Online Puja Services

ఏకాదశ రుద్రుల సమావేశం ప్రభల తీర్థం!!

18.189.185.63

ఏకాదశ రుద్రుల సమావేశం ప్రభల తీర్థం!! 
- లక్ష్మి రమణ 

రుద్రం చేస్తే, ఏకాదశ రుద్రాలు చేయడం  శ్రేయస్కరం అని చెబుతారు .  ఏకాదశ సంఖ్యలో ఉండే రుద్రులు ఒకే చోట సమావేశమైతే ఆ ప్రభ ఎలా ఉంటుందో చూడాలంటే ప్రభల తీర్థానికి వెళ్ళాలి . లోకకళ్యాణార్థం సమావేశమయ్యే ఏకాదశ రుద్రులని , ఆ తీర్థంలో జరిగే జాతర వైభవాన్ని చూడడానికి రెండుకళ్ళూ సరిపోవు .  సంక్రాంతి సంబరంలో గోదావరి జిల్లాల్లో జరిగే ప్రభల తీర్థం తీరు జోరు అద్భుతంగా ఉంటాయి .దాదాపు చుట్టుపక్కల ఉన్న 90 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటాయి . 400 ఏళ్ళకి పై చిలుకు చరిత్ర ఉన్న విశిష్టమైన ఈ రుద్రసమావేశం గురించి ఇక్కడ చెప్పుకుందాం . 

ప్రభలు అంటే ఏమిటి?

ఉభయ గోదావరి జిల్లాలూ, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని కృష్ణా జిల్లా గ్రామాల్లో జరిగే శివరాత్రి సంబరాలకి  వెదురు బొంగుల్నీ, టేకు చెక్కల్నీ నారతాళ్ళతో కట్టి దానికి రంగురంగుల బట్టలు తొడిగి శివుడి పటాల్తో, పూలదండల్తో, నెమలిపింఛాల్తో రకరకాలుగా అలంకరిస్తారు . వాటిని  మేళతాళాలతో ఆడంబరంగా చిందులు వేస్తూ ఊరేగించి శివాలయాల వద్దకు తీసుకువస్తారు .  ఆ ప్రభలను శివుని ప్రతిరూపంగా  భావిస్తారు. వాటితో పాటుగా సంక్రాంతికి  చేతికందిన పంటలో కొంత భాగాన్ని గుడికి కానుకగా ఇస్తూంటారు. ఇది ఎవరి ఆనవాయితీని బట్టి వారు నిర్వహిస్తుంటారు. ఇక్కడ ప్రభలు శివుడైతే, ప్రక్రుతి ప్రసాదించిన పౌష్యములు శక్తి స్వరూపంగా ఈ ఆచారం శివశక్తుల ప్రతీకగా జరుగుతుంది . 

ప్రభల తీర్థం :

కోనసీమ సంప్రదాయాలకు అద్దంపట్టే జాతర ప్రభల తీర్థం .  అమలాపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలోని జగ్గన్నతోటలో ప్రభలతీర్థం జరుగుతుంది. నిజానికి ఈ జగ్గన్నతోట ఒక కొబ్బరి తోట. సుమారు ఏడెకరాల విశ్తీర్ణంలో ఉంటుంది . ఇక్కడ ఆలయాలు గానీ, శివలింగాల స్థాపన గానీ ఏమీ ఉండదు .  సమీపంలోని మొసలపల్లి భోగేశ్వర స్వామి ముందుగా ఇక్కడికి రావాల్సిందిగా పరిసర గ్రామాల్లోని శివాలయాలకు ఆహ్వానం పంపుతారు . అక్కడ నుండి ఆయా గ్రామాల ప్రజలు ప్రభలు కట్టుకొని జగన్నతోటకి చేరుకుంటారు . వీటిని మామూలు రహదార్లపై తీసుకురారు. పొలాల మధ్యగా ఊరేగింపుగా తీసుకువస్తారు. పొలాల మధ్యనుంచి ప్రభలు రావడం వల్ల పంటలు బాగా పండుతాయని రైతులు భావిస్తారు. ప్రభలన్నింటినీ వరుసగా నిలిపివుంచి నృత్యవాయిద్యాలతో శివునికి ప్రీతి కలిగిస్తారు. భక్తులు ప్రభలకు నమస్కరించి ఆశీస్సులు అందుకుంటారు.  ఇలా ఇక్కడ లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని ప్రజల విశ్వాసం.

ఇలా మొదలయ్యింది :

అసలీ రుద్ర సమావేశాలు , ఎందుకు ఎలా మొదలయ్యాయి తెలుసుకుందాం .  ప్రభల తీర్థానికి వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొసలపల్లి గ్రామ సమీపంలో విఠల జగ్గన్న అనే ఏక సంథాగ్రాహి ఉండేవాడు. అతడు కౌశికీ నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకిందే ఎప్పుడూ ఉండేవాడు. ఆ చెట్టుకింద గ్రామదేవత నెలకొని ఉండేది. విఠల జగ్గన్నపై ఈర్ష్యకలిగినవారు కొందరు నిజాం నవాబు ప్రతినిధులకి ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో నిజాం నవాబుని కలిసినప్పుడు జగ్గన్న ప్రతిభ బయటపడింది. అతని పాండిత్యాన్ని చూసి మెచ్చుకున్న నవాబు, ఆ మర్రిచెట్టుతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగువందల ఎకరాలు బహుమానంగా రాసిచ్చాడు. ఫిర్యాదు చేసిన ప్రజల ఆనందం కోసం జగ్గన్న మొదటిసారి ప్రభల తీర్థం జరిపాడు. దేవుడికి గుళ్లు గోపురాలు అవసరం లేదని, దైవానికి మైల అంటదని చెప్పేందుకే ప్రభల తీర్థం ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా ప్రభలను ఎవరైనా మోయవచ్చు.

 ఈ ప్రభలని మోయడానికి కుల మత  విచక్షణ లేదు . వైభవోపేతంగా మేళతాళాలతో , అద్భుతమనే రీతిగా అలంకరించిన ప్రభలని భోగేశ్వర స్వామి ఆహ్వానం అందుకున్న గ్రామాల నుండీ ప్రజలు మోసుకు వస్తారు . దారంతా ప్రభలని మోస్తూ నడుచుకొంటూ సభాక్తికంగా వారు తీసుకొచ్చే ప్రభల రూపంలోకి ఆ భక్తి శ్రద్ధలకి లోబడి పరమేశ్వరుడు ఆవహించి వస్తారని నమ్మకం . నిజంగానే అటువంటి దృష్ఠంతరాలు కూడా ఉన్నాయని స్థానికులు అనేక గాథలు చెబుతారు .   

ఇంతకీ ఎవరా ఏకాదశ రుద్రులూ ?

శ్రీ వ్యాఘ్రేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం
శ్రీ మేనకేశ్వర స్వామి, కె.పెద్దిపూడి
శ్రీ ఆనంద రామేశ్వర స్వామి, ఇరుసుమండ
శ్రీ విశ్వేశ్వర స్వామి, వక్కలంక
శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి, నెదునూరు
శ్రీ రాఘవేశ్వర స్వామి, ముక్కామల
శ్రీ భోగేశ్వర స్వామి, మొసలపల్లి
శ్రీ మల్లికేశ్వర స్వామి, పాలగుమ్మి
శ్రీ వీరేశ్వర స్వామి, గంగలకుర్రు అగ్రహారం
శ్రీ చెన్న మల్లేశ్వర స్వామి, గంగలకుర్రు
శ్రీ అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, పుల్లేటికుర్రు

అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరుడు  :

ఈ ఉత్సవం జరిగేది మొసలపల్లిలో ఉన్న తోటలో కాబట్టి ఆ ఊరి రుద్రుడైన భోగేశ్వరుడు మిగతా ఉళ్ళ నుంచి వచ్చే రుద్రులకు ఆతిథ్యం ఇస్తాడు. ఈ సమావేశానికి వ్యాఘ్రేశ్వరుడు అధ్యక్షత వహిస్తాడు, అంచేత వ్యాఘ్రేశ్వరుడి ప్రభ తోటలోకి ప్రవేశించగానే మిగతా రుద్రులందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడతారట, అందుకని భక్తులు ప్రభలన్నిటినీ "హర హర" "శరభ శరభ" అంటూ ఒకేసారి పైకిలేపుతారు. 

ఆలశ్యంగా వచ్చే వీరేశ్వరుడు : 

అందరికంటే ఆలస్యంగా గంగలకుర్రు అగ్రహారపు వీరేశ్వరుడు సమావేశానికి వస్తాడు. ఈయన ప్రభ వచ్చే దారిలో కౌశికీ నదిని దాటుతూ రావాల్సి ఉంటుంది, ఆ నదిని దాటించే దృశ్యం నయనానందకరంగా ఉంటుందని చెప్తారు. ఈ వీరేశ్వర రుద్రుడు వచ్చే సరికి సాయంత్రం అవుతుంది, ఈ రుద్రుడి ప్రభ తోటకు చేరిన కొద్దిసేపటి ఉత్సవం ముగుస్తుంది. 

ఉత్సవం ముగిశాక , రుద్రలందరూ తిరిగి తమ ప్రభల మీద తమతమ గ్రామాలకు చేరుకుంటారు. ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు, దీన్ని చూడటానికి వేలల్లో జనం దేశ విదేశాల నుండీ  ప్రతి ఏటా ఈ ప్రాంతానికి వస్తారు. మన ప్రధాని నరేంద్ర మోడీ 2020లో ఈ ఉత్సవానికి గానూ శుభాకాకంక్షలు తెలపడంతో దేశవిదేశాల్లో సైతం ఈ జాతర మరింత ప్రాచుర్యాన్ని పొందింది . ఒక గ్రామీణ ఉత్సవం ఇంత గొప్ప ప్రాధాన్యతని పొందడం చాలా గొప్ప విషయం .  ఈ ఉత్సవం తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట మండలం లో ఉన్న మొసళ్ళపల్లి గ్రామంలో జరుగుతాయి

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi