అరుణాచలం పేరు తలిస్తే చాలు
అరుణాచలం పేరు తలిస్తే చాలు , లౌకిక , అలౌకికాలు లభ్యమైనట్టే !!
- లక్ష్మి రమణ
అరుణాచలం ఒక కొండా? కాదు అది వెలుగుతున్న అండ . కొండంత అండ . ఆ పేరే ఒక మహామంత్రం . ఆ కొండమీద ఉన్నది మాత్రమే కాదు దైవం , ఆ కొండే ఒక శివం. అంతటి మహత్యం ఉన్న గిరి అరుణగిరి. ఆ కొండమీద ఉన్న మహత్యం ఎలాటిది అంటే, ఒక ఇనుముని ఆకర్షించే అయిస్కాంతంలాగా ఆధ్యాత్మిక భావన ఉన్న ప్రతి ఒక్కరినీ తనవైపు ఆకర్షింస్తుంది. ఆ ఆకర్షణలో బలం ఎంత గొప్పదంటే, బంధాలనీ , ఐశ్వర్యాన్ని వదిలేసి ఆ కొండ ఛాయల్లో నిలిచిపోతే బాగుంటుంది అనేంత బలమైనది . అదీ అరుణగిరి మహత్యం . ఒక్కసారి అరుణాచలశివ అని మనస్ఫూర్తిగా ఆనండి చాలు, ముక్తికాంత వరమాల పట్టుకొని మరీ వస్తుంది . ఒక జీవికి ఇహపరాలలో ఏమేమి కావాలో అవన్నీ అనుగ్రహించే అచలము అరుణాచలము. ఆ గిరికి ప్రదక్షణ చేయడం అంటే, ప్రత్యక్షంగా ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షణ చేయడమే !
ఆగమ ప్రధానులకి అరుణాచలేశ్వరుడు అరుణాచల ఆలయంలో ప్రతిష్టించబడిన లింగస్వరూపం అని అర్థం మయ్యారు. పౌరాణికులు అరుణాచల పర్వతం భక్తులకు శివస్వరూపం అంటారు . యోగులు పరంజ్యోతి స్వరూపంగా , దానికి అతీతమైనదని అభివర్ణిస్తారు. జ్ఞానోపాసకులకు అరుణాచలేశ్వరుడు హృదయస్తుడైన పురుషుడు. నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి అరుణాచలమే! భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీనమైన కొండ అరుణాచలం. ఇలా ఎవరికి తోచినట్లు వారు అరుణాచలాన్ని అర్థం చేసుకున్నారు. ఆ విధంగా దర్శనం చేశారు .
నిజానికి అరుణగిరి స్వయంగా ఆ రూపంలో ఉన్న దక్షిణామూర్తి. సాక్షాత్తు స్వామి అమ్మవారు అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారక్కడ . ఇక్కడ అప్రయత్నంగానే ధ్యానంలోకి వెళ్ళిపోతాం. సమయం తెలియకుండా ధ్యానంలో ఉండిపోతాం. చిత్తవృత్తులని నిరోధించమే యోగం అయితే, ఆ ఆల్కెమీ ఈ కొండ దగ్గర దొరుకుతుంది . మనసులో ఒక అలలా అరుణాచలేస్వరుని పేరు తలచినా , ఆ స్మరణ మీద చిత్తం నిలిచిపోతుంది. భవబంధాలు, ఇహలోక ఈతిబాధలు , తామర టెంపరగా పుట్టుకొచ్చే ఆలోచనల మనసు మాయాజాలాలూ ఆ అరుణ గిరీశ్వరుని కాంతుల్లో చిక్కి మాయమైపోతాయి . భగవంతుని దివ్యత్వం స్వీకరిస్తూ , అనుభవిస్తూ , మనసు లౌకికం వదిలేసి, అలౌకికం అయిన ఆ పరమాత్మ ధ్యానంలోకి అలవోకగా జారిపోతుంది . అక్కడ సమయం నిలిచిపోతుంది .
భగవాన్ శ్రీ రమణ మహర్షి తన మాటల్లో అనేక పర్యాయాలు అరుణాచలం గురించి ప్రస్తావించారు. అరుణాచలం అంటే సాక్షాత్తు కైలాసమే! ఈ క్షేత్రంలో ప్రతి శిలా శివలింగమే! ఈ క్షేత్రంలో తీసుకున్న ఆహారము, నీరు అమృతమే! ఈ క్షేత్రంలో ఏం మాట్లాడుకున్నా అది శివ స్తోత్రము. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసిన అది శివ పూజ. అరుణ గిరి ప్రదక్షణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్లే! గిరి చుట్టూ ఉన్న 24 మైళ్ళ లోపున ఎక్కడ మరణించిన వారికి ముక్తి తధ్యం . కాశీలో మరణిస్తేనే ముక్తి కలుగుతుందేమో! కానీ అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి కలుగుతుంది . దీనిని బట్టి అరుణాచలం ఎంత గొప్ప విశిష్టత కలిగిన క్షేత్రమనేది అర్థం చేసుకోవచ్చు .
గిరులు దేవతలకి నివాసస్థానాలుగా ఉన్నాయని శృతుల ద్వారా తెలుస్తోంది. భక్తులే గిరులుగా మారి , ఆ దేవతలకి ఆవాసాలుగా మారిన ఉదంతాలూ ఉన్నాయి . కానీ అరుణాచలం అటువంటి కొండ కాదు . స్వయంగా ఆ ఈశ్వరుడే ఆ కొండ. జీవుడు దేహంతో తాదాత్మ్యత చెందినట్లే, పరమశివుడు ఈ కొండతో తాదాత్మ్యత చెందాడు. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వాళ్లకు కనిపించాలని శివుడే అరుణగిరిగా కొండ రూపాన్ని దాల్చాడు. అగ్ని స్వరూపుడు ఇక్కడి రుద్రుడు .
అందుకే అరుణగిరి ప్రదక్షిణ చేసేప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకొని పాటించాలి .
గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రద్ధగా చెయ్యాలి. భగవంతుడే ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నారన్న భావంతో చేయాలి .
భక్తితో ఆనందిస్తూ చెయ్యాలి. వ్యర్థ ప్రలాపన చేయకూడదు.
భగవాన్ నామాన్ని స్మరిస్తూ అడుగు ముందుకు సాగించాలి .
వీలున్నంత వరకూ దారిలో ఎదురయ్యే బీదలకి, సాధువులకీ దానం చేయండి .
ఎవరైనా మిమ్మల్నే ప్రత్యేకించి దానం అడిగితె, కాదనకుండా తోచినంత ఇవ్వండి .
హడావుడిగా కాకుండా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఆ కొండని మీ గుండెలో నింపుకొని, ఆ కొండ వేడిని హృదయంలో అనుభూతి చెందండి .
కొండ చుట్టూ ఉన్న క్షేత్రాలని చూసుకొంటూ ప్రదక్షిణ పూర్తిచేసి , అరుణాచలేశ్వరుని దర్శించండి .
అరుణాచలంలో అరుణాచలేశ్వరుడి నామాన్ని జపించడం ఎన్నో జన్మల పుణ్యఫలము. సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సర్వేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ !!
#arunachalam #giripradakshina
Tags: shiva, arunachala, siva, giri pradakshina, ramana maharshi