పైకి వచ్చాడు.  “దేవతలారా ఈ మహా లింగం మొదలు ఎక్కడ ఉందో చూడాలని చాలా లోపలికి వెళ్లాను.  అయినా నాకు దాని మొదలు కనిపించలేదు.  గుప్త పాతాళ లోకాలు దాటి లోపలికి వెళ్ళిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంతా శూన్యంగా ఉన్నాయి.  ఎవరితో ఈ జగత్తుంత ఆ ధరించబడుతుందో, ఎవరి వల్ల మీరంతా జన్మించారో ఆ మహాదేవుడే ఈ లింగ రూపంలో అవతరించాడు” అని చెప్పాడు. ఇదీ గ్రహించాల్సిన విషయం .  

అది విని దేవతలు బ్రహ్మదేవుడు ఈ లింగం అగ్ర భాగాన్ని చూసి వచ్చాడని సంతోషంగా విష్ణువుకి చెప్పారు .  ఆయన ఆశ్చర్యపోయి, ఓ బ్రహ్మదేవా నిజమేనా ? అది అసాధ్యం ఇది నిజమేనా అసలు నీ వీ లింగాన్ని చూసినట్లు సాక్ష్యం ఏదైనా ఉన్నదా?” అని ప్రశ్నించాడు.  అప్పుడు బ్రహ్మ తిరిగి తన అబద్దాన్ని నిరూపించే ప్రయత్నం చేశాడు . అంతలో ఆకాశవాణి “ఈ సురభి కేతకి చెప్పింది అబద్ధం.  బ్రహ్మదేవుడు శివలింగం శిరస్సును చూడనే లేదు” అని చెప్పింది. నిరంతర కాలసాక్షి అయినా ఆ ఆకాశవాణి  మాటలు వినగానే ఇంద్రాది దేవతలు అందరికీ చాలా కోపం వచ్చింది.  అబద్ధపు సాక్ష్యం చెప్పిన సురభిని ‘నీ నోటితో అసత్యం పలికి  అపవిత్రమయ్యావు కనుక అన్ని ధర్మాలనుంచి నీవు బహిష్కరించబడుదువు గాక! నీ ముఖం అపవిత్రమవుగాక!” అని శపించారు.  అలాగే కేతకి పుష్పాన్ని కూడా” నీవు కూడా అసత్యం పలికావు కనుక, శివార్చనకి నీవు పనికిరాకుండుగాక!!” అని శపించారు. 

 అప్పుడు ఆకాశవాణి “బ్రహ్మదేవా! ధర్మ నిరతుడిగా ఉండాల్సిన నీవు అసత్యం చెప్పావు కనుక నీకు భూలోకంలో పూజలు లేకుండా పోతాయి” . కాని శపించింది ఆ విధంగా మహేశ్వరుడి మహాలింగం ఆద్యంతాలు తెలుసుకోలేక దేవతలందరూ ఆ దివ్యలింగాన్నే  శరణు వేడుకున్నారు.  సకల మునులు ఋషులు అందరూ కలిసి భయంతో ఈశ్వరున్ని స్తుతించారు. “ ఓ మహా ప్రభూ !గొప్ప కాంతి కలిగిన లింగానివి నీవు.  వేదాంతల చేత మాత్రమే నీవు తెలుసుకోగలిగిన వాడివి.  సచిదానంద స్వరూపుడవైన నీ చేతనే ఈ జగత్తు నిత్యముగా చేయబడుతోంది.  నీవే అన్ని లోకాలకు సాక్షివి.  మేధావివైన నీవే అందరినీ సంహరించే వాడివి.  మహాదేవా! జగత్పతీ ! నీవే రక్షకుడివి, నీవే భైరవుడివి. లింగ స్వరూపుడైన నీలో ఈ లోకాలన్నీ ఒదిగిపోయాయి .  ఈ దేవతలు అసురులు యక్షగంధర్వ రాక్షసులు సర్పాలు పిశాచాలు విద్యాధరులు అందరము నీ ముందు అల్ఫలమే! ఈ సమస్త విశ్వాన్ని సృష్టించే వాడివి నీవే!! నీవే  పరమ పురుషుడవు. దేవాధిదేవా  మహాదేవా  మమ్మల్ని రక్షించు! నీ పాదపద్మాలకు నమస్కారము.  అంటూ వారందిరితో కలిసి బ్రహ్మదేవుడు ఆ మహాలింగాన్ని ప్రార్ధించారు . 

 బ్రహ్మ స్తుతిని విన్న తర్వాత ఋషులు కూడా దివ్య లింగరూపు డైన శివుడిని తమదైన వాక్యాలతో ఈ విధంగా స్తుతి చేయడం ప్రారంభించారు. “ప్రభూ ! అజ్ఞానులమైన మేమంతా నీ దివ్య లింగం నిజరూపాన్ని తెలుసుకోలేకపోయాము. నీవే తల్లివి, తండ్రివి, బంధువు ,సఖుడవు .  నీవే ఈశ్వరుడివి.  వేదాలు తెలిసిన వాడివి.  ఏకత్వంతో విరాజిల్లే  అనేకుడివి .  మహా పురుషుల చేత ధ్యానించబడే వాడివి. వేరువేరు కర్రలలో ఉండే నిప్పులాగా నీవు కూడా అన్ని భూతాలలోనూ వేరువేరుగా ఉన్నప్పటికీ, నీవు ఒక్కడివే!! నీ నుంచే ఈ సర్వం వెలువడుతోంది. ఈ సృష్టి మొత్తం నీ నుంచి ఆవిర్భవిస్తోంది.  కనుక, నీవే శంబుడివి.  దేవతలమైన మేమంతా నీ పాదాలను శరణు వేడుకుంటున్నాం. ఈ జగత్తునంతా పాలించే ఓ శంకరా ! మమ్మల్ని కరుణించి రక్షించు” అని ప్రార్థించారు. 

 ఋషుల ప్రార్థన విన్న శంకరుడు శాంతమూర్తిగా ప్రత్యక్షమయ్యారు. తనకూ శ్రీహరికి భేదం లేదని చెప్పి, ఋషుల కోరిక మీద, తన మహాలింగ స్వరూపాన్ని  ఉపసంహరించి,  అన్ని లోకాల వారికి నిత్యం పూజించుకునేందుకు అనువుగా మార్చి, అన్ని లోకాలలో స్థాపించి, వాటిల్లో స్వయంగా కొలువయ్యారు. 

ఆవిదఃముగా విశ్వమంతా వ్వాపించిన పరమాత్మ, సత్య లోకంలో - బ్రహ్మేశ్వర లింగంగా, వైకుంఠంలో - సదాశివ లింగంగా, అమరావతి (స్వర్గంలో) అమరేశ్వర లింగంగా, పడమర దిక్కులో - వరుణేశ్వర లింగంగా, దక్షిణ కాశీలో కాళేశ్వర లింగంగా,  నైరుతి దిశలో నైరుతీశ్వర లింగంగా, వాయువ్యంలో పావనీస్వర లింగంగా, మృత్యు లోకంలో కేదారేశ్వర లింగంగా కొలువున్నాడు.  

అదేవిధంగా భూలోకంలో నర్మదా తీరంలో ఓంకారేశ్వరుడు గా, మహాకాళి క్షేత్రంలో మహా కాలుడిగా, కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుడిగా, ప్రయాగలో లలితేశ్వరుడిగా, బ్రహ్మగిరి లో త్రయంబకేశ్వరునిగా, గంగాసాగర సంగమ స్థలంలో భద్రేశ్వరునిగా, సౌరాష్టంలో సోమేశ్వరుడిగా, శ్రీశైలంలో మల్లేశ్వరుడిగా, వింధ్య గిరి మీద సర్వేశ్వరుడిగా, సింహళ దేశంలో సింహనాథునిగా, పాతాళ లోకంలో భోగేశ్వరుడిగా ఇలా వివిధ ప్రాంతాలలో తన దివ్య లింగాన్ని అనుగ్రహించి స్వయంగా వాటిలో కొలువై ఉన్నాడు సర్వేశ్వరుడు.  ఆ విధంగా పరమేశ్వరుడి మహాలింగం నుంచి అన్ని లోకాలలో కోట్లాది శివలింగాలు ఆవిర్భవించాయి.  ఇవన్నీ సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉండే దివ్య లింగాలు.  వీటిలో ఏ ఒక్క శివలింగాన్ని పూజించినా  అనంతమైన పుణ్యం కలుగుతుంది.  అంత్యకాలంలో శివ సాన్నిహిత్యం కూడా లభిస్తుంది. అని స్కాంద పురాణం చెబుతోంది . 

శివరాత్రినాడు ఇటువంటి శివలింగ దర్శనాన్ని చేయడం కోటిజన్మల పుణ్యఫలం . ఈ శివ రాత్రికి శివపూజ , అభిషేకము, జాగారమూ తదితర కైంకర్యాలతో ఆ ఈశ్వరుని ఆరాధిద్దాం . పూర్ణమైన విశ్వాసంతో పరమేశ్వరుని అర్చించి, ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం . శుభం . 

#shivaratri #sivaratri #lingodbhavakalam 

Tags: shiva, siva, sivaratri, shivaratri, lingodbhava kalam, sivanugraham

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi